తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఆశ్వయుజ మాసం.. దేవీ ఆరాధనకు విశిష్ట మాసం

ఆశ్వయుజ మాసం.. దేవీ ఆరాధనకు విశిష్ట మాసం

HT Telugu Desk HT Telugu

06 October 2023, 10:17 IST

google News
    • అశ్వినీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగిందే ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజి అంటే పార్వతీ దేవి, సరస్వతి, లక్ష్మి. వీరి ఆరాధన ఈ నెలలో విశిష్టం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దేవీ నవరాత్రుల కోసం రూపుదిద్దుకుంటున్న అమ్మవారి విగ్రహాలు
దేవీ నవరాత్రుల కోసం రూపుదిద్దుకుంటున్న అమ్మవారి విగ్రహాలు

దేవీ నవరాత్రుల కోసం రూపుదిద్దుకుంటున్న అమ్మవారి విగ్రహాలు

శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక సంసృతిలో విలక్షణమైనవి. ఆశ్వయుజ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు దేవిని పూజిస్తారు. ఈ మాసంలో పార్వతీ దేవి, లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి అమ్మవార్లను ఆరాధిస్తారు. వీరిని అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

తెలంగాణ ప్రాంతంలో గౌరమ్మను కొలుస్తూ బతుకమ్మ సంబరాలను తొమ్మిది రోజులపాటు వేడుకగా నిర్వహిస్తారు. దేశంలో ఉత్తరాదిన రామలీలా ఉత్సవాలు చేస్తారు. మహాలయ పితృపక్షం ముగియగానే దేవతారాధన మొదలవుతుంది. పితృదేవతలను తమకు ప్రసాదించిన ఆదిపరాశక్తిని త్రిమాతా రూపంగా పూజించడం ఈ మాసం విశిష్టత అని చిలకమర్తి వివరించారు. సమస్త జగత్తును పాలించే అమ్మ ఆదిపరాశక్తి లక్ష్మి, సరస్వతి, పార్వతి రూపంలో లోకాలకు సమస్త సౌభాగ్యాలు, విద్య, శక్తి ప్రసాదిస్తున్నారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో కలశస్థాపన చేస్తారు. ఈ కలశాన్ని తొమ్మిది రోజులు పూజించి పదో రోజున ఉద్వాసన చెబుతారు. మూలా నక్షత్రంతో కూడిన షష్టి లేదా సప్తమి నాడు రస్వతి పూజ చేస్తారు. వేదమాతృకగా, జ్ఞాన భూమికగా, సమస్త విద్యావాహికగా సరస్వతిని దర్శించడం భారతీయ సంప్రదాయం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

రోజువారీగా అమ్మవారికి పూజలు

  1. ఒక సంప్రదాయం ప్రకారం నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని 'శైలపుత్రి'గా పూజిస్తారు.
  2. రెండో రోజు తపోనిష్టతో పరమేశ్వరుని మెప్పించిన “బ్రహ్మచారిణి'ని సేవిస్తారు.
  3. మూడోరోజు 'చంద్ర ఘంటాదేవిగా పూజిస్తారు.
  4. నాలుగోరోజు 'కూష్మాందదేవిగా పూజిస్తారు.
  5. ఐదో రోజు స్కంధమాతగా పూజిస్తారు.
  6. ఆరో రోజు కాత్యాయనిగా పూజిస్తారు.
  7. ఏడో రోజు అమ్మ వారిని 'కాళరాత్రిదేవి'గా అర్చిస్తారు.
  8. ఎనిమిదోరోజు 'మహాగౌరి’గా కొలుస్తారు.
  9. తొమ్మిదోరోజు సిద్ధధాత్రిగా కొలుస్తారు.
  10. దేవీనవరాత్రుల్లో “కుమారీపూజ చేసే ఆచారమూ ఉంది. పదోరోజు ‘విజయదశమి’.

ఆయుధ పూజ

విజయ దశమి నాడు శ్రీరాముడు రావణుని సంహరించాడు. అర్జునుడు జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలు తీయించి కౌరవ వీరులను ఓడించాడని మహాభారతం విరాటపర్వం చెబుతోంది. అందుకే విజయ దశమి రోజు శమీపూజ చేస్తారు. అరణ్యవాసం పూర్తి చేసుకుని అజ్ఞాతవాసం చేసే సమయం ఆసన్నమైనప్పుడు పాండవులు తమ ఆయుధాలు పరుల కంట పడకుండా శ్రీ కృష్ణుని సలహా మేరకు జమ్మిచెట్టు మీద భద్రపరిచారు. అజ్ఞాత వాస ముగింపులో విజయ దశమి నాడు అర్జునుడు ఆయుధాలను దించి పూజ చేసి ఉత్తర గోగ్రహణ యుద్దాన్ని చేసి విజయం సాధిస్తాడు. కనుక ఆశ్వీయుజ శుద్ద దశమి విజయ దశమి అయింది.

ఆ రోజున మహిశాసురుడిని చంపి దుర్గాదేవి, యుద్ధంలో అర్జునుడు విజయం సాధించారు కనుక ప్రజలు తమకు జీవనాధారమైన వస్తువులకు కృతజ్ఞతాపూర్వకంగా పూజలు చేసి తమ జీవితం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇదే ఆయుధ పూజ. విద్యార్థులు పాఠ్యపుస్తకాలను, ఇతరులు తమ వృత్తికి సంబంధించిన పరికరాలను పూజలో పెట్టడం ఆనవాయితీ.

ఈరోజు నూతనంగా విద్యార్థులను పాఠశాలలో చేర్చడం, అక్షరాభ్యాసం చేయడం ఆచారాలలో ఒకటి. వ్యాపారులు కొత్త లెక్కలు ఈ రోజు నుండి ప్రారంభించడం కొన్ని ప్రదేశాలలో ఆచారం.

ఆశ్వీయుజ బహుళ ద్వాదశి గోవత్స ద్వాదశి. ఈరోజు దూడతో కూడిన ఆవును పూజిస్తారు. బహుళ తదియ అట్ల తదియ. స్త్రీల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి 'ధనత్రయోదశి’. ఈరోజు లక్ష్మీ పూజ చేస్తారు. చతుర్దశి నాడు నరకాసురుని వధించిన దినంగా ‘నరక చతుర్దశి’గా భావిస్తారు.

అమావాస్య నాడు “దీపావళి.” నరకాసుర వధ కాకుండా బలిచక్రవర్తి గౌరవార్థం దీపావళి జరిపినట్లు భవిష్యోత్తరపురాణం చెబుతోంది. దీపావళినాడు విక్రమార్శుని పట్టాభిషేకం జరిగిందనే ఒక గాథ ప్రచారంలో ఉంది. సూర్యుడు దీపావళి నాడు తులారాశిని పొందుతాడని, ఆరోజు లోకులు దివిటీలతో తమ పితృదేవతలకు మార్గదర్శనం చేయాలని “ధర్మసింధు” చెబుతోందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం