క్షీరాబ్ధి ద్వాదశి వ్రత కథ.. విష్ణు మూర్తి అనుగ్రహం పొందండి
23 November 2023, 18:02 IST
- కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి రేపు నవంబరు 24, 2023 శుక్రవారం రోజున వస్తోంది. ఈ రోజు వ్రతం ఆచరించే వారు, విష్ణుమూర్తి అనుగ్రహం కోరుకునే వారు ఈ వ్రత కథను చదవండి. ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.
క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి పూజ చేసి విష్ణుమూర్తి అనుగ్రహం పొందండి
కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరిస్తారు. ఆ వ్రత కథను బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. వ్రత కథ మీరూ చదవండి.
పూర్వము ధర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో గూడి ద్వైత వనమందుండగా, అచ్చటికి అనేక ఋషులతో గూడి వ్యాస మహర్షి వస్తారు. అట్లు వచ్చిన వ్యాసుని చూసి ధర్మరాజు తగు పూజలు చేసి కూర్చొండబెట్టి మాట్లాడుతాడు.
'స్వామీ! మీరు ఎల్లధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మసూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములు ఏ ఉపాయము చేత సిద్దించునో సెలవివ్వండి..’ అని అడుగుతాడు.
అప్పుడు వ్యాసుడు 'నాయనా! మంచి ప్రశ్న వేసినావు. ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మనడుగగా సర్వకామప్రదములగు రెండు వ్రతములు చెప్పాడు. క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము, క్షీరాబ్ధి శయన వ్రతము అను ఆ రెండు వ్రతములలో క్షీరాబ్ధి ద్వాదశీ వ్రతమును నీకు జెప్పెదను వినుము..’ అని వివరిస్తాడు.
క్షీరాబ్ది ద్వాదశి రోజు
‘కార్తిక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుగూకిన తర్వాత పాలసముద్రము నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల తోడును, మునులతోడును, లక్ష్మీ తోడును గూడి బృందావనమునకు వచ్చి యుండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా - ఏ మానవుడైనను ఈ కార్తిక శుద్ద ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో, దేవతలతో గూడి బృందావనమున వేంచేసియున్న నన్ను లక్ష్మీదేవితో గూడ పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునో వాడు సర్వపాపములు వీడి నా సాయుజ్యమును పొందును.. అని శపథము చేసినాడు. కావున నీవును పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము’ అని వ్యాసుడు చెబుతాడు.
క్షీరాబ్ది ద్వాదశి వ్రత విధానం
అది విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధాన మెట్టిదో నాకు జెప్పమని అడుగగా వ్యాసుడు ఇలా చెబుతాడు. ‘ధర్మరాజా.. ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసికొని సాయం కాలమున మరల స్నానము చేసి శుచియై తులసి కోట దగ్గర చక్కగా శుద్ది చేసి ఐదు వన్నెల ముగ్గుల పెట్టి పలువిధముల అలంకరించి తులసీ మాలయదు లక్ష్మీసహితుడైన విష్ణువును, తులసిని భక్తితో సర్వోపచారములతోను పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెఱుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనములొసగి మంత్రపుష్పము పెట్టి పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మహత్మ్యమును దీపదాన ఫలమును వినాలి. అనంతరము బ్రాహ్మణునకు గంధపుష్ప ఫలాదులొసగి తృప్తిపరచి వ్రతము పూర్తిచేయవలెను..’ అని వివరించాడు.
దీప దాన మహిహ
ధర్మరాజు అది విని దీపదాన మహిమను జెప్పుమని అడుగగా వ్యాసుడు ఇలా చెబుతాడు. ‘యుధిష్టిరా! దీపదానమహిమనెవడు చెప్పగల్గును? కార్తిక శుద్ద ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఒక దీపదానముచే ఉప పాతకములు పోవును. నూరు చేసిన విష్ణు సారూప్యము గలుగును. అంతకెక్కువగా చేస్తే ఆ ఫలములు నేను జెప్పలేను.
భక్తితో నొకవత్తితో దీపము బెట్టిన బుద్దిశాలి యగును. నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజగును. పదివేసిన విష్ణుసాయుజ్యము నొందును. వేయివత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఇది బృందావనములో చేసిన యెడల కురుక్షేత్రమందు జేసినంత ఫలము గలుగును. దీనికి ఆవునేయి మంచిది. నువ్వుల నూనె మధ్యమము. తేనె అదమము. ఇతరములైన అడవినూనెలు కనీసము, ఆవునేయి జ్ఞానమోక్షముల నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్పనూనె భోగప్రదము, అడవినూనె కామ్యార్థప్రదము.
అందులో ఆవనూనె మిగుల కోరికలనిచ్చును. అవిసెనూనె శత్రుక్షయకారి. ఆముదము ఆయుష్షును నాశనము చేయును. బఱ్ఱె నేయి పూర్వపుణ్యమును దొలగించును. వీనిలో కొంచమైన ఆవునేయి కలిసిన దోషపరిహారమగును.
