తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Somanth Jyotirlinga Kshetram: సోమ‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం ఎలా ఏర్పడింది? ఈ దేవాలయం మహత్యం ఏంటి?

Somanth jyotirlinga kshetram: సోమ‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం ఎలా ఏర్పడింది? ఈ దేవాలయం మహత్యం ఏంటి?

HT Telugu Desk HT Telugu

04 July 2024, 19:18 IST

google News
    • Somanth jyotirlinga kshetram: పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం ఒకటి. ఈ క్షేత్ర మహత్యం, చరిత్ర గురించి ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. 
సోమ‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం ఎలా ఏర్పడింది?
సోమ‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం ఎలా ఏర్పడింది? (pinterest)

సోమ‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం ఎలా ఏర్పడింది?

Somanth jyotirlinga kshetram: ద్వాద‌శ జ్యోతిర్లింగాల‌లో అత్యంత ప్రాచీన‌మైన, ప్ర‌త్యేక‌మైన జ్యోతిర్లింగ క్షేత్రం సోమ‌నాథ క్షేత్రం. చంద్రుడిచే స్వ‌యంగా ప్ర‌తిష్ఠించ‌బ‌డిన క్షేత్రం క‌నుక దీనికి సోమ‌నాథ క్షేత్ర‌మ‌ని పేరు వ‌చ్చిన‌ట్టుగా ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఈ క్షేత్ర ద‌ర్శ‌నం చేత మాన‌సిక దోషాలు, చంద్రుడికి సంబంధించిన గ్ర‌హ దోషాలు, అనారోగ్య స‌మ‌స్య‌లు తొల‌గుతాయ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఆరోగ్య సంబంధిత బాధ‌లు అనుభ‌వించేవారికి సోమ‌నాథ క్షేత్ర ద‌ర్శ‌నం వ‌ల్ల ఆరోగ్య సిద్ధి ల‌భిస్తుంద‌ని చిలక‌మ‌ర్తి తెలియ‌జేశారు.

గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్రతీరంలో ఈ క్షేత్రం కొలువై ఉంది. ఇక్కడ దేవాలయాన్ని, అలాగే శివలింగాల్ని ప్రాచీన కాలంలో ఎంతోమంది మహమ్మదీయ రాజులు ధ్వంసం చేశారు. ధ్వంసమైనప్పుడల్లా పునర్నిర్మాణం జరిగింది. ఈ ప్రాచీన దేవాలయ పూర్వవైభవాన్ని పునరుద్ధరించడానికి, మనదేశానికి స్వ‌తంత్రం వచ్చిన తర్వాత పునర్నిర్మాణాన్ని ఆరంభించారు . పునర్నిర్మితమైన ఈ దేవాలయాన్ని1951లో మనదేశ తొలి రాష్ట్ర‌ప‌తి డా.రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఇక్కడి స్వామిని దర్మించడం వల్ల క్షయ, కుష్టుతోపాటు తదితర వ్యాధులు నయమవుతాయని, భక్తుల కోరికలు నెరవేరుతాయని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

సోమనాథ క్షేత్రానికి పూర్వం ప్రభాసక్షేత్రం అనే పేరు ఉండేది. భాస్కరతీర్థం, అర్కతీర్థం అని ప్రాచీన కాలంలో ఈ క్షేత్రాన్ని పిలిచేవార‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. సోమనాథ ప్రాశస్త్యాన్ని, మత్స్య, వామన, గరుడ, శివ, తదితర పురాణాలు కొనియాడుతున్నాయ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

