Women Reservation Bill : కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
Women Reservation Bill : కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Women Reservation Bill : ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. ఇకపై పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.
రేపు సభ ముందుకు బిల్లు!
రేపటి నుంచి కొత్త పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. కొత్త పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశాలు మొదలైన రోజే సభలో మహిళా బిల్లు ప్రవేశపెట్టనున్నారని సమాచారం. సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. సుమారు రెండు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. రేపు కొత్త పార్లమెంట్ భవనంలో మొదలయ్యే సమావేశాల్లో తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న కేంద్రం ప్రభుత్వం... పాత పార్లమెంటు భవనంలో చివరి సమావేశాలను ఇవాళ నిర్వహించింది. ప్రధాని మోదీ లోక్ సభలో మాట్లాడుతూ... రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాత పార్లమెంటు భవనంలో తీసుకున్న చారిత్రక నిర్ణయాలను గుర్తుచేసుకున్నారు.
సుదీర్ఘ పోరాటం
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని సుదీర్ఘమైన పోరాటం జరిగింది. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ ఆధ్వర్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అనంతరం వాజ్‌పేయ్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు మహిళా రిజర్వేషన్ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందింది. అయితే లోక్‌సభలో బిల్లు పెండింగ్ లో ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దుకావడంతో బిల్లు ఆగిపోయింది. తాజాగా ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లో ఎన్డీఏకు మెజార్టీ ఉండడంతో ఇప్పటికైనా ఈ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందే అవకాశం ఉందని విశ్లేషకుల్ అంటున్నారు.