Free Legal Aid | న్యాయ సేవలు ఉచితంగా ఎలా పొందవచ్చు? ఎవరు అర్హులు?
24 January 2022, 21:01 IST
- Free Legal Aid.. ఉచితంగా న్యాయ సేవలు పొందే అవకాశం ఉందని మీకు తెలుసా? మీరు బాధితులైనప్పుడు, ఫీజులు చెల్లించి న్యాయవాదులను ఆశ్రయించే స్థోమత లేనప్పుడు మీకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నల్సా) చట్టం పరిధిలోని సెక్షన్ 12 ఉచిత న్యాయ సేవలు కల్పించాలని ఆదేశిస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం: లీగల్ ఎయిడ్
ఉచిత న్యాయ సేవలకు అర్హులు ఎవరు?
మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు, మానవ అక్రమ రవాణాలో బాధితులు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దివ్యాంగులు, పెద్ద విపత్తులో బాధితులుగా ఉన్నవారు, జాతి వైషమ్యాలలో హింసకు గురైనవారు, కులం పేరుతో వేధింపులకు గురైనవారు ఉచిత న్యాయ సేవలు అందుకునేందుకు అర్హులు.
అలాగే తుపాన్లు, కరువు, భూకంపం, పారిశ్రామిక ప్రమాదం తదితర విపత్తులు ఎదురైనప్పుడు బాధితులుగా మారిన వారు కూడా ఉచిత సేవలు పొందవచ్చు.
అలాగే పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, మానవ అక్రమ రవాణా బాధితులుగా కస్టడీలో ఉన్న వారు, జువైనల్ హోమ్‌లో ఉన్నవారు, సైకియాట్రిక్ ఆసుపత్రుల్లో మానసిక అనారోగ్యానికి చికిత్స పొందుతూ ఉన్నవారు కూడా ఈ చట్టం పరిధిలో ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు.
అయితే న్యాయ సేవలు ఉచితంగా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ పరిమితిని విధించాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రీతిలో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే రూ. 3 లక్షలు, తెలంగాణలో అయితే రూ. లక్ష ఆదాయ పరిమితి ఉంది.
మహిళలు, చిన్నారులకు ఆదాయ పరిమితి వర్తించదు. అలాగే సీనియర్ సిటిజెన్లు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిబంధనలకు అనుగుణంగా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు.
ఏయే ఉచిత న్యాయ సేవలు లభిస్తాయి?
1. మీ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాది
2. లీగల్ ప్రొసీడింగ్స్‌లో అయ్యే ఖర్చులు.. అంటే ప్రాసెస్ ఫీజు తదితర ఖర్చులు
3. ప్లీడింగ్స్ తయారు చేయడం, అప్పీలు మెమో తయారు చేయడం, డాక్యుమెంటేషన్
4. లీగల్ డాక్యుమెంట్స్ డ్రాఫ్ట్ చేయడం
5. తీర్పులు, ఉత్తర్వులు, నోట్స్ ఆఫ్ ఎవిడెన్స్, లీగల్ ప్రోసీడింగ్స్‌కు అవసరమైన ఇతర డాక్యుమెంట్ల సర్టిఫైడ్ కాపీలు అందించడం
6. న్యాయ సలహాలు, అప్పీళ్లు
Free Legal Aid కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
దరఖాస్తులను ఆన్‌లైన్‌లోగానీ, ఆఫ్‌లైన్‌లోగానీ సమర్పించవచ్చు. ఆఫ్‌లైన్ అయితే తాలూకాస్థాయి నుంచి సుప్రీం కోర్టు స్థాయి వరకు ఆయా కోర్టుల ఆవరణలో ఉండే లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో సమర్పించవచ్చు. లేదా పోస్ట్ ద్వారా పంపవచ్చు.
ఒక తెల్ల కాగితంలో మీ వివరాలన్నీ రాసి, మీ అర్హతలకు సంబంధించి డాక్యుమెంట్లు పొందుపరిచి కూడా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. నల్సా ఈమెయిల్(nalsa-dla@nic.in) ద్వారా కూడా పంపవచ్చు.
ఆన్‌లైన్‌లో అయితే ఉచిత న్యాయ సేవల కోసం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ – నల్సా వెబ్‌సైట్ సందర్శించాలి. ఇందులో న్యూ అప్లికేషన్ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు ఫారాన్ని నింపవచ్చు.
ఇందులో తాలూకా స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి లీగల్ సర్వీసెస్ అథారిటీలతో పాటు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, సుప్రీం కోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ విభాగానికి సంబంధించిన సేవలు కావాలో అందులో ఎంచుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్వీసెస్ మాటర్స్, లా అండ్ ఆర్డర్ .. ఇలా మీరు కోరుతున్న న్యాయ సేవ దేని పరిధిలోకి వస్తుందో అది ఎంచుకోవాలి.
తదుపరి మీ వ్యక్తిగత, కుటుంబ వివరాలు నమోదు చేయాలి. మీ ఫోటో అప్‌లోడ్ చేయాలి.
న్యాయ సేవ ఏ విషయంలో?
మీరు ఏ విషయంలో న్యాయ సేవలు కోరుతున్నారో ఆ అభ్యర్థన రాయాలి. ఒకవేళ ఇదివరకే కేసు ఫైల్ అయి ఉంటే సంబంధిత వివరాలు నమోదు చేయాలి.
దరఖాస్తు నింపడం పూర్తయిన తరువాత సబ్మిట్ చేయాలి. ఆ వెంటనే మీకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ సాయంతో మీరు మీ అభ్యర్థన ఏ స్థితిలో ఉందో ట్రాక్ కూడా చేయొచ్చు.
ఈ దరఖాస్తులను సంబంధిత కమిటీ పరిశీలించి మీకు తగిన న్యాయ సలహా ఇవ్వడమా? లేక న్యాయవాదిని కేటాయించడమా? తేల్చి తగిన సాయం అందిస్తుంది.
మీ దరఖాస్తు అందిన ఏడు రోజుల లోపు ఈ సాయం లభిస్తుంది. మీకు కేటాయించిన న్యాయవాది తీరుతో మీరు సంతృప్తి చెందని పక్షంలో సంబంధిత లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఒక లేఖ రాయవచ్చు. మెయిల్ రూపంలో గానీ, నల్సా వెబ్‌సైట్‌లో గ్రీవెన్స్ రూపంలో గానీ పంపవచ్చు.