ఉండ్రాళ్ల తదియ ప్రాధాన్యత, ఈ పూజను ఎలా ఆచరించాలి ?
20 September 2024, 10:36 IST
- నేడు ఉండ్రాళ్ల తదియ జరుపుకుంటున్నారు. ఈరోజు ప్రాముఖ్యత, వినాయకుడిని ఎలా పూజించాలి? అనే విషయాల గురించి పంచాంగకర్త అధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
ఉండ్రాళ్ల తదియ ప్రాధాన్యత
సెప్టెంబర్ 20వ తేదీన ఉండ్రాళ్ల తద్ది జరుపుకుంటున్నారు. ఉండ్రాళ్ల తద్ది ప్రధానంగా రెండు రోజులు పర్వ దినోత్సవం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఉపవాసం తదుపరి, సాయంత్రం వేళ పూజకు అంతా సిద్ధపరచుకుంటారు. ఉండ్రాళ్లు, చలిమిడి సహా తీపి పదార్థాలనేకం తయారుచేసుకుంటారు.
పసుపుతో రూపుదిద్దిన వినాయక స్వామిని, గౌరమ్మను అర్చించుకుంటారు. పూజాదికాలు అయ్యాక, పసుపు కుంకుమలతో పాటు ఉండ్రాళ్లను సైతం వాయనరూపంగా అర్పిస్తారు. విద్యాధినేత గణపతిని, సర్వసౌభాగ్యప్రదాత గౌరీదేవిని ఎంతగానో వేడుకుంటారు. ఉండ్రాళ్ల తద్దిని ఆరోగ్యచద్దిగానూ భావించవచ్చు. పలు విధాల అనారోగ్యాలను దూరంచేసే వైద్య విషయాలు అనేకం కనిపిస్తాయి అని చిలకమర్తి తెలిపారు.
ఈ రోజున వాయనస్వీకారం సాక్షాత్తు పార్వతీమాత చేతుల మీదుగా జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆమెను, ఆ అనేక రూపాలను సౌందర్యలహరి సహా లలితా సహస్రనామబీ శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రాలు శ్లాఘిస్తున్నాయి. చండీ సప్తశతి, అన్నపూర్ణ అష్టకం కూడా కొనియాడుతున్నాయి. 'ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్జీ శ్రీమత్సింహాసనేశ్వరీ / చిదగ్నికుండసంభూతా దేవకార్య సముద్యతా' అని కీర్తిస్తోంది స్తోత్రపాఠం. పార్వతి తనయా పరుగున రావా! అనీ ప్రార్థిస్తుంది భక్తహృదయం.
సర్వేషాం వినాయకానుగ్రహ ప్రాప్తిరస్తు' అనుకున్నపుడు ప్రతీ మనోమందిరాన వీణలు మధురాతి మధురంగా మోగుతాయి. గౌరీపుత్రా, మోదకహస్తా గజాననా, శక్తి సుపుత్రా, లోకపూజితా, భక్తవత్సలా, మంగళదాయకా... ఇలా అనేకానేక స్తుతుల పరంపరలు. 'మోదకోజ్జ్వల బాహు మూషికోత్తమ' అంటూ నమోవాకాలు సమర్పిస్తుంది భక్తకోటి. పాలనశక్తి, ధీయుక్తి, సమున్నతి, బలోద్ధృతి నిండిన గణపతి దేవుణ్ణి తలచినదే తడవుగా మహదానందం ఉప్పొంగుతుంది.
శ్రీశంభు తనయుడు, సిద్ధి గణనాథుడు, వాసిగల దేవతావంద్యుడు, విద్యాబుద్ధులకు ఆదిగురువుగా విఘ్నేశునికి నిఖిల లోకమూ ప్రణామాలందిస్తుంది. ఉండ్రాళ్ల తదియ తరుణాన అన్నింటా అంతటా మంత్రశక్తిఘనత అనుభవమవు తుంటుంది. అక్షరీకృత మంత్రమన్నది అన్ని శక్తి కేంద్రాలనూ ప్రభావితం చేయగలిగినది. అంతర్గత పటిమను త్రిగుణీకృతం చేసి ముందుకు నడిపించి తీరుతుంది.
గౌరీ సప్తస్తుతి ప్రక్రియ విశదీకరించినట్లు - 'గజారణ్యే పుణ్యే శ్రితజన శరణ్యే భగవతీ జపావర్ణాపర్ణా తరళతర కర్ణాంత నాయనా' అంటుంది సప్త శ్లోకీలలో ఒకటి. స్వామిసేవాఫలంగా సర్వాభీష్టసిద్ధి సుసాధ్య మని చెప్తుంది నోముకథనం. వీటన్నింటితో ఆధ్యాత్మిక, ఆనందం, కుటుంబశ్రేయం సిద్ధిస్తాయని అనుభవాలు విపులీ కరిస్తున్నాయి. వ్రతకథ చదువుకుని అక్షింతలు వినియోగించుకోవడం ప్రధానం. ఉండ్రాళ్ల తద్దె విశిష్టతను పరమేశుడే పార్వతీదేవికి వివరించాడని పురాణ కథాంశం. విఘ్ననాథుడిని పూజించి కుడుముల నైవేద్యం సమర్పించడం, అనంతర క్రియలో భాగంగా దుర్గాదేవికి పదహారు ఉండ్రాళ్లను నివేదించడం కీలక అంశాలు. అందుకే ఈ వ్రతాన్ని పదహారు కుడుముల పండుగగా సంభావిస్తారు. షోడశఉమావ్రతంగానూ పిలుస్తుంటారు.
వినాయక స్వామివారిది బాల మనస్తత్వం. కుడుములు/ ఉండ్రాళ్లు, అటుకులవంటి పదార్థాల సమర్పణకే సంతోషించే కరుణా కటాక్ష వీక్షణాలు ఆయనవి. షోడశ అనడంతో సంస్కారాలు తలపులోకి వస్తాయి. అవన్నీ ఆగమ సంబంధాలు. వాటిల్లో వివాహం ఒక భాగం. ఆ రీత్యా గౌరీ వ్రత/ నోము విధానాలు ప్రత్యేకత సంతరించుకున్నాయి. పరిపూర్ణ భాగస్వామి కోసమే వాటి సమాచరణం. దివ్యశక్తి, మాతృదేవత అయిన పార్వతిమంత్రపఠనం అందు గురించే. 'కాంచీ కంకణ హారకుండల.... కోటి కోటి సదనా' అంటూ నమస్కృతులర్పిద్దాం. 'ఉండ్రాళ్ల పండుగ' విలక్షణతను ప్రస్ఫుటపరచే స్తోత్రనిధి పఠనాలూ, శ్రవణాలతో జీవితాలను చరితార్థం చేసుకుందాం. అదేవిధంగా 'సర్వవిఘ్నహరం దేవం సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకం' అని స్వామిని పూజించి పునీతులవుదాం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.