మంగళవారం ఇలా చేశారంటే ఐశ్వర్యం మీ ఇంట్లోనే..
01 December 2023, 10:11 IST
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎంత సంపాదించినా ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉంటున్నాయా? మంగళవారం ఈ పరిహారాలు చేశారంటే ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడొచ్చు.
Lord Hanuman: హనమంతుడు
సనాతన ధర్మంలో ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. హిందూమతంలో మంగళవారం పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఆ రోజు హనుమంతుడుని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని నమ్ముతారు. జీవితంలో తరచూ సమస్యలు ఎదురువుతూ, ఉద్యోగ విషయంలో, వ్యక్తిగతంగా, ధన సంపాదన విషయంలో ఇబ్బందులు ఎదురువుతూ ఉంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల వాటి నుంచి బయట పడొచ్చు.
అంజనీ పుత్రుడు హనుమంతుడికి ఇష్టమైన రోజు మంగళవారం. అందుకే ఆరోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే అన్నీ సమస్యలు తొలగిపోతాయి. హిందూ గ్రంథాల ప్రకారం మంగళవారం నాడు హనుమాన్ ని స్మరించుకుంటూ ఈ పనులు చేశారంటే ఎంతటి కష్టాలైన ఇట్టే తొలగిపోతాయి.
ఆర్థిక కష్టాలు అధిగమించాలంటే..
కొంతమంది ఎంత సంపాదిస్తున్నా కూడా చేతిలో డబ్బులు మాత్రం నిలవడం లేదని బాధపడుతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆవనూనెతో దీపం వెలిగించాలి. అది మాత్రమే కాదు తప్పనిసరిగా హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు.
శ్రేయస్సు కోసం..
హనుమంతుడికి బెల్లం, శనగలు అంటే చాలా ఇష్టం. అందుకే మంగళవారం నాడు వాటిని హనుమంతుడికి ప్రసాదంగా సమర్పించాలి. వాటిని ఇతరులకు ప్రసాదంగా పంచి పెట్టడం వల్ల కూడా మేలు జరుగుతుంది. ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి.
ఐశ్వర్యం కోసం..
హనుమంతుడికి తులసి ఆకులు అంటే మహా ప్రీతి. తులసి ఆకులని నైవేద్యంగా సమర్పిస్తే ఆంజనేయ స్వామి కటాక్షం లభిస్తుంది. మంగళవారం నాడు హనుమంతుడికి తులసితో చేసిన మాల వేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది.
దోష పరిహార నివారణ..
మంగళవారం దోషాన్ని నివారించడం కోసం హనుమంతుడికి ఇష్టమైన రావి చెట్టు ఆకులు సమర్పించాలి. 11 రావి ఆకులు తీసుకుని వాటిని మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. వాటి మీద “జై శ్రీరామ్” అని చందనంతో రాయాలి. ఆ ఆకుల్ని మీకు దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దేవుడి ముందు పెట్టాలి. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు.
ఉపవాసం
ప్రతి మంగళవారం ఉపవాసం ఉండటం వల్ల హనుమంతుని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు మంగళవారం ఉపవాసం ఉండి హనుమంతుడిని పూజించడం వల్ల సంతాన భాగ్యం పొందవచ్చని నమ్ముతారు. ఆ రోజు ఉపవాసం ఉండటం వల్ల పాపాల నుంచి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. 21 వారాల పాటు ఉపవాసం ఉంటూ హనుమంతుడిని స్మరించుకుంటూ పూజలు చేయాలి. ఉపవాసం ఉండే వాళ్ళు ఆరోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం శ్రేష్టం
దానం చేస్తే..
మంగళవారం నాడు వస్తువులను దానం చేయడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అలా చేస్తే లక్ష్మీ దేవి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఆవుకి ఆహారం తినిపించడం శుభప్రదం.