Arun Dhumal on Sourav Ganguly: అధ్యక్షుడిగా గంగూలీ నేతృత్వంలో అందరూ సంతృప్తిగా ఉన్నారు.. అరుణ్ ధుమాల్ వ్యాఖ్యలు
14 October 2022, 20:51 IST
- Arun Dhumal on Sourav Ganguly: మూడేళ్ల పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ నేతృత్వంలో అందరూ సంతృప్తిగా ఉన్నారని బోర్డు కోశాధికారిగా పనిచేసిన అరుణ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఒక్కరూ కూడా మాట్లాడలేదని తెలిపారు.
సౌరవ్ గంగూలీ
Arun Dhumal on Sourav Gaguly: భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీ కాలం ముగియనున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల పాటు ఈ బాధ్యతలు మోసిన గంగూలీ స్థానంలో భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ రానున్నారు. ఈ అంశంపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పందించారు. గంగూలీ ఆధ్వర్యలో బోర్డు ఎలా నడిచిందనేదానిపై మాట్లాడుతూ.. దాదా నేతృత్వంలో అందరూ సంతృప్తిగా ఉన్నారని స్పష్టం చేశారు. గంగూలీకి వ్యతిరేకంగా ఒక్కరూ కూడా మాట్లాడలేదని, మరోసారి అతడు పగ్గాలు చేపట్టకపోవడంపై వస్తున్న అనుమానాలను అరుణ్ ధుమాల్ నివృత్తి చేశారు.
"స్వతంత్ర భారతదేశంలో మూడేళ్లకు పైగా బీసీసీఐకి అధ్యక్షుడిగా పనిచేసిన వారెవరూ లేరు. మీడియాలో వచ్చిన ఊహాగానాలు లేదా కొంతమంది సభ్యులు అతడికి వ్యతిరేకంగా ఉన్నారనేది నిరాధారమైనవి. గంగూలీకి వ్యతిరేకంగా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదను. మొత్తం జట్టులో బోర్డు సభ్యులందరూ చాలా సంతోషంగా, సంతృప్తితో ఉన్నారు. కోవిడ్-19 ద్వారా సవాళ్లు ఎదురైనప్పటికీ గత మూడేళ్లలో బీసీసీఐ ఎలా నడిచిందో తెలిసిందే." అని అరుణ్ ధూమల్ తెలిపారు.
దాదా భారత కెప్టెన్‌గా విశిష్టమైన కెరీర్‌ను కలిగి ఉన్నాడని, అత్యుత్తమ నాయకుల్లో ఒకడని, నిర్వాహకుడిగా జట్టు ముందుకు తీసుకెళ్లాడని అరుణ్ ధుమాల్ తెలిపారు. తామంతా ఓ జట్టుగా పనిచేశామని స్పష్టం చేశారు.
"రోజర్‌తో పాటు దాదా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన కొత్త వ్యక్తులు అక్కడ ఉన్నారు. అంతేకాకుండా దాదాతో కూడా మాట్లాడారు. ఐపీఎల్ పదవిని ఆఫర్ చేశారు. కానీ అందుకు గంగూలీ అంగీకరించలేదు. రోజర్‌కు ఇప్పుడు వయస్సు 67.. అధ్యక్ష పదవీకి గరిష్ఠ వయోపరిమితి 70. ఆయన మాకు ప్రపంచకప్ విజేత. గంగూలీ ఐపీఎల్ ఛైర్మన్ పదవీని ఆశించినట్లయితే నేను వదులుకునే వాడిని. అందుకు నేను సిద్ధంగానూ ఉన్నాను. కానీ ఆయన అలా చేయలేదు." అని అరుణ్ ధుమాల్ తెలిపారు.