పూర్వం దక్షప్రజాపతికి 27 మంది కుమార్తెలు ఉండేవారు. వారికి 27 న‌క్ష‌త్రాల పేర్లు పెట్టాడు. తన 27 మంది కుమార్తెల‌ను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. వారంద‌రిలో రోహిణి అంటే చంద్రుడికి మిక్కిలి ప్రేమ ఉండేది. చంద్రుడు త‌మ‌కంటే ఎక్కువ‌గా రోహిణిని ప్రేమించ‌డంపై మిగిలిన 26 మందికీ క‌ష్టంగా అనిపించింది. వారంతా ఓ రోజు త‌మ తండ్రి ద‌క్ష ప్ర‌జాప‌తి వ‌ద్ద‌కు చేరుకుని త‌మ బాధ‌ను వెల్ల‌డించారు. కుమార్తెల క‌ష్టాలు తెలుసుకున్న ఆయ‌న చంద్రుడిని పిలిపించి మంద‌లించాడు. భార్యలంద‌రినీ సమానంగా చూచుకోమని సూచించాడు. కానీ చంద్రుడు ఆ హితవు పాటించక, రోహిణిని అత్యంత ప్రేమతో చూచుకుంటూ, ఇతర భార్యలకు దూరంగా ఉన్నాడు.

ఇదే విష‌యాన్ని కుమార్తెల ద్వారా తెలుసుకున్న ద‌క్షుడు ఆగ్రహంతో "నీవు కుష్టువ్యాధితో బాధపడుదువుగాక!” అని చంద్రుడిని శపించాడు. శాపగ్రస్తుడైన చంద్రుడి కాంతి క్షీణించి, భూమండ‌లం అంత‌టా విప‌రీత ప‌రిస్థితులు ఏర్పాడ్డాయి. వర్షాలు లేక‌ కరువు సంభవించింది. చాలామంది వ్యాధిగ్రస్తులు అయ్యారు. అకాల మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఆ తీవ్రపరిణామాలనుండి తమను కాపాడాలని, రుషులు, దేవతలు, బ్రహ్మదేవునికి వేడుకున్నారు. వారి ఆవేద‌న‌ను అర్థం చేసుకున్న బ్ర‌హ్మ‌దేవుడు... చంద్రుడు పవిత్రమయిన ప్రభాసతీర్థానికి వెళ్లి, క‌ఠోర శివ త‌ప‌స్సు చేయాలని.. అలా చేస్తే ప‌ర‌మేశ్వ‌రుడు శాపవిముక్తి క‌లిస్తాడ‌ని చెప్పాడు. విష‌యం తెలుసుకున్న‌ చంద్రుడు ప్రభాసక్షేత్రానికి వెళ్ళి అక్కడ త్రయంబక మంత్రం జపిస్తూ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ త‌ప‌స్సుకు మెచ్చిన‌ పరమేశ్వరుడు కనికరించి ప్ర‌త్యక్షమై ఏం వ‌రం కావాలో కోరుకోమ‌నెను. తనను పీడిస్తున్న కుష్టువ్యాధి నుండి విముక్తిడిని చేయ‌మ‌ని చంద్రుడు కోరుకోనెను.

అప్పుడు పరమేశ్వరుడు.., "కృష్ణపక్షంలో నీవు క్షీణిస్తావు కానీ శుక్లపక్షంలో నీకాంతి దినదినం పెంపొందుతుంది అంటూ చంద్రుడికి వ‌రాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా చంద్రుడు శాపవిముక్తుడయిన తర్వాత, దేవతలు, రుషులు, పరమేశ్వరుడిని, పార్వతీ సమేతంగా ప్రభాస క్షేత్రంలోనే ఉండ‌మ‌ని వేడుకుంటారు. అందుకు సమ్మతించి, చంద్రుడికి ఇంకొకపేరైన సోమనాథ నామంతో అక్కడ పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా స్వయంగా ప్రకాశిస్తాడు. అప్పటినుండి ఈ క్షేత్రానికి సోమనాథ క్షేత్రమని పేరు వచ్చింద‌ని పురాణాలు తెలియ‌జేస్తున్నాయ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. కృతయుగంలో ఈ దేవాలయం బంగారు దేవాలయంగా ఉండేదని, త్రేతాయుగంలో రావణాసురుడు దీనిని వెండితో నిర్మించాడని, ద్వాపరయుగంలో భగవానుడు ఈ దేవాలయాన్ని చెక్కతో కట్టించాడని అంటారు. కలియుగంలో అనేక దండయాత్రల‌కు ఈ దేవాల‌యం గురి కావ‌డంతో ఇందులోని శిల్ప సంప‌ద చాలావ‌ర‌కూ ధ్వంస‌మైంది.

