Women's reservation bill : మహిళా రిజర్వేషన్​ బిల్లు అంటే ఏంటి? ఇంతకాలం ఎందుకు ఆమోదం దక్కలేదు?-what is womens reservation bill cleared by the union cabinet ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Women's Reservation Bill : మహిళా రిజర్వేషన్​ బిల్లు అంటే ఏంటి? ఇంతకాలం ఎందుకు ఆమోదం దక్కలేదు?

Women's reservation bill : మహిళా రిజర్వేషన్​ బిల్లు అంటే ఏంటి? ఇంతకాలం ఎందుకు ఆమోదం దక్కలేదు?

Manjiri Chitre HT Telugu
Sep 19, 2023 08:55 AM IST

Women's reservation bill : మహిళా రిజర్వేషన్​ బిల్లు అంటే ఏంటి? దీని చరిత్ర ఏంటి? ఇంతకాలం ఎందుకు ఆమోదం లభించలేదు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మహిళా రిజర్వేషన్​ బిల్లు అంటే ఏంటి?
మహిళా రిజర్వేషన్​ బిల్లు అంటే ఏంటి?

Women's reservation bill : ఇప్పుడు దేశమంతటా.. మహిళా రిజర్వేషన్​ బిల్లుపైనే చర్చ జరుగుతోంది. సోమవారం రాత్రి.. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్​ ఆమోద ముద్రవేసింది. పార్లమెంట్​ ప్రత్యేక సమావేశాల్లో ఇది ఉభయసభల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. అసలేంటి ఈ బిల్లు? దీని చరిత్ర ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మహిళా రిజర్వేషన్​ బిల్లు చరిత్ర..

మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ హయాంలో తొలిసారిగా ఈ మహిళా రిజర్వేషన్​ బిల్లు అంశం తెరపైకి వచ్చింది. 1989లో ఈ విషయంపై రాజ్యాంగాన్ని సవరించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాజీవ్​ గాంధీ. రూరల్​, అర్బన్​ ఎన్నికల వ్యవస్థల్లో మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్​ కల్పించే విధంగా ఈ బిల్లు ఉండాలని పేర్కొన్నారు. ఈ బిల్లు లోక్​సభలో గట్టెక్కినా.. రాజ్యసభలో మాత్రం ఆమోద ముద్రపడలేదు.

1992, 1993లో నాటి పీవీ నర్సింహ రావు ప్రభుత్వం.. 72-73వ రాజ్యాంగ చట్ట సవరణల బిల్లులను పార్లమెంట్​లో తిరిగి ప్రవేశపెట్టింది. అర్బన్​, రూరల్​ లోకల్​ వ్యవస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్​ కల్పించే విధంగా దీనిని అప్పటి ప్రభుత్వం రూపొందించింది. ఉభయసభల్లో ఈ బిల్లు గట్టెక్కి.. చట్టంగా కార్యరూపం దాల్చింది. ఫలితంగా.. ఈరోజున దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, నగరపాలికల్లో 15లక్షల మంది మహిళలు ఉన్నారు.

What is Women's reservation bill : ఇక 1996 సెప్టెంబర్​ 12న.. దేవె గౌడ నేతృత్వంలోని యునైటెడ్​ ఫ్రెంట్​ ప్రభుత్వం.. పార్లమెంట్​లో మహిళా రిజర్వేషన్​కు సంబంధించి తొలిసారి.. 81వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది. కానీ ఇది లోక్​సభలోనే గట్టెక్కలేపోయింది. జాయింట్​ పార్లమెంటరీ కమిటీకి దీనిని సిఫార్సు చేయడం జరిగింది. 1996 డిసెంబర్​లో.. కమిటీ తన నివేదికను బయటపెట్టింది. కానీ లోక్​సభ రద్దు అవ్వడంతో బిల్లును ఎవరు పట్టించుకోలేదు.

రెండేళ్ల తర్వాత.. అటల్​ బిహారీ వాజ్​పేయి ప్రభుత్వం కూడా ఈ మహిళా రిజర్వేషన్​ బిల్లును ప్రస్తావించింది. ఈసారి కూడా బిల్లుకు మద్దతు లభించలేదు. 1999, 2002, 2003లో వాజ్​పేయి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కూడా పార్లమెంట్​లో విఫలమయ్యాయి.

