Ugadi Rasi Phalalu 2024: మేషరాశి ఉగాది రాశి ఫలాలు.. ఈ ఏడాది బ్రహ్మాండంగా ఉంటుందన్న చిలకమర్తి
28 March 2024, 16:49 IST
- Ugadi Rasi Phalalu 2024: మేషరాశి వారి శ్రీ క్రోధి నామ సంవత్సర జాతక రాశి ఫలాలను పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. తెలుగు నూతన సంవత్సరంలో నెలవారీగా, ఆరోగ్యం, కెరీర్, ప్రేమ, సంపద తదితర విషయాల్లో మేష రాశి వారి జాతక ఫలితాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.
మేషరాశి ఉగాది 2024 క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు
శ్రీ క్రోధి నామ సంవత్సరం నందు మేషరాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. బృహస్పతి ధన స్థానమునందు సంచరించుట చేత, శని లాభ స్థానమునందు సంచరించుట చేత, రాహువు వ్యయస్థానమునందు సంచరించుట చేత మరియు కేతువు ఆరవ స్థానమునందు అనుకూలంగా సంచరించుట చేత మేషరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి.
మేషరాశివారికి గత కొంత కాలంతో పోల్చుకున్నట్లయితే ఈ క్రోధి నామ సంవత్సరం కలసివచ్చేటటువంటి సంవత్సరం. మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగును. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలించును.
విదేశీ ప్రయాణాలు వంటివి లాభించును. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకముగా ఉండును. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. ధనస్థానము మరియు వాక్ స్థానములో గురుని ప్రభావం వలన మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనలాభము, వస్తులాభము, ధనవృద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును.
శుభకార్యాలలో పాల్గొనెదరు. లాభస్థానములో శని ప్రభావంచేత నూతన గృహ మరియు వ్యాపార విషయాలు శుభఫలితాలు ఇచ్చును. ధైర్యంతో ముందుకు సాగెదరు. దైవబలం కలుగును. ఈ క్రోధి నామ సంవత్సరంలో మీ మాటకు తిరుగుండదు. శత్రువులపై విజయాన్ని పొందెదరు.
వ్యయస్థానములో రాహువు ప్రభావంచేత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచన. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. విదేశీ విద్య కోసం చేయు ప్రయత్నాలు లాభించును.
స్త్రీలకు ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, మానసిక ఆనందము కలుగును. రైతాంగం, సినిమా రంగాల వారికి ఈ సంవత్సరం శుభఫలితాలు కలుగును. గృహలాభం, అస్తిలాభం, వస్తులాభం వంటివి కలుగును. కీర్తిని పొందెదరు.
ఈ సంవత్సరం మేషరాశివారు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయం మరియు విష్ణు సహస్రనామాన్ని నిత్యం పారాయణం చేయడం మంచిది.
మేష రాశి వారి ప్రేమ జీవితం
మేషరాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో గురుబలం అనుకూలంగా ఉండటంచేత ప్రేమ జీవితం వంటి విషయాలు అనుకూలించును. మీ భాగస్వామితో సుఖము, ఆనందము పొందెదరు. ప్రేమపరమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతమగును. అవివాహితులకు వివాహయోగం కలదు. సంతానపరమైనటువంటి ప్రయత్నములు ఫలించును.
మేషరాశి వారికి ఆర్థిక విషయాలు
మేషరాశివారికి ఆర్థికపరముగా ఎదగడానికి క్రోధి నామ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరం. మేషరాశి వారికి ఆదరణ, కీర్తి మరియు ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. గృహములు వంటివి కొనడానికి అనుకూలమైనటువంటి సంవత్సరం. స్టాక్ మార్కెట్ మరియు స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడుల ద్వారా ఈ సంవత్సరం కలసివస్తుంది. బంగారం, వెండి వంటివి కొనేటటువంటి సూచనలు అధికముగా ఉన్నాయి.
మేషరాశి వారి కెరీర్
మేషరాశి వారికి కెరీర్ పరంగా ఈ సంవత్సరం కలసివస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి స్పష్టంగా గోచరిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు కలసివస్తాయి. ఉద్యోగమార్పు ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం కలసివస్తుంది.
మేష రాశి వారి ఆరోగ్యం
మేషరాశి వారికి ఉగాది రాశిఫలాలు ఆనందన్నిస్తాయి. ఆరోగ్యపరంగా మేషరాశివారికి ఈ సంవత్సరం శని అనుకూలంగా ఉండటం మరియు గురుబలము ఏర్చడటం చేత శుభఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యము ఆనందము కనిపిస్తుంది. సుఖ సౌఖ్యాలను పొందెదరు.