ఇత‌ర జ్యోతిర్లింగాల‌తో పోలిస్తే ఇది చాలా పెద్ద‌ద‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఇక్కడి శివలింగాన్ని తాకేందుకు అనుమ‌తి ఉండ‌దు. సోమనాథుని దర్శించి, పూజించినవారికి వారి మనోవాంఛలు తీరుతాయని, వారి సకలదోషాలు పరిహారమవుతాయని శివపురాణంలో పేర్కొనబడింద‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. సోమనాథుని అనుగ్రహం వలన భయంకర వ్యాధులు కూడా పటాపంచలవుతాయని, దారిద్య్ర దుఃఖాలు అంతరిస్తాయని భార్యభర్తలమధ్య అన్యోన్యత సమకూరుతాయ‌ని ప్రస్తుతింపబడింది.

సోమ‌నాథ్ దేవాల‌య ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న ప‌లు దేవాల‌యాల గురించి శివ పురాణంలో వివ‌రించ‌బ‌డింది. అందులో సరస్వతి, కపిల, హిరణ్య నదుల కలయికయే ఈ త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమంలోనే చంద్రుడు స్నానం చేసి తపస్సు చేశాడట. అందువలన ఈ త్రివేణి సంగమానికి చాలా మహిమ ఉందని, భయంకరమైన వ్యాధులు కూడా నయమవుతాయన్న నమ్మకం భక్తుల విశ్వాసం. ఇక‌, ఈ సోమ‌నాథ క్షేత్రంలో ప‌ర‌శురాముడు ధ్యానం చేసిన ప్ర‌దేశం, ఆది శంక‌రాచార్యుల వారు స్థాపించిన శార‌దామ‌ఠం ఉంది.

ఈ క్షేత్రానికి సమీపంలోనే భాలూకనాథ్ ఉంది. కృష్ణపరమాత్మ నిర్యాణం చెందిన ప్రదేశంగా ఈ భాలూక‌నాథ్‌ ప్రసిద్ధిచెందింది. ఇక్కడ ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా, జారుడనే ఒక బోయవాడు వేసిన బాణం గుచ్చుకొని, కృష్ణుడు పరమపదించాడట. ఈ స్థలంలో ఒక మందిరం వుంది. ఇందులో శ్రీ కృష్ణుడి విగ్రహంతోపాటు ఆయన‌పై బాణం సంధించిన బోయవాని విగ్రహం కూడా ఉంది. కృష్ణుడి పాదాన్ని జింక కన్నుగా భ్రమించి, బోయవాడు బాణం వేశాడట. ఏ చెట్టుకింద కృష్ణుడు విశ్రాంతి తీసుకున్నాడో, ఆ చెట్టు ఇప్పటికీ ఇక్కడ ఉండ‌టం విశేషమ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఒక కథనం ప్రకారం కృష్ణుడికి బాణం తగిలిన తర్వాత భాలూకానాధ్ నుండి ప్రభాసతీర్థానికి, అంటే సోమనాథ్‌ని త్రివేణి సంగమానికి వెళ్లి అక్కడ అవ‌తారాన్ని చాలించార‌ని.. ఆయనకు అర్జునుడు ఇక్కడే అంత్యక్రియలు జరిపించాడ‌ని ప్ర‌తీతి. సోమనాథ్‌లో పాండవగుహలూ ఉన్నాయి. అజ్ఞాత‌వాస స‌మ‌యంలో పాండ‌వులు ఇక్క‌డే ఉన్నార‌ని పురాణాలు తెలియ‌జేస్తున్నాయ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం