తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  బడ్జెట్ ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోగానే ఉండబోతుందా? తెలంగాణ ఏం కోరుతోంది?

బడ్జెట్ ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోగానే ఉండబోతుందా? తెలంగాణ ఏం కోరుతోంది?

Manda Vikas HT Telugu

31 January 2022, 14:39 IST

google News
    • కేంద్ర బడ్జెట్ 2022-23లో తెలంగాణ రాష్ట్రానికి దక్కే వాటా ఎంత? కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంది
    • రెవెన్యూ ఇచ్చే రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేది తెలంగాణ ప్రభుత్వ వర్గాల వాదన 
Finance minister Nirmala Sitharaman will present the Union Budget on Tuesday, 1 February.getty images
Finance minister Nirmala Sitharaman will present the Union Budget on Tuesday, 1 February.getty images (MINT_PRINT)

Finance minister Nirmala Sitharaman will present the Union Budget on Tuesday, 1 February.getty images

Hyderabad, January 31| కేంద్ర బడ్జెట్ 2022-23లో తెలంగాణ రాష్ట్రానికి దక్కే వాటా ఎంత? కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఒక వైపు హామీలు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని పట్టుదల చూపడంతో పాటు, మరోవైపు ఈ బడ్జెట్ పైనా తమకు ఎలాంటి ఆశలు లేవనే నైరాశ్యాన్ని కనబరుస్తుంది.

 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీసారి యూనియన్ బడ్జెట్‌ను కేవలం ఎన్నికల కోసం ఉపయోగించుటూ వస్తోందని తెరాస ఆరోపిస్తుంది. త్వరలో ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి తన ఎన్నికల మేనిఫెస్టోగా ఈ బడ్జెట్‌ను కూడా ఉపయోగిస్తుంది. కేటాయింపులన్నీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే ఉంటాయని టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ.

ఈసారైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, హామీల పరిష్కారం కోసం నిధులు, ఇతర కేటాయింపులు చేసేలా గళం గట్టిగా వినిపించాలని తెరాస పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం ఏయే అంశాలను ప్రస్తావించాలో జాబితాను సిద్ధం చేసుకుంది.

తెలంగాణ రాష్ట్ర డిమాండ్లు ఇలా ఉన్నాయి

  • యూనియన్ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి రూ.20 వేల కోట్లు కేటాయించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి.
  • హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పనకు రూ. 7800 కోట్లు ప్రత్యేకంగా కేటాయించాలి.
  • మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రైల్వే నెట్వర్క్ చాలా తక్కువ. కాబట్టి పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలి, కొత్త రైల్వే లైన్లను వేయాలి. ఇందులో మనోహరాబాద్- కొత్తపల్లి మధ్య లైన్, మెదక్- అక్కన్నపేట, భద్రాచలం- సత్తుపల్లితో పాటు ఆర్మూర్- నిర్మల్- ఆదిలాబాద్ మధ్య బ్రాడ్ గేజ్ లైన్, సికింద్రాబాద్- జహీరాబాద్ మధ్య డబుల్ లేన్, కరీంనగర్- కాజీపేట వయా హుజూరాబాద్ రైల్వే లైన్లు వేయాలి. హైదారాబాద్- ముంబై మధ్య బుల్లెట్ రైల్ కోసం సర్వే పూర్తైంది, నిధులు కేటాయించాలి.
  • రాష్ట్రానికి కొత్తగా 23 నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలి. కరీంనగర్ జిల్లాలో ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్, ఐఐఎం లాంటి కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేయాలనే డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి.
  • రాష్ట్రంలో అవసరమైన చోట రహదారులు విస్తరించాలి. హైదరాబాద్- నాగ్ పూర్, వరంగల్- హైదరాబాద్ పారిశ్రామిక వాడలు, రహదారుల కోసం రూ. 4 వేల కోట్లు కేటాయించాలి.
  • ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పోరేషన్ పరిశ్రమను తిరిగి పునరుద్ధరించాలి. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కు కోసం రూ. వెయ్యి కోట్ల గ్రాంట్ ఎయిడ్ ఇన్ ఇవ్వాలి, హైదరాబాదులో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటు చేయాలి, ఫార్మా సిటీ కోసం నిధులు, జహీరాబాద్ నిమ్స్ కోసం నిధులు కావాలి.
  • బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు రామప్ప అభివృద్ధి, మిషన్ భగీరథకు ఆర్థిక సహాయం ప్రకటించాలి.

వీటితో పాటు మరికొన్నిడిమాండ్లు, విభజన హామీలు తెలంగాణ కోరుకుంటోంది. రెవెన్యూ ఇచ్చే రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 2022లో తెలంగాణ రాష్ట్రానికి ఏం దక్కుతుందో చూడాలి. తెలంగాణ బీజేపీ నుంచి తెలంగాణ తరఫున నలుగురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో కిషన్ రెడ్డి కేబినేట్ మంత్రిగా కూడా ఉన్నారు.

ఎన్నికల బడ్జెటే.. గత ట్రెండ్ ఇలా ఉన్నాయి: విపక్షాలు

బడ్జెట్ గత ట్రెండ్స్ పరిశీలిస్తే ఎన్నికల కోసమే బడ్జెట్ అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విపక్షాలు గణాంకాలతో సహా వివరిస్తున్నాయి.

2015 నుండి కేంద్ర బడ్జెట్‌లను గమనిస్తే, తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రాల నుంచి అత్యధిక పన్ను వసూళ్లు తీసుకుంటూ ఆయా రాష్ట్రాల డిమాండ్‌లను నెరవేర్చడంలో విఫలమైంది. ఈ ఏడాదిలో బిహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2015 యూనియన్ బడ్జెట్‌లో బీహార్‌కు AIIMSతో పాటు ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించారు.

2016 యూనియన్ బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడులకు రూ. 25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల బొనాంజా ప్రకటన చేశారు. ఇందులో ఆయా రాష్ట్రాలకు రోడ్డు ప్రాజెక్టులు, కేరళ మెట్రో రైల్వే ఫేజ్‌ 2కి నిధులు, మదురై-కొల్లాం ఆర్థిక కారిడార్ మొదలగునవి ఉన్నాయి. 2016లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.

2017లో గుజరాత్ రాష్ట్రంతో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాదికి గుజరాత్‌కు AIIMS, బుల్లెట్ రైలు మొదలగు ప్రయోజనాలు ఇచ్చారు.

2018 యూనియన్ బడ్జెట్‌లో కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బెంగళూరు మెట్రో కోసం రూ. 17,000 కోట్లు కేటాయించారు 2019లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దిల్లీ మెట్రో కోసం మధ్యంతర బడ్జెట్‌ కేటాయించారు.

గతేడాది 2021 కేంద్ర బడ్జెట్‌లో జాతీయ రహదారుల కోసం పశ్చిమ బెంగాల్‌కు రూ. 25 వేల కోట్లు అలాగే తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్‌లో ఎన్ని కేటాయింపులు చేసినా ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలవనేలేదు.

అయినా బీజేపీ పాఠాలు నేర్చుకోలేదు, కనీసం ఈ బడ్జెట్‌లోనైనా మార్పు చూపించాలని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

తదుపరి వ్యాసం