20th bomb threat: మూడు రోజుల్లో 20 విమానాలకు బాంబు బెదిరింపులు; లేటెస్ట్ గా విస్తారా ఫ్లైట్ కు..
Bomb threat to flights: దేశీయ, అంతర్జాతీయ విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. లేటెస్ట్ గా, ఫ్రాంక్ ఫర్ట్ - ముంబై విస్తారా విమానానికి కూడా బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది. దాంతో, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Bomb threat to flights: గత మూడు రోజుల్లో 20 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి. తాజాగా, ఫ్రాంక్ ఫర్ట్ నుంచి ముంబై వస్తున్న విస్తారా విమానానికి కూడా బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. దాంతో, ఆ విమానాన్ని గురువారం తెల్లవారుజామున ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అంతకుముందు, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో సాధారణ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
సాధారణ అత్యవసర పరిస్థితి
భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6 గంటలకు సాధారణ అత్యవసర పరిస్థితిని సూచించే కోడ్ 7700ను ప్రకటించినప్పుడు ఫ్రాంక్ ఫర్ట్ నుంచి ముంబై వస్తున్న యూకే 28 అనే విస్తారా ఎయిర్ లైన్స్ విమానం పాకిస్తాన్ గగనతలంపై ఉంది. ఇది ఉదయం 7:40 గంటలకు ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
20 బాంబు బెదిరింపులు
ఇప్పటివరకు 20 విమానాలకు బాంబు బెదిరింపు మెసేజ్ లు వచ్చాయి. వాటిలో దేశీయ, అంతర్జాతీయ గమ్య స్థానాలున్న విమానాలు ఉన్నాయి. వీటిలో మూడు విమానాల్లో నకిలీ బాంబు బెదిరింపు సందేశాలకు సంబంధించి చత్తీస్ గఢ్ కు చెందిన ఒక మైనర్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇతర విమానాల్లో బాంబు ఉందని సందేశాలు పంపిన వారి గురించి దర్యాప్తు కొనసాగుతోంది. సోమవారం భారత విమానయాన సంస్థలకు చెందిన మూడు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు, మంగళవారం పది బెదిరింపులు వచ్చాయి. బుధవారం మరో ఆరు బెదిరింపులు నమోదయ్యాయి.
అన్ని ఎక్స్ నుంచే..
ఈ బెదిరింపులన్నీ సోషల్ మీడియా (social media) ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా వచ్చాయి. ఆ తరువాత అవి అన్నీ అబద్ధమని తేలాయి. యూకే 028 విమానానికి సోషల్ మీడియా ద్వారా భద్రతా ముప్పు సందేశం వచ్చిందని విస్తారా ప్రతినిధి ధృవీకరించారు. ప్రోటోకాల్ ను అనుసరించి, సంబంధిత అధికారులందరికీ వెంటనే సమాచారం అందించారు. విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం, ప్రయాణికులందరినీ ఐసోలేషన్ బేకు తరలించారు.
ముంబై టు మస్కట్ విమానానికి కూడా..
అక్టోబర్ 14న ముంబై నుంచి మస్కట్ వెళ్తున్న ఇండిగో విమానానికి టేకాఫ్ కు కొన్ని నిమిషాల ముందు బాంబు బెదిరింపు వచ్చింది. విమానాన్ని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి భద్రతా తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తాజా విధ్వంసకర పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విమానయాన రంగం యొక్క భద్రత, కార్యాచరణ సమగ్రతకు అవి కలిగించే ముప్పును ఎత్తిచూపుతూ ఈ "దుర్మార్గమైన మరియు చట్టవిరుద్ధమైన" చర్యలను ఆయన ఖండించారు.