Amla for Health: రోజుకో ఉసిరికాయ తినడం అలవాటు చేసుకోండి చాలు, ఎంతో ఆరోగ్యం-just make a habit of eating amla every day it will be very healthy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Amla For Health: రోజుకో ఉసిరికాయ తినడం అలవాటు చేసుకోండి చాలు, ఎంతో ఆరోగ్యం

Amla for Health: రోజుకో ఉసిరికాయ తినడం అలవాటు చేసుకోండి చాలు, ఎంతో ఆరోగ్యం

Haritha Chappa HT Telugu
Published Mar 23, 2024 01:38 PM IST

Amla for Health: ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. రోజుకో ఉసిరికాయ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.

ఉసిరితో ఆరోగ్యం
ఉసిరితో ఆరోగ్యం (Pixabay)

Amla for Health: ఉసిరికాయ లేదా ఆమ్లా... ఈ కాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఉసిరికాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం, జుట్టు మెరుస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు ఉసిరికాయను ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ఇవే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. తద్వారా డయాబెటిస్ వ్యాధిని తగ్గిస్తాయి.

ఆయుర్వేద వైద్యంలో ఉసిరిది ప్రత్యేక స్థానం. దీన్ని రసంగా లేదా పొడిగా తినమని చెబుతూ ఉంటారు. ప్రతిరోజూ ఒక్క ఉసిరికాయ తినడం అలవాటు చేసుకోండి. మీ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి.

చర్మం మెరుపు

ప్రతిరోజూ ఒక ఉసిరికాయ తినే వారిలో విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని కాపాడుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే చర్మ కణాలను కాపాడుతుంది.

ఉసిరికాయలో పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, టానిన్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో చేరిన ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాన్ని తగ్గిస్తాయి.

ఉసిరితో ఆరోగ్యం

ఆమ్లా... జీర్ణ ప్రయోజనాలను అందిస్తుంది. పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం రాకుండా అడ్డుకుంటుంది. జీర్ణరసాల స్రావాన్ని ప్రేరేపించి ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరంపంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

గుండె ఆరోగ్యానికి ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండెను కాపాడుతుంది. అధిక రక్తపోటు రాకుండా అడ్డుకుంటుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఎక్కువ. ఇది గుండె పోటు, స్ట్రోక్ వంటివి రాకుండా ఇది నిరోధిస్తుంది.

ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. అభిజ్ఞా పని తీరును మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఉసిరికాయను ప్రతిరోజు తినే వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లలకు ప్రతిరోజూ ఒక ఉసిరికాయ తినిపించండి. వారిలో ఏకాగ్రత పెరుగుతుంది.

ఉసిరి సాధారణంగా ఎంతో సురక్షితమైనది. రోజుకో ఉసిరికాయ తినడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే రోజుకు ఎక్కువ మోతాదులో ఉసిరికాయని తింటే జీర్ణ అసౌకర్యం తలెత్తవచ్చు. లేదా అలర్జీల వంటివి రావచ్చు. అతిసారం కూడా రావచ్చు. కాబట్టి రోజుకు 1 లేదా రెండు ఉసిరికాయలతో ఆపేయడమే మంచిది.

Whats_app_banner