తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bomb Threat To Flight : విమానానికి బాంబు బెదిరింపు వస్తే నెక్ట్స్​ ఏం జరుగుతుంది? ప్రోటోకాల్​ ఏంటి?

Bomb threat to flight : విమానానికి బాంబు బెదిరింపు వస్తే నెక్ట్స్​ ఏం జరుగుతుంది? ప్రోటోకాల్​ ఏంటి?

Sharath Chitturi HT Telugu

21 October 2024, 13:05 IST

google News
    • Bomb threat today : భారత విమానాలకు ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే బాంబు బెదిరింపులు వస్తే నెక్ట్స్​ ఏం జరుగుతుంది? అధికారులు ఏం చేస్తారు? అసలు ప్రోటోకాల్స్​ ఏం చెబుతున్నాయి? ఇక్కడ తెలుసుకోండి..
విమానానికి బాంబు బెదిరింపు వస్తే .. ప్రోటోకాల్​ ఏంటి?
విమానానికి బాంబు బెదిరింపు వస్తే .. ప్రోటోకాల్​ ఏంటి?

విమానానికి బాంబు బెదిరింపు వస్తే .. ప్రోటోకాల్​ ఏంటి?

గత వారం రోజులుగా డజన్ల కొద్దీ విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇవి విమానయాన సంస్థలను కుదిపేస్తున్నాయి. బాంబు బెదిరింపులన్నీ బూటకమని తేలడంతో అందరు ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ ప్రయాణికులకు, సిబ్బందికి తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. అదే సమయంలో దేశంలో విమానయాన భద్రతా ప్రోటోకాల్స్ గురించి పెద్ద ఆందోళన లేవనెత్తాయి.

బాంబు బెదిరింపుల వెల్లువకు విమానయాన సంస్థల నుంచి వేగంగా ప్రతిస్పందన వచ్చింది. వాటి యాంటి టెర్రరిస్ట్​ ప్రోటోకాల్స్​ వెంటనే ట్రిగ్గర్​ అయ్యి, బెదిరింపులకు సంబంధించి మరింత సహాయం, దర్యాప్తు కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఓసీఏ)ను సంప్రదించేలా చేశాయి.

"99.99 శాతం బెదిరింపులు ఫేక్ అని తేలింది. కానీ మిగిలిన 0.01 శాతం కేసులతో కూడా ఎవరూ ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకే భారత విమానాశ్రయాల్లో కఠినమైన ముందస్తు భద్రతా తనిఖీలు ఉన్నప్పటికీ, బాంబు బెదిరింపులను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాము. చాలావరకు బెదిరింపులు ఫేక్​గా మారతాయని మాకు బాగా తెలుసు," అని ఎంఓసీఏ అధికారి ఒకరు చెప్పారు.

ఇదీ చూడండి:- Cyclone Dana : దానా తుపాను నుంచి ఏపీ సేఫ్​? ఆ రెండు రాష్ట్రాలపై మాత్రం భారీ ఎఫెక్ట్​..!

విమానానికి బాంబు బెదిరింపు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది?

మిడ్ ఎయిర్ ఫ్లైట్​కు బాంబు బెదిరింపు వస్తే వెంటనే ఎయిర్ పోర్టులో బాంబ్ థ్రెట్ అసెస్​మెంట్ కమిటీ (బీటీఏసీ) సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ బాంబు బెదిరింపు తీవ్రతను, అది వచ్చిన సోర్స్​ని అంచనా వేసిన తర్వాత తదుపరి కార్యాచరణను బీటీఏసీ నిర్ణయిస్తుంది.

నిజంగానే ముప్పు ఉందని పరిగణిస్తే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) ని సంప్రదించిన తర్వాత పైలట్లు తమ తదుపరి చర్యని ప్లాన్​ చేయమని అడుగుతారు. విమానం ఉన్న ప్రదేశాన్ని బట్టి పైలట్లు డిపార్చర్ ఎయిర్​పోర్టుకు తిరిగి వెళ్లాలని లేదా గమ్యస్థానానికి వెళ్లాలని లేదా విమానాన్ని సమీపంలోని విమానాశ్రయానికి మళ్లించాలని సూచిస్తారు.

ఇంకా టేకాఫ్ తీసుకోని విమానానికి ముప్పు వస్తే బీటీఏసీని సంప్రదించిన తర్వాత సమగ్ర భద్రతా తనిఖీల కోసం దాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తరలిస్తారు.

ఒకవేళ భారత గగనతలం నుంచి బయటకు వెళ్లిపోయిన అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు వస్తే, భారత ఏజెన్సీలు అంతర్జాతీయ ఏటీసీ, భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తారు. ఇలాంటి సందర్భాల్లో విమానాన్ని సమీపంలోని విమానాశ్రయానికి మళ్లిస్తారు.

ఇదిలావుండగా, వరుస బాంబు బెదిరింపుల సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం, ఎంఓసీఏ చురుకుగా పనిచేస్తున్నాయి.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అసంగ్బా చుబా ఆవో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. “ఇది (నకిలీ బాంబు బెదిరింపులు) ఏవియేషన్ రెగ్యులేటర్ చాలా తీవ్రంగా పరిశీలిస్తున్న విషయం. బలమైన పరిష్కారాలను కనుగొనే దిశగా వారు కృషి చేస్తున్నారు,” అని స్పష్టం చేశారు.

వాస్తవానికి విమానాలకు బాంబు బెదిరింపుల తలనొప్పిగా మారాయి. వీటికి ఒక పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. దీనిపై అధికారులు, వ్యవస్థ మొత్తం దృష్టిసారించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

తదుపరి వ్యాసం