Ashwin about Nawaz Wide Ball: నేను రిటైరయ్యే వాడిని.. నవాజ్ వైడ్ బాల్‌పై జోక్ చేసిన అశ్విన్
26 October 2022, 21:59 IST
- Ashwin about Nawaz Wide Ball: నవాజ్ వేసిన వైడ్ బాల్‌పై అశ్విన్ జోక్ చేశాడు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో చివరి బంతికి రన్ తీసి అశ్విన్ టీమ్‌ను గెలిపించిన విషయం తెలిసిందే.
అశ్విన్ గెలుపు సంబరం
Ashwin about Nawaz Wide Ball: పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ నవాజ్ వైడ్ బాల్ వేయడం, అంతటి ఒత్తిడిలో దానిని కచ్చితంగా అంచనా వేసి అశ్విన్ వదిలేయడం, ఆ తర్వాత బంతిని కూడా కూల్‌గా మిడాఫ్ మీదుగా ఆడటంతో అతడు పెద్ద హీరో అయిపోయాడు. అంతటి ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లి కూడా ఆ సమయంలో అశ్విన్ చాలా తెలివిగా ఆడాడని మెచ్చుకున్నాడు.
అయితే నవాజ్ ఒకవేళ ఆ వైడ్ బాల్ వేయకపోయి ఉంటే తానేం చేసేవాడినో చెబుతూ అశ్విన్ జోక్ చేశాడు. మాజీ క్రికెటర్ హృషికేష్ కనిత్కర్‌తో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందర్భంగా అశ్విన్ ఆ చివరి ఓవర్ గురించి మాట్లాడాడు. నవాజ్ వేసిన ఆ బాల్ ఒకవేళ టర్న్ అయి వచ్చి తన ప్యాడ్‌కు తగిలి ఉంటే.. తాను ఇక రిటైర్మెంట్ ప్రకటించే వాడినని అశ్విన్ చెప్పడం విశేషం.
"నవాజ్ వేసిన ఆ బాల్ టర్న్ అయి నా ప్యాడ్‌కు తగిలి ఉండి ఉంటే.. నేను ఒకటే పని చేసే వాడిని. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి నా ట్విటర్ అకౌంట్ ఓపెన్ చేసి.. థ్యాంక్యూ సోమచ్, నా క్రికెట్ కెరీర్ అద్భుతంగా సాగింది. మీ అందరికీ కృతజ్ఞతలు" అని చెప్పేవాడినంటూ అశ్విన్ పెద్దగా నవ్వాడు. నిజానికి ఆ సమయంలో తాను బ్యాటింగ్‌కు దిగేలా చేసిన దినేష్ కార్తీక్‌ను తిట్టుకుంటూ క్రీజులోకి వెళ్లినట్లు కూడా అశ్విన్ చెప్పాడు.
అయితే అంత తీవ్రమైన ఒత్తిడిలో అశ్విన్ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి టీమ్‌ను గెలిపించడంతో హీరోగా మారిపోయాడు. అలాంటి సమయంలో బాల్ వైడ్ వెళ్తుందని వదిలేయడానికి ధైర్యం కావాలి. మరెవరైనా క్రీజులో ఉండి ఉంటే ఆ బాల్‌ను కూడా ఆడటానికి ప్రయత్నించే వారేమో. ఒక బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో అశ్విన్ ఆ బాల్‌ను వదిలేయడం, అది వైడ్‌గా మారి స్కోర్లు సమం కావడంతో చివరి బంతికి అతడు సులువుగా సింగిల్ తీసి టీమ్‌ను గెలిపించాడు.