Black magic: భారతదేశంలో బ్లాక్ మ్యాజిక్ రాజధానిగా చెప్పుకునే నగరం ఇదే, ఇదెక్కడుందంటే
30 September 2024, 11:00 IST
- Black magic: ఒకప్పుడు చేతబడి అనే పేరు చెబితేనే భయంతో వణికిపోయే వాళ్ళు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దీని గురించి అనేక విషయాలు అడపాదడపా వినిపిస్తూనే ఉంటాయి. అయితే భారత్ లోని ఒక ప్రాంతం ఏకంగా చేతబడికి రాజధానిగా మారిపోయింది. ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? దానికి ఆ పేరు రావడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం.
బ్లాక్ మ్యాజిక్ రాజధాని
Black magic: చేతబడి.. ఈ మాట పల్లెటూరుల్లో అయితే పూర్వ కాలంలో ఎక్కువగా వినిపించేది. దీన్నే బ్లాక్ మ్యాజిక్, డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాజిక్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది చేతబడికి చెందిన ఒక రూపం. అతీంద్రియ శక్తులను పొందటం కోసం దీన్ని చేస్తారని నమ్ముతారు.
విపరీతమైన కోరికలు, వక్రీకృత మార్గంలో సాధించేందుకు ఇది సహాయపడుతుందని అనుకుంటారు. అయితే ఈ మార్గాలు వేరొకరి జీవితం, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తీసుకు వస్తుంది. వైట్ మ్యాజిక్ కూడా ఉంది. అయితే దీన్ని వైద్యం, రక్షణ గురించి మాట్లాడతారు. ఇది చేతబడి మాదిరిగా చెడు చేయదు. మంత్రాలు, ఆచారాలు పాటించి ఇతరులకు ఎటువంటి హాని కలగకుండా చెడు శక్తులను నియంత్రించేందుకు ఈ వైట్ మ్యాజిక్ ఉపయోగపడుతుంది.
బ్లాక్ మ్యాజిక్ ఎందుకు చేస్తారు?
అనేక సంస్కృతులలో చేతబడి అనేది ఇతరుల చెడు కోరుకుంటూ చేస్తారు. దీని వల్ల అనారోగ్యం, దురదృష్టం, మరణం సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కొందరు వ్యక్తులు తమ చెడు చర్యలు సాధించుకునేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. మంత్రగత్తెల ద్వారా ఇది చేస్తారు. ఇలాంటి వాళ్ళు క్షుద్ర శాస్త్రం ప్రావీణ్యం కలిగి ఉంటారు. ఆత్మలను ఆవాహనం చేసుకోవడం, శపించడం వంటివి చేయగలరు.
చేతబడి చేయడం వల్ల కోరికలు నెరవేరతాయని ఇప్పటికీ చాలా మంది నమ్ముతారు. అయితే అది మూఢ నమ్మకం అని మరికొందరు కొట్టిపడేస్తారు. దీని వల్ల చాలా ప్రతికూలతలు ఉన్నాయి. చేతబడి చేయడం వల్ల ప్రతికూల శక్తులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. వీరి చర్యలు దైవిక సంకల్పానికి విరుద్ధంగా ఉంటాయి. ఇదొక క్రూరమైన చర్యగా పరిగణిస్తారు. దీన్ని ఆచరించే వ్యక్తులు భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాల గురించి ఆలోచించరు. ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది.
చేతబడికి గురైన వ్యక్తులు శక్తిని కోల్పోతారు. ప్రతికూల శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతారు. అనారోగ్యాలు, ప్రతికూలతలు వెంటాడతాయి. ఇది తరతరాలుగా వేధిస్తుంది. అయితే ఇలా కేవలం చేతబడులు చేసే ప్రదేశం ఒకటి ఉంది. అది ఎక్కడో కాదు భారతదేశంలోనే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. అందుకే ఆ నగరాన్ని బ్లాక్ మ్యాజిక్ రాజధాని అని పిలుస్తారు.
బ్లాక్ మ్యాజిక్ రాజధాని ఇది
సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం అస్సాం రాష్ట్రంలోని మయోంగ్ నగరం చేతబడికి పెట్టింది పేరు అంటారు. ఈ నగరం పేరులోనే మాయ అనేది ఉంది. ప్రాచీన కాలం నుంచి తాంత్రిక పద్ధతులు, ఆచారాలకు ఇది కేంద్రంగా ఉంది. ఈ గ్రామం చాలా మంది తాంత్రికులకు, అభ్యాసకులకు నిలయంగా ఉంది. ఇందులో వీరు బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నారు.
ఈ ఊరి గురించి మెల్లగా అందరికీ తెలిసిపోయింది. దీంతో తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఎంతో మంది ఇక్కడి తాంత్రికులను ఆశ్రయిస్తారట. ప్రేమ, సంపద లేదా పగతో సమస్యలు ఉన్నా వారికి మయోంగ్ లో ఉన్న తాంత్రికులు సహాయం చేస్తారు. ఈ గ్రామంలోకి ప్రవేశించిన వెంటనే శరీరంలోకి ఏదో అశాంతి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. ఎవరో తమ మీద ఉన్నట్టుగా భారంగా అనిపిస్తుందని అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెబుతారు.
మయోంగ్ ప్రాంతం గురించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం ఇక్కడ కొంతమంది అభ్యాసకులు మనిషిని జంతువుగా మార్చేశారట. వస్తువులు, వ్యక్తులను ఇక్కడ మాయం చేస్తారని చెబుతారు. ఇక్కడి అభ్యాసకులు ప్రతీకారంతో రగిలిపోతే వాళ్ళు ఎదుటి వారిని మాయం చేసే శక్తులను కలిగి ఉంటారని జంతువులుగా మార్చేస్తారని నమ్ముతారు. ఇదంతా వింటుంటే ఏదో సినిమాలో జరిగిన సీన్ లా అనిపిస్తుంది కానీ అక్కడ నిజంగా ఇవి జరుగుతాయని కథలు కథలుగా చెప్పుకుంటారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు.
టాపిక్