Pending Cases | తెలంగాణలో 10.50 లక్షలకు పైగా పెండింగ్ కేసులు
24 January 2022, 20:27 IST
- తెలంగాణలోని హైకోర్టులు, దిగువ కోర్టుల్లో కలిపి నవంబరు 2021 నాటికి మొత్తంగా 10.50 లక్షలకు పైగా కేసులు పేరుకుపోయాయి. తెలంగాణ హైకోర్టులో 2.52 లక్షల కేసులు, జిల్లాస్థాయి, తాలూకా స్థాయి కోర్టుల్లో 8.03 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
తెలంగాణ హైకోర్టు
తెలంగాణలోని జిల్లాస్థాయి, తాలూకా స్తాయి దిగువ కోర్టుల్లో మొత్తం 8.03 లక్షల కేసులకు గాను 3,26,460 సివిల్ కేసులు, 4,77,116 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దిగువ కోర్టుల్లో కూడా మూడు దశాబ్దాలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
30 ఏళ్లకు పైగా దిగువ కోర్టుల్లోనే..
తెలంగాణలో దిగువ కోర్టుల్లో 3,40,743 కేసులు.. అంటే 42.39 శాతం కేసులు ఏడాదిలోపువి కాగా, 2,65,158 కేసులు ఒకటి నుంచి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. అంటే 33 శాతం కేసులు ఈ కోవలోకి వస్తాయి. ఇక మూడు నుంచి ఐదేళ్లుగా 1,22,037 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఐదు నుంచి పదేళ్ల మధ్య దాదాపు 65,918 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల మధ్య 8,881 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు 814 కేసులు ఏకంగా 20 నుంచి 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉండగా, 90 కేసులు 30 ఏళ్లకు పైబడి పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో దిగువ కోర్టుల్లో పెండింగ్‌లో ఉండడానికి ప్రధాన కారణం వివిధ కోర్టుల్లో స్టే ఉండడమేనని గణాంకాల ద్వారా అవగతమవుతోంది.
తెలంగాణ హైకోర్టులో 2.52 లక్షల కేసుల పెండింగ్
తెలంగాణ హైకోర్టులో మొత్తం 2,52,702 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2,16,858 సివిల్ కేసులు, 35,844 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వీటిలో 19.08 శాతం.. అంటే 48,225 కేసుల పెండింగ్ సమయం ఏడాదిలోపే ఉంది.
ఒకటి నుంచి మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 54,712గా, మూడు నుంచి ఐదేళ్లుగా 47,725 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఐదు నుంచి పదేళ్లపాటు 63,537 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
మొత్తం పెండింగ్ కేసుల్లో 13.62 శాతం కేసులు.. అంటే 34,413 కేసులు పది నుంచి 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇక 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య 2,987 కేసులు పెండింగ్‌లో ఉండగా, 30 ఏళ్లకు పైబడి 1103 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
వీటిలో కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా 12 వేలకు పైగా ఉండడం గమనార్హం. మోటారు యాక్సిడెంట్ క్లెయిమ్ కేసులు కూడా 20 వేలకు పైగా ఉండడం గమనార్హం.
సీనియర్ సిటిజెన్ల కేసులు 19 వేలకు పైగా, అలాగే మహిళలకు సంబంధించిన కేసులు 13,855 పెండింగ్‌లో ఉన్నాయి.