ఈ దీప దానముల వలననే యింద్రాదులకు వారివారి పదవులు దొరకినవి. దీనివలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులు ముక్తి పొందుతారు. బృందావనమందొక మంటపము గట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి యున్న ఎవడు చూచి ఆనందపడునో వాని పాపములన్నియు నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు..’ అని చెబుతాడు.
తులసీ మహత్యం
అది విని ధర్మరాజు మహానందమును పొంది తులసీ మహత్మ్యమును జెప్పమని కోరగా వ్యాసుడు ఇలా చెబుతాడు. ‘తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినను ఆ బ్రహ్మ నారదునకు జెప్పినట్లు చెప్పుచున్నాను. కార్తికమాసమందు తులసిపూజ చేయువారు ఉత్తమలోకమును పొందుతారు. తుదకు ఉత్థాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటిజన్మలు చండాలులై పుట్టుదురు.
తులసి మొక్క వేసి పెంచినవారు దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుందురు. తులసీ దళములు కలిసిన నీట స్నానమాడినవారు పాపము వదలి వైకుంఠమునకు బోవుదురు. బృందావనము వేసినవారు బ్రహ్మత్వము పొందుదురు. తులసి ఉన్న ఇంటిలో కాపురము చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పేరులు దాల్చుట, తులసిదళము భక్షించుట, పాపహరములు. తులసి ఉన్న చోటునకు యమకింకరులు రారు. 'యాన్ములే....' అను మంత్రమును పఠించు వారికి ఏ బాధయు అంటదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవయందే ఒక పూర్వకథను జెప్పెద వినుము..’ అని మరో కథ వివరిస్తాడు.
కాశ్మీర దేశ వాసులగు హరిమేధసుమేదులు అను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచూ ఒక స్థలములో ఒక తులసి తోటను చూస్తారు. వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ, నమస్కారములు చేసెను. అది చూచి హరిమేధుడిదియే మని యడిగెను. సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉన్నదని ఒక మఱ్ఱిచెట్టు వద్దకు చేరి తులసి కథ చెప్పసాగెను.
పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దానియందు ఐరావతము కల్పవృక్షము మొదలుగా ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ యమృత కలశమును జేత బూని మహానందము నొంది విష్ణువు ఆ కలశముపై ఆనందబాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది.
ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద నుంచుకొని నీవు లోకముల పావనము జేయగలదానవగుమని ప్రేమ మీర పలుకుతాడు. అందువలన నారాయణునకు తులసియందు ఎక్కువ ప్రీతి కలిగియుండును. అందువలన నేను తులసికి మొక్కాను అని యా బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి చెట్టు ఫెళ్ళుమని విరిగి కూలెను.
ఆ చెట్టు తొఱ్ఱలోనుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు చూచి దివ్యమంగళ విగ్రహధారులైన మీ రెవరిని యడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు నని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనియెను. నేను దేవలోకవాసిని, నాపేరు ఆస్తికుడందురు. నేనొకనాడు అప్సరసలతోగూడి నందనవనమున కామవికారముచే మైమరచి క్రీడించుచుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన ధ్యానం చలించి అచట తపస్సు చేయుచున్న రోమశ మహాముని నన్ను చూచి నీవు మదోన్మత్తుడవై యిట్లు నాకలజడి కలిగించితివి. కావున బ్రహ్మ రాక్షసుడవగుమని శపించాడు. తప్పిదము పురుషునిది గానీ స్త్రీలు పరతంత్రలు గనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను.
అంతట నేను శాపమునకు వెఱచి ఆ మునిని వేడి ప్రసన్నునిజేయగా నాయన అనుగ్రహము గలిగి నీవెప్పుడు తులసి మహిమను, విష్ణుప్రభావమును విందువో అప్పుడు శాపవిముక్తుడవుగుదువని అని అనుగ్రహించెను. నేను బ్రహ్మరాక్షసుడనై యీ చెట్టు తొఱ్ఱలో జేరి మీ దయవలన నేడు శాపమోక్షణము నొందితిని అని చెప్పాడు. రెండవ వ్యక్తి వృత్తాంతము చెప్పసాగెను.
‘ఈయన పూర్వమొక ముని కుమారుడిగా నుండి గురుకులవాసము జేయుచుండి ఒక యపరాధము వలన బ్రహ్మరాక్షస్సుడవగుమని గురువు వలన శాపము బొంది యిట్లు నాతో గలసియుండెను. మేమిద్దఱమును మీ దయ వలన పవిత్రులమైతిమి. ఇట్లు మమ్మల్ని అనుగ్రహించినారు కనుక మీ తీర్థయాత్రాఫలము సిద్దించినది..’ అని చెప్పి వారిరువురు వారిత్రోవను బోవగానే బ్రాహ్మణులిద్దరు ఆశ్చర్యానందములతో మునిగి తులసి మహిమను బొగడుచు యాత్రముగించుకొని యిండ్లకేగిరి.
ఈ కథను ఎవరు విన్నను వారు సర్వపాపములు వదలి ఉత్తమగతిని చెందుదురని బ్రహ్మ నారదునకు జెప్పెను..' అని వ్యాసుడు చెప్పి ధర్మరాజా ! ఇట్లు క్షీరాబ్ధి వ్రతము జేసి తులసి కథ విన్నవారు ఉత్తములగుదురు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.