కృష్ణాష్టమి విశిష్టత ఏంటి?.. ఆరోజు ఏం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి?
05 September 2023, 9:58 IST
- శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో 7 సెస్టెంబర్ 2023న కృష్ణాష్టమి రోజు బాలకృష్ణుడిని ఆరాధించాలని, కృష్ణుడిని ఆరాధించినటువంటి వారికి కృష్ణుని యొక్క అనుగ్రహం వలన శుభాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సోమవారం కృష్ణుడు, రాధ వేషంలో జలంధర్ విద్యార్థులు
ఈనెల 7 సెస్టెంబర్ 2023న కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటున్నామని, ఈరోజు కృష్ణుడిని ఆరాధించినటువంటి వారికి కృష్ణుని యొక్క అనుగ్రహం వలన శుభాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రీకృష్ణుడు దేవకీవసుదేవులకు ఎనిమిదో గర్భంగా శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిధి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది.
సృష్టికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్దరించడానికి శ్రీ కృష్ణుడిగా అవతరించిన రోజును కృష్ణ జన్మాష్టమిగా, కృష్ణాష్టమిగా, గోకులాష్టమిగా, లేదా అష్టమిరోహిణి అని పిలుస్తారు. ఉట్ల పండగ అని కూడా పిలువబడే శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా సెలవిచ్చాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
“పైకొని చూడరె ఉట్ల పండగ నేడు
ఆకడ గొల్లెతకు ననందం నేడు
అడర శ్రావణ బహుళాష్టమి నేడితడు
నడురేయి జనియించినాడు చూడ గదరే..”
మహాభారత యుద్ధంలో పాండవ పక్షపాతిగా నిలిచి శతసోదరులైన కౌరవులను, వారి సైన్యాన్ని సంహరింపజేయడం ద్వారా లోక కల్యాణానికి బాటలు వేసిన శ్రీకృష్ణుని దర్శిస్తే మన పాపాలు సైతం సంహరించబడుతాయి. శ్రీ కృష్ణాష్టమి వేళ కృష్ణ దేవాలయాలను గానీ, గౌడీయ మఠాలను గానీ దర్శిస్తే చాలా శుభప్రదమని చిలకమర్తి తెలిపారు.
కృష్ణుడికి నైవేద్యం ఇలా
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీ కృష్ణుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.
ఊయల కట్టి అందులో శ్రీ కృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ” లేదా “ఉట్ల తిరునాళ్ళు” అని పిలుస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భక్తి శ్రద్ధలతో శ్రీ కృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండపురాణం చెప్పింది.
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్దాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహాభాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండడం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.