వాస్తు ప్రకారం ఏ దిశలో కూర్చుని భోజనం చేయాలి?
05 August 2023, 13:12 IST
- The Best Direction for eating: ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలని చాలా మందికి సందేహం వస్తుంటుంది. ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏ దిక్కును చూస్తూ భోజనం చేయాలి?
మానవుడు తమ జీవితంలో ఆచరించేటటువంటి పనులకు ఆ సందర్భాన్ని బట్టి జ్యోతిష్య శాస్త్రాన్ని లేదా వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటాడు. గృహారంభ, గృహప్రవేశం వంటి కార్యక్రమాలు ఆచరించడం. ఇల్లు కొనాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నాా, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు అన్నింటిలోను వాస్తు మరియు జ్యోతిష్యం చూడటం సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఆచారమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఏ స్థలానికైనా, ఏ ఇంటికైనా, ఏ వ్యాపార సముదాయానికైనా వాస్తు చూసేటప్పుడు ఆ ఇల్లు, ఆ స్థలము, ఆ వ్యాపార సముదాయము లోపల మధ్య భాగంలో కూర్చుని దానికున్నటువంటి వాస్తు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులను చూడాలి.
అలా వ్యక్తి లోపల కూర్చుని వాస్తును చూసేటప్పుడు సూర్యోదయ సమయంలో సూర్యుడు ఏ దిక్కుకు ఉదయిస్తాడో ఆ సమయంలో లోపల నుంచి చూసినపుడు సూర్యుడు ఎదురుగా ఉంటే ఆ దిక్కును తూర్పుగా, మిగతా దిక్కులను యదావిధిగా స్థాపన చేసుకొని చూడాలి.
నేటి ఆధునిక యుగంలో యున్నటువంటి ఆధునిక సాధనాలు (దిక్సూచీ) వంటి వాటిని ఉపయోగించినపుడు ఇంటిలోపల మధ్య భాగంలో కూర్చునే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలను లోపల నుంచే లెక్కలోనికి తీసుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతుంది.
అలా ఒక ఇంటికి గాని, వ్యాపారానికి గాని వాస్తును చూసేటప్పుడు ఆ ఇంటిలోపల నుండే చూడాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
భోజనం చేసే దిశ
శాస్తప్రకారం భోజనాన్ని స్వీకరించేటప్పుడు ఆరోగ్యము, సౌఖ్యము మరియు తృప్తి కలగాలంటే తూర్పు వైపు కూర్చుని భోజనము చేయమని శాస్త్రం తెలియచేసినట్టుగా చిలకమర్తి తెలిపారు.
అభివృద్ధి, లాభము, కోరిన కోర్కెలు నెరవేరడానికి ఉత్తర ముఖం వైపు కూర్చుని భోజనం ఆచరించమని శాస్త్రం తెలియచేస్తోంది. శాస్త్ర ప్రకారం తూర్పు లేదా ఉత్తర ముఖాలలో భోజనాన్ని ఆచరించాలి. తప్ప పడమర మరియు దక్షిణ ముఖాలలో భోజనాన్ని ఆచరిస్తే సమస్యలు, నష్టములు మరియు అనారోగ్యము వంటివి కలిగే అవకాశాలున్నాయని శాస్త్రాలు తెలియచేస్తున్నట్లుగా ప్రముఖ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.