Tulsi Importance : తులసి ప్రాధాన్యత ఏమిటి? తులసిని ఎందుకు పూజించాలి?
Tulsi Importance : భారతీయ సంస్కృతిలో తులసి మెుక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇంటి ముందు తులసి మెుక్కను పెట్టుకుని రోజూ పూజించడం మన సంప్రదాయం. దీని గురించి పూర్తి వివరాలను పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
భారతీయ సనాతన ధర్మంలో తులసి ప్రాధాన్యత గురించి పద్మపురాణంలో ప్రహ్లాదుడు చెప్పినట్లుగా చెప్పబడింది. పద్మపురాణం ప్రకారం తులసిని పూజించినా, తులసి నామస్మరణం చేసినా పాపములు తొలగుతాయని ఉంది. తులసి ప్రాధాన్యత గురించి పరమశివుడు సుబ్రహ్మణ్యునికి చెప్పినట్లుగా పురాణాలలో చెప్పబడినది. ఒకసారి సదానంద బుషిని ప్రహ్లాదుడు కలసి పాపపరిహారాల కోసం ఎవరిని స్మరిస్తే సకల పాపాలు తొలగుతాయి అనగా సదానంద బుషి ఓ విషయం చెప్పాడు.
పాల సముద్ర మధనం చేసినపుడు పాల సముద్రం నుండి అనేక వస్తువులు బయటకు వచ్చాయి. పాల సముద్రం నుండి వచ్చిన వాటిలో శ్రీమహావిష్ణువు మూడింటిని స్వీకరించాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అందులో మొదటిది లక్ష్మీదేవి, రెండవది కౌస్తభం ఈరెండింటిని శ్రీమన్నారాయణుడు తన హృదయ స్థానములో పెట్టుకున్నాడు. మూడోది తులసి కూడా వచ్చింది. ఈ తులసిని తన శరీరం మొత్తం ఉండేటట్టుగా అలంకరించుకున్నాడు మహావిష్ణువు.
అప్పుడు తులసిని నీకేమి వరం కావాలని కోరుకోమనగా తులసి ఏ మానవుడైనా జీవితంలో ఎంతటి పాపము చేసినా సరే! తులసి దళములతో మహావిష్ణువును పూజించినట్లయితే వారి పాపములు నశింపచేయగలిగేటటువంటి శక్తిని వరాన్ని నాకు ప్రసాదింపమని కోరాడు. అలాగే మహావిష్ణువుయొక్క పాదాలను తులసితో పూజించి ఆ తులసిని ఎవరైతే స్వీకరిస్తారో అట్టి వారికి విష్ణువు యొక్క అనుగ్రహం చేత పాపములు తొలగాలని విన్నవించాడు. ఈ పురాణ కథ ప్రకారం తులసియొక్క ప్రాధాన్యత మనకు చెప్పబడింది.
ఎవరైతే మహావిష్ణువును నిత్యం తులసితో ఆరాధిస్తారో వారికి మోక్షము లభిస్తుందని చెప్పబడింది అని చిలకమర్తి తెలిపారు. తులసి గాలి శరీరానికి మంచిది తులసి తీర్థం శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది. తులసి ఆకు వాత దోషాన్ని పోగొడుతుంది. తులసి బెరడుని
పొడిచేసి తేనెతో తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. వీటన్నింటినీ గమనించి అటు దేవలోకంలో పారిజాతంలా ఇక్కడ తులసిని గురించి ఆధ్యాత్మిక ఓ విషయాన్ని చెప్పారు. తులసి మొదట్లో బ్రహ్మ, తులసి మధ్యలో విష్ణువు, తులసి చివర్లో శంకరుడూ ఉంటాడనీ, ఇది దేవతా వృక్షమనీ ఆ భావనని మనసులో ఉంచుకుని తులసి మొక్కని పూజించాలని పండితులు చెప్పినట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
పద్మపురాణం ప్రకారం భారతీయ సనాతన ధర్మంలో తులసి ప్రాధాన్యత పూజలో తులసి ప్రాముఖ్యత చెప్పబడింది అని చిలకమర్తి తెలిపారు. ఇదేకాకుండా మహాభారతం ప్రకారం రుక్మిణీదేవి కృష్ణుణ్ణి తనయొక్క భక్తితో కేవలం ఒక్క తులసిదళం త్రాచులో వేసి శ్రీకృష్ణుని పొందినట్లుగా చెప్పబడింది. ఇంటిలో తులసిని పెంచడం, విష్ణుమూర్తి పూజలో తులసిని వాడటం తులసి తీరాన్ని స్వీకరించడం చేస్తారని చిలకమర్తి తెలిపారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి కఫ, పైత్య రోగాలను నివారించి మానవునికి ఆయుష్షు కలుగుచేస్తుందని ఉందని ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.