Hanuman chalisa: హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి
23 December 2023, 16:00 IST
- Hanuman chalisa: హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా పఠించడం వల్ల హనుమంతుడి అనుగ్రహంతో పాటు శ్రీరాముడి కటాక్షం కూడా పొందుతారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
హనుమాన్ చాలీసా పఠించడానికి నియమాలు
Hanuman chalisa: శ్రీరాముడికి పరమ భక్తుడు ఆంజనేయ స్వామి. హిందూమతంలో శక్తివంతమైన వ్యక్తి హనుమంతుడు. ఆయన భక్తికి, బలానికి, అచంచలమైన విధేయతకు ప్రతిరూపం. శ్రీరాముని పట్ల ఆయనకున్న భక్తి ఎలాంటిది అంటే సంజీవని మొక్క కోసం పర్వతం తీసుకొచ్చేంత. అంజనీ పుత్రుడు, హనుమంతుడు, ఆంజనేయుడు అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు.
అంకితభావానికి, విధేయతకు చక్కని ఉదాహరణ హనుమంతుడు. తిరుగులేని రామభక్తి హనుమంతుడిని దేవుడిని చేసింది. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల సాధించలేని ఎన్నో పనులు సులభంగా పూర్తి చేసుకోగల శక్తి లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తమ జీవితంలోని అడ్డంకులని అధిగమించి విజయం సాధించడం కోసం హనుమంతుడి ఆశీస్సులు కోరుకుంటారు.
భయంగా అనిపించినప్పుడు, దుష్ట శక్తుల్ని తరిమి కొట్టేందుకు ఎక్కువగా హనుమాన్ చాలీసా పఠిస్తారు. హనుమంతుడు భక్తులకి చాలా దగ్గరగా ఉంటాడు. అందుకే భక్తుల విన్నపాలు చాలా త్వరగా ఆయన్ని చేరుకుంటాయి. హనుమంతుని ఆశీర్వాదం పొందేందుకు హనుమాన్ చాలీసా పఠించడం ఒక అద్భుతమైన మార్గమని చెబుతారు. హనుమాన్ చాలీసాని 108 సార్లు అత్యంత ఏకాగ్రతతో భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు.
హనుమాన్ చాలీసా ఎవరు రాశారు?
హనుమాన్ చాలీసాని తులసీదాస్ రచించాడు. రామనామం అన్నింటికంటే శక్తివంతమైనదని అంటాడు. రామనామం జపించి చనిపోయిన ఒక వ్యక్తిని తులసీదాస్ బతికిస్తాడు. దీంతో రామనామ దీక్ష తీసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. మతమార్పిడి చేస్తున్నాడనే అభియోగంతో ఢిల్లీ మతగురువు పాదుషాకి కోపం వచ్చి తులసీదాస్ ని జైల్లో వేయిస్తాడు. చెరసాలలో ఉన్న తులసీదాస్ శ్రీరాముడిని, హనుమంతుడిని ఆరాధిస్తాడు. అప్పుడు వేల సంఖ్యలో కోతులు అక్కడికి వచ్చి సైనికుల మీద దాడి చేస్తాయి.
తులసీదాస్ భక్తి భావానికి మెచ్చిన హనుమంతుడు రామదండుతో అక్కడ దర్శనమిస్తాడు. అప్పుడు తులసీదాస్ తన్మయత్వంతో స్వామి వారికి చేతులు జోడించి స్తుతి గీతం ఆలపిస్తాడు. అదే హనుమాన్ చాలీసాగా మారింది. కష్టాల్లో ఉన్న ఎవరైనా హనుమాన్ చాలీసా పఠిస్తే హనుమంతుడు ప్రత్యక్షమై కష్టాలు తీరుస్తాడని నమ్ముతారు.
హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఈ నియమాలు పాటించాలి
హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. మంగళవారం నాడు శుభ్రంగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించాలి. ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత సీతారాములని పూజించాలి. తర్వాత హనుమాన్ కు నమస్కరించి హనుమాన్ చాలీసా పఠించాలి. కుశాసనం మీద కూర్చుని హనుమాన్ చాలీసా చదవాలి. చాలీసా పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు, కష్టాలు, శ్రమలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా చదవాలని అనుకుంటే మద్యపానం, ధూమపానం వంటి చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. మాంసాహారం తీసుకోకూడదు. పిల్లలు హనుమాన్ చాలీసా పఠిస్తే జ్ఞానవంతులుగా ఎదుగుతారని నమ్మకం.