Aakash Chopra on WPL: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ సక్సెస్ అవుతుందా కాదా.. ఈ మూడే డిసైడ్ చేస్తాయంటున్న ఆకాశ్ చోప్రా
26 January 2023, 15:56 IST
- Aakash Chopra on WPL: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ సక్సెస్ అవుతుందా కాదా అనేది ఈ మూడు విషయాలు డిసైడ్ చేస్తాయని అన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. డబ్ల్యూపీఎల్ టీమ్స్ కు భారీ ధర పలకడంపై అతడు స్పందించాడు.
వుమెన్స్ ప్రీమియర్ లీగ్
Aakash Chopra on WPL: మహిళల క్రికెట్ లో ఓ పెను మార్పును వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తీసుకురాబోతున్నట్లు ఈ లీగ్ జట్లకు వచ్చిన బిడ్లను చూస్తే స్పష్టమవుతోంది. ఈ లీగ్ లోని ఐదు జట్లు కలిపి బీసీసీఐకి ఏకంగా రూ.4669.99 కోట్లు తీసుకొచ్చాయి. ఇది తొలి ఐపీఎల్ సీజన్ లో ఉన్న 8 జట్లకు వచ్చిన దాని కంటే చాలా ఎక్కువ కావడం విశేషం.
మరి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆ స్థాయిలో సక్సెస్ అవుతుందా లేదా? దీనికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. అసలు ఈ టోర్నమెంట సక్సెస్ కు అయినా మూడు అంశాలు దోహదపడతాయంటూ అవేంటో చోప్రా వివరించాడు. తన యూట్యూబ్ ఛానెల్లో అతడు ఈ లీగ్ పై స్పందించాడు.
"వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వచ్చేసింది. ఇది క్రికెట్ కే కాదు ఇండియన్ స్పోర్ట్స్ కే చారిత్రకమైన రోజు. నా వరకూ ఓ టోర్నమెంట్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది" అని చోప్రా చెప్పాడు.
ఇందులో మొదటిది మహిళల క్రికెట్ పై దేశంలో ఉన్న ఆసక్తి. ఇప్పటికే అభిమానులు తమకున్న అభిమానాన్ని చాటి చెప్పారని ఆకాశ్ చోప్రా అన్నాడు. "ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం డీవై పాటిల్ స్టేడియానికి 45 వేల మంది వచ్చారు. స్టేడియంలోకి ఉచితంగా పంపించి, బహుమతులు ఇస్తామని చెప్పినా ఇది చాలా ఎక్కువ సంఖ్యే. ఆ ఆటపై మమకారం ఉంటేనే ఈ స్థాయిలో వస్తారు. ఆ లెక్కన అభిమానులు మహిళల క్రికెట్ చూడాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది" అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
ఇక రెండో అంశం ఈ లీగ్ పై బ్రాడ్‌కాస్టర్లు చూపిన ఆసక్తి. వచ్చే ఐదేళ్లకు టీవీ హక్కుల కోసం భారీ మొత్తం వెచ్చించడం చూస్తే ఈ లీగ్ ను చూపించడానికి బ్రాడ్‌కాస్టర్లు కూడా బాగానే ఆసక్తి చూపిస్తున్నట్లు తేలిందని ఆకాశ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ రెండో ఖరీదైన క్రికెట్ టోర్నమెంట్.
ఇక ఫ్రాంఛైజీల కోసం సంస్థలు చూపించిన ఆసక్తి కూడా ఎలా ఉందో బిడ్డింగ్ ప్రక్రియ చూస్తే స్పష్టమవుతోంది. ఈ లీగ్ కు ఆ స్థాయి రిటర్న్స్ ఇచ్చే సత్తా ఉన్నట్లు ఇండస్ట్రీ గుర్తించిందని ఆకాశ్ చోప్రా అన్నాడు.