PM Modi Women's reservation bill : ఐదేళ్ల తర్వాత.. మన్మోహన్​ సింగ్​ ప్రభుత్వం ఈ బిల్లును ప్రస్తావించింది. 2008 మే 6న ఈ బిల్లును రాజ్యసభలోకి తీసుకొచ్చింది (తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టే బిల్లులకు కాలపరిమితి ఉండదు). 1996 కిమిటీ చేసిన 7 సిఫార్సులో ఐదింటిని ఈ బిల్లులో చేర్చినట్టు అప్పటి యూపీఏ ప్రభుత్వం వెల్లడించింది. కొన్ని రోజులకే ఈ బిల్లును స్టాండింగ్​ కమిటీకి పంపించారు. 2009 డిసెంబర్​లో స్టాండింగ్​ కమిటీ నివేదిక వచ్చింది. 2010 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర కేబినెట్​.. ఆమోద ముద్రవేసింది. చివరికి.. 2010 మే9న రాజ్యసభలో ఈ బిల్లు గట్టెక్కింది.

ఆ తర్వాతి కాలంలో ఈ బిల్లు లోక్​సభ ముందుకు రానేలేదు! 2014లో లోక్​సభ రద్దు అయ్యింది. మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు లోక్​సభలో ఈ బిల్లును ప్రస్తావించలేదు.

బిల్లు ఇంతకాలం ఎందుకు గట్టెక్కలేదు?

ఈ మహిళా రిజర్వేషన్​ బిల్లుకు మద్దతుపలికే వారితో పాటు వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. విధానాల రూపకల్పనలో మహిళల పాత్ర ఉండాలని, లింగ సమనత్వం సాధించాలంటే ఈ బిల్లును పాస్​ చేయాలని మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో.. ఒక కులానికి ఇచ్చే రిజర్వేషన్లతో ఈ మహిళా రిజర్వేషన్లను పోల్చకూడదని ఇంకొందరు అంటున్నారు. ఈ బిల్లు గట్టెక్కితే.. రాజ్యాంగంలో ఉన్న సమానత్వ భావాలకు గండిపడుతుందని ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్​ వస్తే.. మెరిట్​ ఆధారంగా వచ్చే స్థానాలు పోతాయని అంటున్నారు. రాజ్యసభలో ఉన్న ఎన్నికల ప్రక్రియ కూడా ఈ రిజర్వేషన్​కు సహకరించదని గుర్తుచేస్తున్నారు.

ఇప్పుడు పరిస్థితి ఏంటి?

Parliament special session : ఈ బిల్లు గట్టెక్కితే.. లోక్​సభతో పాటు అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్​ లభిస్తుంది.

ఇప్పటికైతే.. ఆంధ్రప్రదేశ్​, అరుణాచల్​ ప్రదేశ్​, అసోం, గోవా, గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, మణిపూర్​, మేఘాలయ, ఒడిశా, సిక్కిం, తమిళ్​నాడు, తెలంగాణ, త్రిపుర, పుదుచ్చేరి అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిథ్యం 10శాతం కన్నా తక్కువగా ఉంది.

బిహార్​, హరియాణా, పంజాబ్​, రాజస్థాన్​, ఉత్తరాఖండ్​, ఉత్తర్​ ప్రదేశ్​, దిల్లీలో 10-12శాతం మధ్యలో ఉంది. ఛత్తీస్​గఢ్​, పశ్చిమ్​ బెంగాల్​, ఝార్ఖండ్​లో 14.47శాతం, 13.7శాతం, 12.5శాతంగా ఉన్నాయి.

లోక్​సభలోని 543మంది సభ్యుల్లో మహిళ వాటా 15శాతంగా ఉంది. అదే రాజ్యసభ విషయానికొస్తే.. ఇది 14శాతం మాత్రమే ఉంది.

మహిళా రిజర్వేషన్​ బిల్లుకు కేంద్ర కేబినెట్​ ఆమోద ముద్ర వేసింది. ఉభయ సభల్లో ఎన్​డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉండటంతో.. ఈసారి ఈ బిల్లు గట్టెక్కే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం