Phalguna Pournami: ఫాల్గుణ పౌర్ణమి విశిష్టత ఏంటి? హోలీ ఆరోజు జరుపుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి?
18 March 2024, 15:42 IST
- Phalguna Pournami: ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ విశిష్టత, ఎందుకు జరుపుకుంటారు, దీని వెనుక ఉన్న కథల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
ఫాల్గుణ పౌర్ణమి విశిష్టత ఏంటి?
Phalguna Pournami: ఫల్గుణి నక్షత్రం పున్నమినాడు ఉండుటవలన “ఫాల్గుణమాసము” అని పేరు వచ్చింది. “'మాసశి” అంతా పూర్ణిమలో ఉండటం విశేషం. ఫాల్గుణ పౌర్ణమినే వసంతోత్సవమని, మదనోత్సవమని, హోలికా దహనం అని కూడా వ్యవహరిస్తుంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి తెలిపారు.హోలీ పండుగతో ముడిపడిన పురాణగాథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి.
శివుడు రతీదేవి పతి అయిన మన్మథుడ్ని దహించిన సంఘటన ప్రసిద్ధమైనది. శివతపస్సును భగ్నం చేసినందుకు కాముడ్ని భస్మం చేసినది ఫాల్గుణ పౌర్ణమి రోజే. రతీదేవి ఆర్తనాదాల్ని విన్న సృష్టికర్త మన్మథుడు లేని విశ్వంలో తన సృష్టి సాగదని గ్రహించి సర్వేశ్వరుని ఆగ్రహం చల్లార్చి విషయమును విశద పరిచింది. ఈశ్వరుడు రతీదేవిని కరుణించి మన్మథుడు నిర్వికారుడై భార్యవైన నీకు మాత్రమే కనిపిస్తాడు.
ఈ విశ్వసృష్టికి మూలమైన స్రీపురుషులలో ప్రేమానురాగాలను, అన్యోన్యరసాలను అందిస్తూ జీవన ప్రక్రియకు దోహదం చేస్తుంటాడు అని చెప్పి మన్మథుడ్ని సజీవుడిని గావిస్తాడు. మన్మథుడు పునర్జన్మ పొందిన రోజు కూడా ఫాల్గుణ పౌర్ణమినాడే అని చిలకమర్తి తెలియచేశారు.
హిరణ్యకశ్యపుని సోదరి హోలిక అగ్ని కూడా కాల్చలేని మహాశక్తిమంతురాలు. తన కుమారుడైన ప్రహ్లాదుడు హరినామస్మరణను మరువమన్నా మాట వినక పోవడంతో హిరణ్యకశిపుడు మండిపడతాడు. హోలికను తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోపెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుడు హరిభక్తమహిమ వలన బయటపడతాడు కాని, హోలిక శక్తి సన్నగిల్లి అగ్నికి ఆహుతైపోయింది. ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ మనిషి అంతరంగంలో ఉండే తుచ్చమైన కోరికల్ని దహింపచేసుకుని మానసిక ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవాలనే సందేశాన్నిస్తుంది హోలీ పండుగ.
రుతు పరివర్తనకు సూచికగా జరుపుకునే రంగుల కేళీ హోలీ. ఇది అందరి మధ్య స్నేహవాత్సల్యాన్ని నిండుగా, మెండుగా రూపొందించే పండుగ. ఆనందోత్సవాలతో రంగునీళ్ళ బుక్కాలను చల్లుకొని హోలీ పండుగ చేసుకుంటారని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.