తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  What Is Hamas: ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది? లక్ష్యాలేంటి?

What is Hamas: ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది? లక్ష్యాలేంటి?

HT Telugu Desk HT Telugu

07 October 2023, 20:37 IST

google News
  • What is Hamas: ఇజ్రాయెల్ పై దాదాపు 5 వేల రాకెట్లతో విరుచుకుపడి పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ (Hamas) మరోసారి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. దాంతో, పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకున్నాయి.

హమాస్ రాకెట్ దాడిలో మృతి చెందిన ఇజ్రాయెల్ పౌరులు
హమాస్ రాకెట్ దాడిలో మృతి చెందిన ఇజ్రాయెల్ పౌరులు (REUTERS)

హమాస్ రాకెట్ దాడిలో మృతి చెందిన ఇజ్రాయెల్ పౌరులు

What is Hamas: పాలస్తీనా (Palestine) లోని గాజాలో అధికారంలో ఉన్న హమాస్ (Hamas) గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ (Israel) పై వేలాది రాకెట్ల ను ప్రయోగించి అనూహ్యంగా యుద్ధ ప్రకటన చేసింది. దాంతో, ఇజ్రాయెల్ కూడా యుద్ధ రంగంలోకి దిగింది. హమాస్ సాయుధులు ఇజ్రాయెల్ లోకి ప్రవేశించి పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో, హమాస్ రాకెట్ దాడుల్లో సుమారు 200 మంది వరకు ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మేం యుద్ధంలో ఉన్నాం. మేమే గెలుస్తాం’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ ప్రకటించారు. ఇజ్రాయెల్ దళాలు శత్రువుతో పోరాడుతున్నాయన్నారు.

ఏంటీ హమాస్?

పాలస్తీనా ప్రజల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా, పాలస్తీనా విప్లవ సమయంలో 1987 లో హమాస్ ఏర్పడింది. దీన్నే ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్ మెంట్ (Islamic Resistance Movement) అని కూడా పిలుస్తారు. ఈ సంస్థకు ప్రధానంగా ఇరాన్ షియా ముస్లింల నుంచి, షియా అధికార గణాల నుంచి అన్నిరకాలుగా మద్దతు లభించింది. ఈజిప్ట్ లో ఏర్పడిన అతివాద సంస్థ ‘ముస్లిం బ్రదర్ హుడ్’ (Muslim Brotherhood) కూడా హమాస్ ను గట్టిగా సపోర్ట్ చేసింది. ఇస్లామిక్ సంప్రదాయాల పరిరక్షణ కోసం ‘ముస్లిం బ్రదర్ హుడ్’ సంస్థ ఈజిప్ట్ లో 1920 ప్రాంతంలో ఏర్పడింది. తొలి నుంచీ హమాస్ సంస్థ ఇజ్రాయెల్ కు ప్రబల శత్రువుగానే ఉంది.

2007 నుంచి..

పాలస్తీనాలో హమాస్ కు అన్ని వర్గాల నుంచి ప్రబలమైన మద్దతు లభిస్తోంది. గాజా స్ట్రిప్ లో 2007 నుంచి హమాస్ సంస్థనే అధికారంలో ఉంది. ఫతా వర్గంతో పోరులో విజయం సాధించిన అనంతరం గాజా స్ట్రిప్ పై హమాస్ పట్టు సాధించింది. ఫతా వర్గానికి అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ నాయకత్వం వహించేవాడు. వెస్ట్ బ్యాంక్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే మొహమ్మద్ అబ్బాస్ ఫతా వర్గానికే కాకుండా, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (Palestine Liberation Organization PLO) కు కూడా నేతృత్వం వహించేవాడు. 2006 లో పాలస్తీనా పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం గాజాపై హమాస్ పట్టు మరింత పెరిగింది.

ఇజ్రాయెల్ పై వ్యతిరేకత

తొలి నుంచీ హమాస్ సంస్థ ఇజ్రాయెల్ కు ప్రబల శత్రువుగానే ఉంది. నిజానికి భౌగోళికంగా ఇజ్రాయెల్ ఉనికినే హమాస్ గుర్తించదు. ఇజ్రాయెల్ కు, పీఎల్ఓ (PLO) కు మధ్య 1990 లలో కుదిరిన ఒస్లో శాంతి ఒప్పందాన్ని (Oslo peace agreement) కూడా హమాస్ అంగీకరించదు. హమాస్ లోని సాయుధ విభాగం పేరు ఇజ్ ఎల్ దీన్ అల్ ఖాసం బ్రిగేడ్స్ (Izz el-Deen al-Qassam Brigades). ఇజ్రాయెల్ పై దాడులకు ఈ సంస్థనే ప్రణాళికలు రచిస్తుంది. అమలుచేస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ పై రాకెట్ దాడులకు పాల్పడడమే కాకుండా, ఇజ్రాయెల్ లోకి సాయుధ దళాలను, ఆత్మాహుతి దళాలను పంపించదనే ఆరోపణలను ఈ సాయుధ సంస్థ ఎదుర్కొంటోంది. హమాస్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా, ఇజ్రాయెల్, కెనడా, యూరోపియన్ యూనియన్, ఈజిప్ట్, జపాన్ తదితర దేశాలు గుర్తించాయి. గాజా లోనే కాకుండా హమాస్ సంస్థకు పాలస్తీనా వ్యాప్తంగా గట్టి పట్టు ఉంది. అంతేకాదు, ఈ సంస్థ కు ఖతార్ సహా మధ్య ప్రాచ్య దేశాలు మద్ధతిస్తున్నాయి.

తదుపరి వ్యాసం