Navaratri fasting: పురాణాల ప్రకారం నవరాత్రికి తొలిసారి ఉపవాసం చేసింది ఎవరో తెలుసా?
07 October 2024, 17:24 IST
- Navaratri fasting: నవరాత్రి ఉపవాసం చాలా మంది ఆచరిస్తారు. అయితే పురాణాల ప్రకారం తొలిసారి నవరాత్రి ఉపవాసం ఆచరించింది ఎవరో తెలుసా? శ్రీరాముడు. రావణాసురిడి మీద గెలిచేందుకు రాముడు నవరాత్రి ఉపవాసం ఆచరించాడు.
దేవి నవరాత్రులు
ప్రస్తుతం దేవి నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 12 విజయదశమితో ఈ వేడుకలు ముగుస్తాయి. చివరి రోజు రావణుడి దిష్టి బొమ్మలను దహనం చేస్తూ సంబరాలు చేసుకుంటారు. నవరాత్రుల్లో ఉపవాసం ఆచరిస్తారు.
తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. కొందరు నిర్జల ఉపవాసం అంటే నీరు తీసుకోకుండా ఉంటారు. మరికొందరు కేవలం పండ్లు, గింజలు వంటి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకునేందుకు ఇష్టపడతారు. నవరాత్రి సమయంలో ఉపవాసం చేయడం వల్ల దుర్గాదేవి తమ పాపాలన్నింటినీ శుభ్రపరుస్తుందని నమ్ముతారు. మనసు, శరీరాన్ని శుద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అసలు నవరాత్రికి మొదటిగా ఉపవాసం చేసింది ఎవరో తెలుసా? పురాణాల ప్రకారం నవరాత్రి ఉపవాసం మొదట ఆచరించింది ఇంకెవరో కాదు శ్రీరామ చంద్రుడు.
శ్రీరాముడు ఎందుకు చేశాడంటే
శ్రీ మహా విష్ణువు అవతారం మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. దుర్గాదేవి ఆశీస్సుల కోసం మొదటిగా నవరాత్రి ఉపవాసాలు ఆచరించాడని పురాణాలు చెబుతున్నాయి. రాముడు దేవుడి అవతారం అయినప్పటికీ పూర్తి మానవుడిగా తన జీవితాన్ని గడిపాడు. ఎక్కడ తాను దైవం అనేది చూపించలేదు. మానవ రూపంలో భూమిపైకి వచ్చి అదే రూపంలో చివర వరకు ఉన్నాడు. రావణుడిని సంహరించడం కోసం శ్రీరాముడు దుర్గాదేవి సహాయం కోరుతూ ఈ ఉపవాసం ఆచరించాడని చెబుతారు.
రావణుడు శివుడికి పరమ భక్తుడు. ఎన్నో యాగాలు, కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి అనేక వరాలు, దీవెనలు పొందాడు. అందువల్ల రావణుడిని ఓడించడం ఎవరి తరం అయ్యేది కాదు. సాధారణ మానవుడిగా జన్మించిన శ్రీరాముడికి రావణ సంహారం చేయడం కాస్త కష్టమైన పని. అందువల్ల దుర్గా దేవిని ప్రసన్నం చేసుకుని ఆమె ఆశీర్వాదం పొందటం కోసం నవరాత్రి ఉపవాసం ఉన్నాడు.
నిర్జల వ్రతం ఆచరించింది ఆయనే
నిర్జల వ్రతాన్ని పాటించిన మొదటి వ్యక్తి కూడా శ్రీరాముడు. రోజంతా ఆహారం, నీరు, ధాన్యాలు వంటివి ఏవి తీసుకోకుండా ఉపవాసం ఆచరించాడు. రాముడు మొదటి సారి నిర్జల వ్రతాన్ని ఆచరించినప్పుడు వరుసగా తొమ్మిది రోజుల పాటు అలాగే ఉన్నాడని కొందరు చెబుతారు. అందువల్ల దుర్గాదేవి ఆశీస్సులు లభించి రావణుడిని ఓడించగలిగాడని అంటారు. ఈ నిర్జల వ్రతం తర్వాతనే ప్రజలు ఏకాదశి రోజున ఉపవాసాలు పాటించడం ప్రారంభించారు.
మహిషాసురిడిని సంహరించేందుకు దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు పోరాడింది. అలాగే శ్రీరాముడు కూడా రావణుడితో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేశాడు. దసరా రోజు విజయం సాధించాడు. దుర్గాదేవి మహిషాసుర రూపంలో శత్రువును అంతం చేసి శాంతిని నెలకొల్పినట్టు రాముడు రావణుడిని ఓడించి ఆరాచకాలను అంతం చేశాడు. సీతమ్మ తల్లిని లంక నుంచి విడిపించాడు. చెడుపై మంచి విజయాన్ని ప్రకటించాడు. ఆ విధంగా దుర్గాదేవి ఆశీస్సులతో విజయం సాధించాదని చెబుతారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.