వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి, నైవేద్యాలు ఇవే
23 August 2023, 15:00 IST
- వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి, నైవేద్యాలు ఇక్కడ తెలుసుకోండి.
వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి, నైవేద్యాలు ఇవే
వరలక్ష్మీ వ్రతం చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు. అందుకే శ్రావణమాసం రాగానే మహిళలు అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఈ పవిత్రమైన వ్రతానికి ఎలాంటి పూజా సామాగ్రి కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే చాలామంది శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే వ్రతం రోజు ఏమి చేయాలి? పూజ చేయడానికి కావాల్సిన సామాగ్రి ఏమిటి? కంకణం ఎలా చేయాలి? నైవేద్యంగా ఏమి సమర్పించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వరలక్ష్మీ వ్రత విధానం
అమ్మవారికి పూజ చేసేందుకు తెల్లవారుజామును లేచి.. పరిసరాలు శుభ్రం చేసుకోవాలి. అనంతరం మీరు తలస్నానం చేసి.. కొత్త బట్టలు ధరించి.. పూజకు కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి.
వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి
- పసుపు
- కుంకుమ
- టెంకాయలు
- దీపపు కుందులు
- ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పళ్లెం
- పంచహారతి దీపారాధనకు నెయ్యి
- కర్పూరం
- అగరువత్తులు
- బియ్యం
- శనగలు
- కంకణం కట్టుకోవడానికి దారం, ఆకులు
- పువ్వులు
కంకణం ఎలా తయారు చేయాలంటే..
ఐదు లేదా తొమ్మిది పోగులు దారం తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది ఆకులు కట్టి ముడులు వేయాలి. దానిని పీఠం వద్ద ఉంచి.. పూలు, పసుపు, కుంకుమ, అభితలు వేసి.. కంకణాన్ని పూజించాలి. అలా కంకణాన్ని తయారు చేసుకుని పూజకు సిద్ధం కావాలి.
వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు
- ఎరుపు రంగు జాకెట్ వస్త్రం
- గంధం
- పూలు
- పండ్లు
- తమలపాకులు
- వక్కలు
నైవేద్యాలు..
వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేసిన పిండివంటలు నైవేద్యంగా పెట్టాలి. పాయసం, పానకం, వడపప్పు, పరమాన్నం, పప్పు, నెయ్యి వంటి వంటలు అమ్మవారికీ బహుప్రీతికరమైనవిగా చెప్తారు.
కావాల్సినవి అన్ని సిద్ధం చేసుకుని వ్రతం చేయాలి. శ్రావణమాసంలో ఈ వ్రతం చేస్తూ.. వరలక్ష్మీ వ్రత కథ విన్నా.. పూజ చేసినా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలనుకుంటే.. ఈ విధంగా పూజ చేయండి.