Dharma Sandehalu: గుమ్మానికి తోరణాలు ఎందుకు కడతారు? వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం
27 November 2024, 18:00 IST
- Dharma Sandehalu: పండుగలు, శుభకార్యాలు వచ్చిందంటే చాలు ఇంటకి గుమ్మానికి తోరణాలు కడుతుంటారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ సంప్రదాయం వెనకున్న ఆంతర్యం ఏంటో మీకు తెలుసా? గుమ్మానికి తోరణం కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
గుమ్మానికి తోరణాలు ఎందుకు కడతారు
హిందూ ఆచార వ్యవహారాల్లో ఇంటి గుమ్మానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఇంటి గుమ్మాన్ని చూసి ఇంట్లో వాతావరణాన్ని చెప్పచ్చని చాలా మంది అంటుంటారు. అందుకే చాలా మంది ఇంటి గుమ్మాన్ని తోరణాలతో పూల దండలతో అందంగా అలంకరించుకుంటారు. తోరణాలు కేవలం అలంకరణ కోసమేనా లేక ఇతర ఆధ్యాత్మిక కారణాలేమైనా ఉన్నాయా అంటే కచ్చితంగా ఉన్నాయనే చెబుతోంది వాస్తు శాస్త్రం. హిందూ సిద్ధాంతాలు చాలా వరకూ వాస్తుపై ఆధారపడి ఉంటాయి. వాస్తు కేవలం నిర్మాణ శాస్త్రం మాత్రమే కాదు వేద శాస్త్రంతో అనుబంధం కలిగి ఉండి వ్యక్తి జీవనశైలి, పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. వాస్తు నియమాలను పాటించడం వల్ల వ్యక్తి తన పరిసరాలలో ఆనందం, ప్రశాంతత, సానుకూల ప్రభావాలను పొందగలడని నమ్మిక.
తోరణాలు ఎందుకు కడతారు?
వాస్తు శాస్త్రంలో తోరణాలకు ప్రాముఖ్యత ఎక్కువ. సాధారణంగా ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను, బంతి పూలను తోరణంగా కడతారు. హిందువులుండే ప్రతి ఇంటి గుమ్మానికి తోరణాలు తప్పకుండా ఉంటాయి. ఇల్లు అందంగా కనిపించడం కోసం, అలంకరణలో భాగంగా మాత్రమే వీటిని కట్టరు. వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానకి మామిడి ఆకు తోరణాలు కట్టడం వల్ల వాస్తు దోషాలు తొలగాపోతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఇంటికి తోరణాలు కట్టడం వల్ల ఆర్థిక వృద్ధికి కారకురాలైన లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆకర్షించవచ్చు.ఆమె అనుగ్రహాన్ని సులువుగా పొందవచ్చు.
గుమ్మానికి తోరణాలు కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?
- పురాణాల ప్రకారం మామిడి చెట్టు, దాని ఆకుల్లో లక్ష్మీ దేవి, గంధర్వుడు, గోవర్ధనుడు, సంతానం కలిగించే దేవ దేవతలు ఉంటాయి. వీటిని దండగా చేసి గుమ్మానికి కట్టడం వల్ల శివ పార్వతుల పుత్రులైన వినాయకుడు, మురుగన్ లు సంతోషిస్తారని, దీంతో పూర్తి శివకుంటుంబ ఆశీస్తులు ఆ ఇంటిపై ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
- తలుపు దగ్గర అశోక ఆకులు లేదా మామిడి ఆకులను వేలాడ దీయడం వల్ల దుష్ట శక్తులు, ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే ఇవి ఇంట్లోకి అదృష్టాన్ని తెచ్చిపెడతాయని నమ్ముతారు. గుమ్మానికి తోరణాలు కట్టడం వల్ల ఇంటి యజమాని కోరిన కోరికలు నెరవేరతాయని చెబుతారు.
- మామిడి పంట శ్రేయస్సును, శుభ ఫలాన్ని సూచిస్తుంది. ఇంటి గుమ్మానికి మామిడి ఆకులను తోరణంగా కడితే ఆ ఇంటికి శ్రేయస్సు, శుభం కలుగుతాయని నమ్మిక.
- సైన్స్ పరంగా చూస్తే ఆకుపచ్చగా ఉండే మామిడి ఆకులను గుమ్మానికి వేలాడదీయడం వల్ల చుట్టు పక్కలంతా ఆక్సిజన్ పంపిణీ జరుగుతుంది. ఈ ఆకులు చెడు గాలిని పీల్చుకని శుధ్ది చేసిన గాలిని బయటకు వదులుతాయి. పరిసరాలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా మారతాయి.ఫలితంగా ఇంట్లో వారు ఆరోగ్యంగా ఉంటారు.
- ఆకుపచ్చ రంగు ఇంట్లోకి సానుకూల శక్తులను ఆకర్షించి టెన్షన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను తగ్గించి ఓదార్పు కలిగిస్తుంది.
- వాస్తు శాస్త్రం ప్రకారం ఆకుపచ్చగా ఉండే మామిడి ఆకులు రాబోయే అవకాశాలకు నివాసంగా పరిగణించబడతాయి. ఇవి మంచి అవకాశాలను మరింత ఆకర్షిస్తాయి.
(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడంలేదు. వేరు వేరు వెబ్ సైట్లు, నిపుణుల సలహాల మేరకు వీటిని పొందుపరుస్తున్నాం. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించే ముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.)