Akshaya Tritiya 2023 । అక్షయ తృతీయతో పుణ్యఫలం అక్షయం.. ఈరోజు విశిష్టత ఇదే!
22 April 2023, 7:30 IST
- Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ రోజున చేసే జపం, యజ్ఞం, పిత్ర-తర్పణం, దాన-ధర్మాలు చేయడం వల్ల కలిగే పుణ్యఫలం శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
Akshaya Tritiya 2023
Akshaya Tritiya 2023: వైశాఖ మాసంలో వచ్చే శుద్ధ తదియ తిథి ఎంతో పవిత్రమైనది దీనినే అక్షయ తృతీయ అంటారు. ఈ తిథినాడు మహా విష్ణువు అక్షయ రూపంలో కొలువుదీరతతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ అక్షయ తృతీయ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానధర్మాదులేవైనా, పుణ్య కార్యమేదైనా దాని ఫలితము అక్షయమవుతుందని ప్రతీతి. పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. అందుకే అక్షయ తృతీయ నాడు శుభకార్యాలు చేయడానికి శుభకరమైనదిగా పురాణాశాస్త్రాలు పేర్కొన్నాయి.
అక్షయ తృతీయను భారతదేశం, నేపాల్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, జైనులు జరుపుకుంటారు. ఇది ఇంటికి శ్రేయస్సును తీసుకొచ్చే పవిత్రమైన రోజుగా దీనిని జరుపుకుంటారు. ఏవైనా నూతన కార్యాలు ప్రారంభించటానికి, శుభకార్యాలు జరపటాని ఈరోజు శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది. సాధారణంగా అక్షయ తృతీయ నాడు కొత్త వెంచర్లను ప్రారంభిస్తారు, వివాహాలను నిర్వహిస్తారు లేదా బంగారం కొనుగోలు చేస్తారు, భూములు, ఆస్తులు ఇతర ఖరీదైన వాటిలో పెట్టుబడి పెడతారు.
సంస్కృతంలో 'అక్షయ' అనే పదానికి 'శాశ్వతమైనది' అని అర్థం వస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు ప్రారంభించినది శాశ్వతంగా నిలిచి ఉంటుంది, సంపద తరిగిపోకుండా ఉంటుందని ప్రజలు నమ్ముతారు. దృక్‌పంచాంగం ప్రకారం, అక్షయ తృతీయ రోజున చేసే జపం, యజ్ఞం, పిత్ర-తర్పణం, దాన-ధర్మాలు చేయడం వల్ల కలిగే పుణ్యఫలం శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
అక్షయ తృతీయ ప్రాముఖ్యత
హిందూ పురాణాల ప్రకారం, అక్షయ తృతీయ మహా విష్ణువు ఆశీర్వాదం లభించే పవిత్రమైన రోజు. త్రేతా యుగం ప్రారంభమైన రోజు విష్ణువు 6వ అవతారం పరశురాముడిగా అవతరించిన రోజు కూడా ఇదేనని పురాణగాథలు వివరించాయి. మరొక పురాణం ప్రకారం గంగా నది భూమిపైకి అక్షయ తృతీయ నాడు అవతరించింది కాబట్టి ఈ రోజును గంగావత్రంగా కూడా జరుపుకుంటారు.
అక్షయ తృతీయ కార్యాచరణ
అక్షయ తృతీయ నాడు మహా విష్ణువు ఆరాధన చేయాలి. పేదవారికి ఆహారం, బట్టలు, డబ్బును దానంగా ఇవ్వాలి. బంగారం, ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం, కొత్త వాహనం, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేస్తారు.