తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  స్టాక్‌ మార్కెట్లలో సెన్సెక్స్‌, నిఫ్టీ అంటే ఏంటి? వీటిని ఎలా లెక్కిస్తారు?

స్టాక్‌ మార్కెట్లలో సెన్సెక్స్‌, నిఫ్టీ అంటే ఏంటి? వీటిని ఎలా లెక్కిస్తారు?

Hari Prasad S HT Telugu

03 May 2022, 9:12 IST

google News
    • మార్కెట్‌ ట్రెండ్స్‌ను తెలుసుకోవడానికి ఈ రెండు సూచీ(ఇండెక్స్‌)లను చాలా ముఖ్యమైన కొలమానాలుగా భావిస్తారు. స్టాక్‌ మార్కెట్ల గురించి లోతుగా అవగాహన లేని వారికి ఈ సెన్సెక్స్‌, నిఫ్టీలు ఏంటి? వీటి మధ్య తేడా ఏంటి? వీటిని ఎలా లెక్కిస్తారన్నది తెలియదు.
ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌
ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌ (Reuters )

ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌

మనం ప్రతి రోజూ చూస్తూనే ఉంటాం. స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయనో, నష్టాల్లో ఉన్నాయనో వార్తలు వస్తుంటాయి. వీటిలో ప్రధానంగా సెన్సెక్స్‌, నిఫ్టీ అనే పదాలు కనిపిస్తూ ఉంటాయి. సెన్సెక్స్‌ ఇన్ని పాయింట్లు పెరిగింది లేదంటే పతనమైంది.. నిఫ్టీ ఇన్ని పాయింట్లు పెరిగింది లేదంటే పతనమైందని చెబుతుంటారు. 

మార్కెట్‌ ట్రెండ్స్‌ను తెలుసుకోవడానికి ఈ రెండు సూచీ (ఇండెక్స్‌)లను చాలా ముఖ్యమైన కొలమానాలుగా భావిస్తారు. స్టాక్‌ మార్కెట్ల గురించి లోతుగా అవగాహన లేని వారికి ఈ సెన్సెక్స్‌, నిఫ్టీలు ఏంటి? వీటి మధ్య తేడా ఏంటి? వీటిని ఎలా లెక్కిస్తారన్నది తెలియదు. ఈ నేపథ్యంలో ముందుగా అసలు ఈ సూచీలు అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇండెక్స్‌ అంటే ఏంటి?

స్టాక్‌ మార్కెట్‌లో సుమారు 6 వేల కంపెనీలు లిస్ట్‌ అయి ఉన్నాయి. ప్రతి రోజూ ఇన్ని వేల కంపెనీల షేర్ల పనితీరు చూసి మార్కెట్‌ ట్రెండ్‌ను నిర్ధారించడం సాధ్యం కాదు. అందువల్ల ఇండెక్స్‌ (సూచీ) విలువ ఆధారంగా మార్కెట్‌ ట్రెండ్స్‌ను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనికోసం మార్కెట్‌లో లిస్ట్‌ అయిన కంపెనీల నుంచి వివిధ రంగాలకు చెందిన కొన్ని కంపెనీలను ఇండెక్స్‌ తీసుకుంటుంది. ఈ కంపెనీల ఎంపిక కూడా కొన్ని కొలమానాల ప్రకారం ఉంటుంది. అవి ఏంటో తర్వాత చూద్దాం. ఈ ఇండెక్స్‌లో బ్యాంకింగ్‌, ఆటో, ఐటీ, సర్వీస్‌, పవర్‌ వంటి వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఉంటాయి.

సెన్సెక్స్‌ అంటే ఏంటి?

మన దేశంలో రెండు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. ఒకటి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్ కాగా, మరొకటి నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్‌ కాగా.. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఉపయోగించే సూచి సెన్సిటివ్‌ ఇండెక్స్‌నే సింపుల్‌గా సెన్సెక్స్‌ అంటారు. ఈ ఎక్స్ఛేంజ్‌లో 6 వేల కంపెనీలు లిస్ట్‌ అయి ఉన్నాయి. అయితే బీఎస్‌ఈ మాత్రం 30 కంపెనీల పనితీరు పరిగణనలోకి తీసుకుంటుంది. 

మంచి పనితీరు కనబరుస్తున్న, ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న, మార్కెట్‌కు ఉత్తమమైనవిగా భావించే కంపెనీలను తీసుకుంటారు. ఈ కంపెనీల షేర్లు పతనమైతే మార్కెట్‌ ట్రెండ్స్‌ కూడా నేల చూపులు చూస్తాయి. ఈ కంపెనీల పనితీరు బాగుంటే మార్కెట్లు దూసుకెళ్తాయి. సెన్సెక్స్‌ కోసం కేవలం 30 కంపెనీలనే ఎంపిక చేస్తారని చెప్పుకున్నాం కదా. మరి దీనికి కొలమానం ఏంటి అన్న సందేహం కలుగుతుంది. దీనికోసం సదరు కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్, ట్రేడింగ్‌ ఫ్రీక్వెన్సీ, అధిక లిక్విడిటీ, సగటు రోజువారీ టర్నోవర్‌ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.

