Women's Reservation Bill: ఈ రోజు 3 గంటలకు లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు
19 September 2023, 14:11 IST
Women's Reservation Bill: ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం లభించనుంది. సెప్టెంబర్ 19, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు.
కొత్త పార్లమెంటు భవనంలోని లోక సభ
Women's Reservation Bill: లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 33% సీట్లను మహిళలకు కేటాయించడానికి ఉద్దేశించిన బిల్లును ఈ రోజు లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
128వ సవరణ
రాజ్యాంగ 128వ సవరణ బిల్లు ఈ మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించినది. ఈ బిల్లు ప్రకారం.. లోక్ సభ, అసెంబ్లీలో మూడోవంతుకు సమానమైన సీట్లను మహిళలకు కేటాయించాలి. అందులో మూడో వంతు సీట్లను ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన మహిళలకు కేటాయించాలి. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, ఢిల్లీ అసెంబ్లీలలో మహిళలకు రిజర్వ్ అయిన సీట్ల రొటేషన్.. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం ప్రారంభమవుతుంది.
కొత్త పార్లమెంటు భవనంలోకి..
కొత్త పార్లమెంటు భవనం లోకి ప్రధాని మోదీ నాయకత్వంలో మంత్రులు, బీజేపీ ఎంపీలు పాదయాత్రగా వెళ్లారు. మోదీ ఇరువైపులా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఉన్నారు. అమిత్ షా పక్కన బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగ ప్రతులను చేత బట్టుకుని కొత్త భవనంలోకి వెళ్లారు. కొత్త భవనంలో తొలి సమావేశం జరుగుతున్న సందర్భంగా ఎంపీలకు, దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త భవనంలో చేపట్టిన కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. కొత్త భవనంలో పాత వైషమ్యాలను మరిచిపోయి కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.