తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Govatsa Dwadashi 2022 : గోవత్స ద్వాదశి గురించి తెలుసా? గోవుని పూజిస్తే ఈ నియమాలు ఫాలో అవ్వాల్సిందే..

Govatsa Dwadashi 2022 : గోవత్స ద్వాదశి గురించి తెలుసా? గోవుని పూజిస్తే ఈ నియమాలు ఫాలో అవ్వాల్సిందే..

19 October 2022, 16:34 IST

google News
    • Govatsa Dwadashi 2022 : హిందూ సంప్రదాయం ప్రకారం గోవుని చాలా పవిత్రంగా చూస్తారు. సకల దేవతలు గోవులోనే నివసిస్తారని భావిస్తారు. అయితే గోవును పూజించడానికి కొన్ని విశేషమైన పుణ్యతిథులున్నాయి. ఈ తిథుల్లో పూజిస్తే.. మంచి ఫలితం దక్కుతుందని భక్తులు భావిస్తారు. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటే.. ఆశ్వయుజ బహుళ ద్వాదశి. దీనినే గోవత్స ద్వాదశి అని కూడా అంటారు.
గోవత్స ద్వాదశి 2022
గోవత్స ద్వాదశి 2022

గోవత్స ద్వాదశి 2022

Govatsa Dwadashi 2022 : గోవత్స ద్వాదశి మన సనాతన ధర్మంలో గోవు పూజకు.. గోవు ఆరాధనకు చాలా మంచిదని.. ప్రముఖ ఆధాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. గోమాతను పూజిస్తే.. వారి పాపాలు నశిస్తాయని.. ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆయన తెలిపారు. గోవు యందు సకల దేవతలు నివసిస్తారని పురాణాలు కూడా చెప్తున్నాయి.

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆశ్వయుజ మాసంలో బహుళ ద్వాదశి గోవత్స ద్వాదశిగా తెలుపుతారు. ఈ సంవత్సరం గోవత్స ద్వాదశి అక్టోబర్ 22వ తేదీన (శనివారం) వస్తుంది. దీపావళికి రెండు రోజుల ముందుగా వచ్చే ఈ గోవత్స ద్వాదశిరోజు దూడతో కూడిన గోవును పూజించాలి. గో పూజలో భాగంగా.. ఆవు, దూడను పసుపు, కుంకుమతో అలంకరించి.. తామ్రపాత్రతో గోవు పాదమునందు ఆర్యమియ్యాలి. ఇలా ఆర్యమిచ్చి..

క్షీరోదార్ణవ సంభూతే సురాసుర నమస్కృతే |

సర్వదేవమయే మాతః గృహాణార్ఘ్యం నమోస్తుతే ||

అనే మంత్రంతో గో మాతకు ఆర్యమివ్వాలి.

నైవేద్యంగా ఏమి సమర్పించాలంటే..

గారెలు, బూరెలు నైవేద్యముగా తయారుచేసి.. అవి గో మాతకు తినిపించాలి.

సర్వదేవమయే దేవి సర్వదేవైరలంకృతే |

మాతర్మమాభిలషితం సఫలం కురు నందిని ||

అనే మంత్రంతో గో ప్రార్థన చేయాలి. గోమాతను ఈరోజు పూజించిన వారికి సకల సంపదలు కలిగి.. ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి.

గోవు పూజ నియమాలు

దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్లు ఆ రోజు కచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఆరోజు నేలపై పడుకోవలసి వుంటుంది. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని అంటారు. గోమాతను దానం చేస్తే కోటి పుణ్య ఫలం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు. గోమాతను లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తారు. ఆవు పాలు ఎంతో శ్రేయస్కరం. గోమాతను దానం చేయడం ద్వారా వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి.

గోవులోని సకల దేవతలు

గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓసారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి, ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ.. నాలుకపై వరుణ దేవుడు, ఆవు సంకరంలో సరస్వతీదేవి, ఆవు చెక్కిళ్లలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు, ఆవు కంఠంలో ఇంద్రుడు, ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు, ఆవు గిట్టల చివర నాగదేవతలు, గిట్టల పక్కన అప్సరసలు ఉంటారని భక్తులు నమ్ముతారు. అందుకే గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

తదుపరి వ్యాసం