మేషరాశి వారికి పరిహారాలు
మేషరాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దుర్గాదేవిని పూజించడం, దేవీ ఉపాసన చేయడం, శ్రీ లలితా సహస్రనామాలు వంటివి పఠించడం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
మేషరాశి వారు ధరించవలసిన నవరత్నం పగడము. మేషరాశి వారు ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్యుడు మరియు దుర్గాదేవి (అమ్మవారు) అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
నవరత్నం: మేషరాశి వారు పగడమును ధరించడం మంచిది. పగడాన్ని ధరించడం వల్ల కుజగ్రహ అనుగ్రహంచేత అభివృద్ధి మరియు విజయము పొందెదరు.
దైవం: మేషరాశివారు నిత్యం అరాధించవలసిన దైవం సూర్యనారాయణమూర్తి మరియు సుబ్రహ్మణ్యుడు.
మేషరాశి నెలవారీ ఫలితాలు 2024
ఏప్రిల్: మేషరాశి వారికి అనుకూలముగా ఉన్నది. వృత్తి, వ్యాపారపరంగా సత్ఫలితాలు ఉన్నాయి. పెద్దల ఆదాయం కూడా పెరుగుతుంది. గృహకార్యాలు ఫలిస్తాయి. వివాహ, భూ, గృహ లాభాలు ఉన్నాయి.
మే: ఈ మాసం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారపరంగా సత్ఫలితాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అపవాదులు కూడా సమసిపోగలవు. వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి. కొన్ని సమస్యలు వచ్చినప్పటికి అవి తొలగిపోవును.
జూన్: ఈ మాసం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో అచితూచి ప్రవర్తించుట మంచిది. ఇతరుల వల్ల కొంత ఇబ్బంది ఉండగలదు. అర్థిక పరిస్థితి అనుకూలం. భూ, గృహ సంబంధిత వ్యవహారాలను చక్కబెడతారు.
జూలై: ఈ మాసం మేష రాశి వారికి మధ్యస్థం నుండి అనుకూలం. బంధువులు మీ సాంగత్యం కోరుకుంటారు. వ్యాపారలాభాలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు. వృత్తియందు అనుకూలం. అనుకున్న పనులు నెరవేరుతాయి. గురు, శని బలముచే మీ కోరికలు తీరతాయి.
ఆగస్టు: మేష రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు దూర ప్రాంతములనుంచి స్పస్థానానికి బదిలీ ఉండే అవకాశం. సంతానం వలన సౌఖ్యం ఉన్నా చిన్న చిన్న సమస్యలు చికాకులు కలిగించును. ఆదాయ వృద్ధి ఉంటుంది. బుణ సౌకర్యం లభిస్తుంది. కొంత అస్వస్థత కలుగు సూచన.
సెఫ్టెంబర్: ఈ మాసం మీకు మధ్యస్థం నుండి అనుకూలం. నూతన ప్రయత్నాలు చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచడం మంచిది. వస్తువాహన ప్రాప్తి. విందు వినోదాలలో పాల్గొంటారు.
అక్టోబర్: ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. నూతన ప్రయత్నాలు సిద్ధింప చేసుకుంటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వస్తువాహన ప్రాప్తి. కోపాన్ని అదుపులో ఉంచుట మంచిది. మీ మనోరథం నెరవేరును.
నవంబర్: ఈ మాసంలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అదాయం ఉన్నప్పటికి ఖర్చుల వలన కొంత ఇబ్బంది ఉండును. వాహనం మార్పు చేసే ఆలోచనలు కలుగుతాయి. గృహ సంబంధిత నూతన వస్తువులను కొంటారు. చేతి వృత్తుల వారికి మంచి ఫలములు.
డిసెంబర్: ఈ మాసం మీకు మధ్యస్థం. తీర్థయాత్రలను చేసే అలోచనలు ఫలిస్తాయి. చర, స్థిరాస్తి విషయంలో విభేదాలు సమసిపోతాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. మాసం చివరలో కొంత జాగ్రత్త అవసరం.
జనవరి: ఈ మాసం మేషరాశి వారికి అనుకూలంగా లేదు. రాజకీయ నాయకులకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు రచిస్తారు. శ్రమ, ఒత్తిడి ఉన్నప్పటికి కార్యసిద్ధి వలన దానిని మారుస్తారు. వాహనం నడిపే విషయంలో తగు జాగ్రత్త వహించండి.
ఫిబ్రవరి: ఈ వారం మీకు మధ్యస్తముగా ఉన్నది. వస్తు వాహన ప్రాప్తి. ధన వ్యయము. కొద్దిపాటి చికాకులు. శుభకార్య సిద్ది. కుటుంబ పరిస్థితిలో కొద్దిపాటి మార్చు. రాజకీయ లబ్ధి. వ్యతిరేకుల వల్ల కొంత ఇబ్బందులు కలుగును.
మార్చి: ఈ వారం అనుకూలంగా లేదు. వివాహాది శుభకార్యక్రమాలు లాభిస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. విద్యా రంగంలో పురోభివృద్ధి.