నిఫ్టీ అంటే ఏంటి?

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఉపయోగించే సూచీనే నిఫ్టీ అంటారు. ఇది నేషనల్‌, ఫిఫ్టీ అనే రెండు పదాల కలయిక. పేరులో ఉన్నట్లే ఈ సూచీ కోసం 50 కంపెనీల పనితీరును పరిగణనలోకి తీసుకుంటారు. సెన్సెక్స్‌లాగే ఒకే రంగానికి చెందినవి కాకుండా ఐటీ, ఆర్థిక సేవలు, ఆటోమొబైల్స్‌, టెలికమ్యూనికేషన్లు వంటి వివిధ రంగాల కంపెనీలు ఈ సూచీలో ఉంటాయి. కంపెనీ లిక్విడిటీ, ఫ్లోట్‌ అడ్జస్ట్‌మెంట్‌ (ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్న షేర్లు), కంపెనీ స్థానికతను బట్టి ఆ 50 కంపెనీలను సూచీ కోసం ఎంపిక చేస్తారు.

రెండు సూచీల మధ్య తేడా ఏంటి?

రెండు సూచీలు రెండు వేర్వేరు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో ఉపయోగించేవి. ఈ రెండూ లిస్ట్‌ అయిన మొత్తం కంపెనీలలో నుంచి కొన్నింటిని ఎంపిక చేసుకొని వాటి పనితీరు ఆధారంగా మార్కెట్‌ ట్రెండ్స్‌ను నిర్ధారించేవే. కాకపోతే సెన్సెక్స్‌లో 30 కంపెనీలు ఉంటే, నిఫ్టీలో మాత్రం 50 కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇక సెన్సెక్స్‌ను 1986లో ప్రారంభించగా, నిఫ్టీ 1996లో ప్రారంభమైంది. గతంలో సెన్సెక్స్‌ను ఎస్‌&పీ బీఎస్‌ఈ సెన్సెక్స్‌గా, నిఫ్టీని సీఎన్‌ఎక్స్‌ ఫిఫ్టీగా పిలిచేవారు. సెన్సెక్స్‌లో 13 పారిశ్రామిక రంగాలు ఉంటే, నిఫ్టీలో 24 పారిశ్రామిక రంగాలకు చెందిన కంపెనీలు ఉంటాయి.

సెన్సెక్స్‌, నిఫ్టీలను ఎలా లెక్కిస్తారు?

రెండు సూచీలు, వాటి మధ్య ఉన్న తేడాలేంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటిని ఎలా లెక్కిస్తారో చూద్దాం. ముందుగా సెన్సెక్స్‌ సూచీని తీసుకుంటే.. ఇందులోని 30 కంపెనీల ఫ్రీ-ఫ్లోట్‌ క్యాపిటలైజేషన్‌, సెన్సెక్స్‌ బేస్‌ వాల్యూ ఆధారంగా లెక్కిస్తారు. ఓ కంపెనీ షేరు ధరను, ఆ కంపెనీకి సంబంధించి మార్కెట్లో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్న షేర్లతో గుణిస్తే వచ్చేదే ఈ ఫ్రీ-ఫ్లోట్‌ క్యాపిటలైజేషన్. సెన్సెక్స్‌ లెక్కించడానికి ముందుగా మొత్తం 30 కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ లెక్కిస్తారు. ఆ తర్వాత ఒక్కో కంపెనీ ఫ్రీ-ఫ్లోట్‌ క్యాపిటలైజేషన్‌ లెక్కించి, అన్నింటిని కలుపుతారు.

సెన్సెక్స్‌ = (30 కంపెనీల ఫ్రీ ఫ్లోట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌/ బేస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌)*బేస్‌ వాల్యూ ఆఫ్‌ ద ఇండెక్స్‌.

ఇక నిఫ్టీ విషయానికి వస్తే..

నిఫ్టీ సూచీ విలువ = (ప్రస్తుత మార్కెట్‌ విలువ/ బేస్‌ మార్కెట్‌ క్యాపిటల్‌)* నిఫ్టీ బేస్‌ ఇండెక్స్‌ వాల్యూ (1000)

బేస్‌ మార్కెట్‌ క్యాపిటల్‌ అంటే బేస్‌ పీరియడ్‌ (నవంబర్‌ 3rd, 1995) నాటికి సూచీలోని అన్ని స్టాక్‌ల మొత్తం మార్కెట్‌ విలువను సూచిస్తుంది.

 

టాపిక్

తదుపరి వ్యాసం