Ayodhya ram mandir: 7 వేల కిలోల రామ్ హల్వా.. 108 అడుగుల అగర్ బత్తి.. అయోధ్య రామాలయంలో ఎన్నో అద్భుతాలు
09 January 2024, 15:40 IST
- Ayodhya ram mandir: యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం కాబోతున్నాయి.
అయోధ్యకి తరలివెళ్తున్న భారీ అగర్ బత్తి
Ayodhya ram mandir : జనవరి 22.. దేశవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఎదురుచూస్తున్న రోజు. రామ జన్మభూమి అయోధ్య నగరంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. కన్నుల పండుగగా జరిగే ఈ వేడుకకు హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీతారలు, భక్తులు తరలిరానున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది.
రామ మందిర నిర్మాణం దగ్గర నుంచి అక్కడ ఏర్పాటు చేసే ప్రతి ఒక్కటి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇప్పటికే అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రామ్ లల్లా విగ్రహం ఎలా ఉంటుందో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసింది. ఆలయం సింహ ద్వారం ఎలా ఉంటుంది, రాత్రి వేళ ఆలయం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించిన ఫోటోస్ ఎక్స్ లో విడుదల చేస్తూ వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం మరింత ప్రత్యేకంగా ఉండేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భారీ గంట
అయోధ్య రామ మందిరంలో అన్నీ అద్భుతాలే జరగనున్నాయి. ఆలయంలో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే 600 కిలోలకి పైగా బరువు ఉండే భారీ గంట అయోధ్య చేరుకుంది. తమిళనాడు నుంచి ఈ గంట వచ్చింది. దీన్ని మోగిస్తే ఓంకారం శబ్ధం కిలోమీటరు దూరం వరకు ధ్వనిస్తుంది. ఈ గంట మీద జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది. ఇప్పటికే ఈ గంట అయోధ్య చేరుకుంది. ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో భక్తుల సందర్శనార్థం ఉంచారు.
భారీ అగర్ బత్తి
రాముని బాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా 108 అడుగుల పొడవైన అగర్ బత్తిని వెలిగించనున్నారు. గుజరాత్ నుంచి ఉత్తర ప్రదేశ్ కి పొడవైన ట్రక్ లో దీన్ని తరలిస్తున్నారు. ప్రతిష్ఠాపనలోపు ఈ భారీ ధూపం స్టిక్ కూడా అయోధ్య చేరుకోబోతుంది. గుజరాత్ లోని వడోదర కి చెందిన గోపాలక విహాభాయ్ బర్వాద్ దీన్ని తయారు చేశారు. దీని తయారీలో 374 కిలోల గూగల్, 280 కిలోల బార్లీ, 191 కిలోల ఆవు నెయ్యి, 108 కిలోల సుగంధ ద్రవ్యాలు, హవన్ మెటీరియల్ 475 కిలోలు, 572 కిలోల గులాబీ పువ్వులు, 1475 కిలోల ఆవు పేడ ఉపయోగించారు. దీని బరువు 3,657 కిలోలు. పొడవు 108 అడుగులు, వెడల్పు 3.5 అడుగులు. దీన్ని తయారు చేయడానికి ఆరు నెలల సమయం పట్టింది. రూ.5.5 లక్షలు వ్యయంతో దీన్ని రూపొందించారు. దాదాపు 41 రోజుల పాటు మండుతూనే ఉంటుంది. జనవరి 13 న అయోధ్యకి చేరుకుంటుంది.
రామ్ హల్వా
అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజు నాగ్ పూర్ కి చెందిన చెఫ్ విష్ణు మనోహర్ సుమారు 7 వేళ కిలోల రామ్ హల్వాని తయారు చేయించబోతున్నారు. రామ మందిర ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమం కోసం 12 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ప్రత్యేక కడాయిని రూపొందించారు. దీన్ని ఎత్తాలంటే క్రేన్ ఉపయోగించాలి. దీని బరువు సుమారు 1300-1400 కిలోల బరువు ఉంటుంది.
ఈ కడాయిలో 7 వేల కిలోల రామ్ హల్వాని తయారు చేయబోతున్నారు. 10 నుంచి 12 కిలోల బరువు ఉన్న గరిటెలు దీనికి ఉపయోగిస్తారు. 900 కిలోల రవ్వ, వెయ్యి కిలోల నెయ్యి, వెయ్యి కిలోల పంచదార, 2000 లీటర్ల పాలు, 2500 లీటర్ల నీళ్ళు, 300 కిలోల డ్రై ఫ్రూట్స్, 75 కిలోల యాలకుల పొడితో హల్వా తయారు చేయనున్నట్లు చెఫ్ మనోహర్ తెలిపారు.
తొమ్మిది దేశాల సమయం తెలిపే గడియారం
ఒకేసారి తొమ్మిది దేశాల సమయాన్ని తెలిపే విధంగా ఉండే ప్రత్యేకమైన గడియారాన్ని అనిల్ సాహు అనే రామ భక్తుడు రూపొందించాడు. ఇందులో ఒకే ఒక ముల్లు ఉంటుంది. రామలయంలో ఉంచేందుకు ఈ గడియారం బహుమతిగా ఇవ్వనున్నాడు.
భారీ దీపం
ప్రపంచంలోనే అతిపెద్ద దీపం అయోధ్యలో వెలిగించనున్నారు. 28 మీటర్ల పొడవు ఉండే ఈ దీపాన్ని వెలిగించడానికి సుమారు 21 క్వింటాళ్ల నూనె అవసరం అవుతుంది. దీపంలో పెట్టె వత్తి కోసం 1.25 క్వింటాళ్ల పత్తి ఉపయోగించారు.