తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ratha Saptami: ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడు వచ్చింది? సూర్య భగవానుడి ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయండి

Ratha saptami: ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడు వచ్చింది? సూర్య భగవానుడి ఆశీస్సులు పొందాలంటే ఇలా చేయండి

Gunti Soundarya HT Telugu

01 February 2024, 10:45 IST

google News
    • Ratha saptami: ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. రథసప్తమి రోజు సూర్య భగవానుడి ఆశీస్సులు పొందటం కోసం ఈ పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది. 
రథసప్తమి ఎప్పుడు వచ్చింది?
రథసప్తమి ఎప్పుడు వచ్చింది?

రథసప్తమి ఎప్పుడు వచ్చింది?

Ratha saptami: మకర సంక్రాంతి తర్వాత వచ్చే మాఘ మాసం శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. 2024 సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. ఈరోజు నుంచి సూర్యుడి రథం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తుంది. సూర్యుడు మొత్తం పన్నెండు రాశులని చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుంది. ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తాడు. అదితి, కశ్యప దంపతులకి సూర్య భగవానుడు జన్మించిన రోజు ఇది. అందుకే దీన్ని సూర్య జయంతి లేదా రథసప్తమిగా జరుపుకుంటారు.

రథసప్తమి పూజా విధానం

రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి. దీన్నే అర్ఘ్యం అంటారు. పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే నీళ్ళలో నువ్వులు, జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి.

బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. స్నానం ఆచరించే సమయంలో తల మీద ఏడు జిల్లేడు ఆకులు ధరించి స్నానం చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు. జిల్లేడు ఆకులకి అర్క పత్రాలని పేరు. సూర్యుడిని కూడా కూడా అర్క అనే పేరు ఉంది. అందుకే సూర్యునికి జిల్లేడు ఆకులంటే మహా ప్రీతి.

దేశంలోని అనేక ప్రముఖ దేవాలయాలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే ఈరోజు ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. రథసప్తమి రోజు ఆదిత్య హృదయ పారాయణం, సూర్యాష్టకం చదవడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

సూర్యుడు రథం విశిష్టత

ఏడు గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. సూర్య రథానికి ఉండే ఏడు గుర్రాలు ఏడు వారాలకి, పన్నెండు చక్రాలకి పన్నెండు రాశులని చయిహంగా భావిస్తారు.

సూర్యుని గుర్రాల పేర్లు

గాయత్రి

త్రిష్ణువు

అనుష్టుప్పు

జగతి

పంక్తి

బృహతి

ఉష్ణిక్కు

మేషం నుంచి మీన రాశి వరకు సూర్యుడు సంచరించేందుకు ఏడాది కాలం పడుతుంది. ఒక్కో రాశిలో ఒక్కో నెల సంచరిస్తాడు. సూర్యుడిని ద్వాదశ ఆదిత్యులు అని కూడా అంటారు. ఒక్కడే సూర్యుడు కానీ నెలని బట్టి 12 రూపాలతో సూర్య భగవానుడిని పూజిస్తారు. ఒక్కో నెలలో సూర్యుడు ఉండే తీక్షణని బట్టి ఆ 12 పేర్లు వచ్చాయి.

సూర్యుడి 12 రూపాలు

చైత్ర మాసం- ధాతు

వైశాఖం- అర్యముడు

జ్యేష్ఠం- మిత్రుడు

ఆషాడం- వరుణుడు

శ్రావణం- ఇంద్రుడు

భాద్రపదం- వివస్వంతుడు

ఆశ్వీయుజం- త్వష్ట

కార్తీకం- విష్ణువు

మార్గశిరం- అంశుమంతుడు

పుష్యం- భగుడు

మాఘం- పూషుడు

ఫాల్గుణం-పర్జజన్యుడు

సూర్యభగవానుడి ఆశీస్సుల కోసం పరిహారాలు

రథసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య స్థానం బలపడుతుంది. ఆరోజు పొరపాటున కూడా ఉప్పు తినకండి. అలాగే ఉప్పు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. పప్పు, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలు దానం చేయండి.

తదుపరి వ్యాసం