Vastu Tips- Tortoise । ఇంట్లో తాబేలు చిహ్నం ఈ దిశలో ఉంటేనే శుభకరం.. ఈ వాస్తు చిట్కాలు పాటించండి!
03 November 2022, 23:33 IST
- Vastu Tips- Tortoise: ఇంట్లో తాబేలు బొమ్మ ఉంఛుకుంటే వాస్తు ప్రకారం శుభప్రదం. అయితే ఎలాంటి తాబేలు ఉంచాలి, ఏ దిశలో ఉంచాలి తెలుసుకోండి.
Vastu Tips- Tortoise
Vastu Tips: హిందూ పురాణాల ప్రకారం, తాబేలును కూడా మహా విష్ణువు రూపంగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో వచ్చి తన అద్భుత మహిమలను ప్రదర్శించినట్లు గ్రంథాలలో ఉంది. అందుకే ఇంట్లో, పూజ గదిలో తాబేలు బొమ్మ ఉంచుకోవడం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది.
వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు చిహ్నంను ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని చాలా మంది నమ్మకం. అయితే ఇంట్లో తాబేలు చిహ్నాలు ఉంచాలనుకునే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే మీ ఇంట్లో సంతోషానికి బదులు సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇంట్లో ఏ లోహంతో చేసిన తాబేలు చిహ్నాన్ని ఉంచాలి? ఏ దిక్కున ఉంచాలి..? అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
ఇంట్లో తాబేలు చిహ్నం ఉంచడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేలును ఇంటికి తీసుకురావాలి. ఆ రోజు తాబేలును పాలలో కాసేపు ఉంచాలి. అభిజిత్ ముహూర్తం నాడు, ఈ తాబేలును పాల నుండి తీసివేసి నీటితో కడగాలి. ఆ తర్వాత ఒక పాత్రలో కొంత నీరు తీసుకుని అందులో తాబేలు చిహ్నంను ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. స్తోమతను బట్టి బంగారం, వెండి, వజ్రం, రాగి తాబేళ్లను ఇంట్లో ఉంచుకోవచ్చు.
తాబేలు చిహ్నం ఏ చోట ఉంచాలి?
తాబేలు జలచరాలు కాబట్టి ఈశాన్య దిశలో ఉంచాలి. ఆ తర్వాత 'ఓం శ్రీం కూర్మై నమః' అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీ ఇంట్లో శాంతి, సామరస్యాన్ని కోరుకుంటే, మీ గది తూర్పు భాగంలో తాబేలు ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో సంతోషం కలుగుతుంది. కానీ ఎల్లప్పుడూ లోహపు తాబేలును నీటిలో ఉంచాలని గుర్తుంచుకోండి. వీటితో పాటు కొన్ని రంగు రాళ్లను కూడా వేయవచ్చు. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
అయితే ఇంట్లో తాబేలు ఎప్పుడూ నోరు తెరిచి ఉంచకూడదు. అలా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. అలాంటి తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో కలహాలు, అశాంతి, ఆర్థిక సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. వాస్తుకు సంబంధించి ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే వాస్తు నిపుణులను సంప్రదించడం మంచిది.
టాపిక్