Ayodhya ram mandir prasadam: అయోధ్య రామాలయంలో భక్తులకు పంచే ప్రసాదం ఇదే
05 January 2024, 17:00 IST
- Ayodhya ram mandir prasadam: భక్తులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఆ ఆలయంలో పెట్టె ప్రసాదం ఏమిటంటే..
అయోధ్య రామ మందిరం
Ayodhya ram mandir prasadam: యావత్ భారతదేశం ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ ఆలయానికి సంబంధించి ప్రతీ ఒక్కటీ ఎంతో ప్రత్యేకతతో రూపొందిస్తున్నారు. ఆలయ సింహ ద్వారం దగ్గర నుంచి రామ్ లల్లా వరకు అన్ని ప్రత్యేకమే. జనవరి 22 వ తేదీన అయోధ్య రామలయంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ ఆలయ ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు ఎంతో మంది తరలి వస్తున్నారు.
ప్రముఖ దైవ క్షేత్రాలలో తిరుపతి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో ఇప్పుడు అయోధ్య రామ మందిరం కూడా అదే ప్రాధాన్యత సొంతం చేసుకోబోతుంది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు బాల రూప విగ్రహం ఈ ఆలయంలో ప్రతిష్టించబోతున్నారు. శ్రీరామ జన్మభూమి మందిర తీర్థ ట్రస్ట్ నిర్వాహకులు ఆలయ నిర్మాణ పనులు చూసుకుంటున్నారు. ఇప్పటికే ఆలయ సింహ ద్వారానికి సంబంధించిన ఫోటోలని జనవరి 5వ తేదీ విడుదల చేశారు. ఆలయంలో ప్రతిష్టించబోయే రామ్ లల్లా విగ్రహం కూడా ఎలా ఉంటుందో ఫోటోలు విడుదల చేశారు. ఇప్పుడు అయోధ్య రామలయంలో పెట్టె ప్రసాదం గురించి వివరాలు వెల్లడించారు.
ఇలాచి దానా ప్రసాదంగా..
కొన్ని కొన్ని ప్రసాదాలు చూస్తే ఏ ఆలయానికి చెందినవి అనేది చాలా సులువుగా చెప్పేస్తారు. తిరుపతి లడ్డూ, అయ్యప్ప స్వామి ప్రసాదం చాలా ఫేమస్. ఇప్పడు అయోధ్య రామాలయం ప్రసాదం కూడా ఫేమస్ కాబోతుంది. ఈ ఆలయంలో జనవరి 22 నుంచి ఇలాచి దాన ప్రసాదంగా పెట్టబోతున్నారు. యాలకులు, పంచదారతో చేసే ఇలాచి దాన ప్రసాదంగా పెట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. దీని సంబంధించిన కాంట్రాక్ట్ ఇప్పటికే రామ్ విలాస్ అండ్ సన్స్ సంస్థకు ఇచ్చింది.
ఉత్తర భారతదేశంలో ఇలాచి దాన ప్రసాదం చాలా ఆలయాల్లో పెడతారు. కానీ ఇక మీద నుంచి ఇలాచి దాన అంటే అయోధ్య రామాలయం గుర్తుకు వస్తుంది. యాలకులతో చేసే ఈ ప్రసాదం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
అయోధ్య రామాలయం ప్రత్యేకతలు
అయోధ్య రామ మందిరాన్ని సంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 166 అడుగుల ఎత్తు, 250 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆలయం ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. మందిరానికి మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముని చిన్న నాటి బాల రూప విగ్రహం రామ్ లల్లాని ప్రతిష్టించబోతున్నారు. కర్ణాటకకి చెందిన శిల్పి దీన్ని రూపొందించారు.
మందిరంలో ఐదు మండపాలు ఉన్నాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తన మండపాలు ఉన్నాయి. మందిరం చుట్టూ ప్రాకార గోడ నిర్మించారు. భూకంపాలు తట్టుకునే విధంగా 2 అడుగుల ఎత్తైన పునాది నిర్మించారు. 14 అడుగుల వెడల్పుతో 732మీటర్ల పొడవైన పెర్కోటా నిర్మించారు. ఈ మందిరంలో ఎక్కడ ఇనుము ఉపయోగించలేదు. 70 ఎకరాల విస్తీర్ణంలో 70 శాతం పచ్చదనంతో ఈ ఆలయం కనువిందు చేయబోతుంది.