Budget 2022 | ఓట్ల పద్దులపై మధ్య తరగతి ఆశలు
31 January 2022, 11:13 IST
- బడ్జెట్ 2022 పై మధ్య తరగతి జీవులు, ముఖ్యంగా వేతన జీవులు గంపెడు ఆశలతో ఉన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా బడ్జెట్ 2022 ఉండబోతుందన్న నమ్మకం ఏర్పడింది. అటు మదుపరులు కూడా బడ్జెట్‌పై ఆశాజనకంగా ఉండడంతో సోమవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాక కొద్ది సేపటికే సెన్సెక్స్ 800 పాయింట్లకు ఎగిసింది.
పార్లమెంటు భవనం
Budget 2022 | బడ్జెట్ వస్తుందనగానే వివిధ వర్గాల ప్రజలు తమ తమ అవసరాలకు అనుగుణంగా లేదా తమ తమ వృత్తులకు అనుగుణంగా ఆయా రంగాల్లో ధరలు తగ్గాలని, అంతిమంగా తమ జేబుపై భారం తగ్గాలని చూస్తారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున ఈసారి కేంద్ర బడ్జెట్‌లో జనాకర్షక పథకాలు, రాయితీలు, పన్ను మినహాయింపులు ఉండొచ్చని భావిస్తున్నారు.
వేతన జీవులు ఇలా:
వేతన జీవులు ఈసారైనా ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపులు పెరుగుతాయా? అని ఆశగా ఉన్నారు. 2014 నుంచి ఇన్‌కమ్ టాక్స్ శ్లాబుల్లో మార్పులు లేకపోవడంతో బేసిక్ ఎగ్జెంప్షన్ కనీసం రూ. 5 లక్షలకైనా పెరగాలని, రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య శ్లాబు 10 శాతంగా ఉండాలని ఆశిస్తున్నారు. ఇక ఎన్డీయే ప్రభుత్వం గతంలో 2021 నాటికి అందరికీ ఇల్లు అనే నినాదాన్ని పదేపదే ప్రస్తావించింది. కానీ ఈ నినాదం ఆశించిన రీతిలో సఫలం కాలేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ధరల పెరుగుదల, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో విపరీతమైన పెరుగుదల, అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులు లేకపోవడంతో మధ్య తరగతి జీవులకు ఇళ్ల కొనుగోలు సాధ్యపడడం లేదు. ఈసారైనా అఫర్డబుల్ హౌజింగ్‌కు, గృహ నిర్మాణ రంగానికి సంబంధించి ప్రోత్సాహకాలేమైనా ఉంటాయా? క్షేత్రస్థాయి వాస్తవాలు ఈ ప్రోత్సాహకాల్లో ప్రతిబింబిస్తాయా? అని ఎదురు చూస్తున్నారు.
రైతన్నల ఆశలు..
రైతు ఆదాయం రెట్టింపు చేస్తాం అంటూ ఎన్డీయే ప్రభుత్వం అనేక సందర్భాల్లో రైతులకు భరోసా ఇచ్చింది. కానీ గత ఏడాది డీజిల్ ధరల విపరీతమైన పెరుగుదల, కూలీల కొరత, యాంత్రీకరణ లభ్యత లేకపోవడం వంటి కారణాల వల్ల ఆదాయంలో పెరుగుదల లేకుండా పోయింది. డీజిల్ ధరల భారం తగ్గేలా దీనిపై పన్నులను ఉపసంహరించుకుంటారన్న ఆశ రైతుల్లో నెలకొంది. అలాగే మార్కెటింగ్ సదుపాయాల కల్పనలేమి రైతులను అనిశ్చిత పరిస్థితుల్లోకి నెట్టివేసింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సమస్యగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు రబీ సీజన్ నుంచి ఉండవని చెప్పడంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
అల్పాదాయ వర్గాలు ఏమంటున్నాయి?
ఎన్నికల తరుణంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ, తరచూ పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కారణంగా నిత్యవసర వస్తువుల ధరలపై, రవాణా ఖర్చుపై భారం పడుతోందని వాపోతున్నారు. వంట నూనెల ధరలు రెట్టింపవడం భారంగా మారింది. కోవిడ్ నేపథ్యంలో ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నాన్ టెక్నికల్, నాన్ స్కిల్డ్ ఉద్యోగస్తులు చాలా వరకు ఉద్యోగాలు కోల్పోయారు. ముఖ్యంగా ఆటోమేషన్ పెరుగుతున్న కొద్దీ చిన్న ఉద్యోగాలపై దెబ్బపడుతోంది. తమ ఆదాయం పెరిగేందుకు, ఉపాధి దొరికేందుకు కేంద్రం బడ్జెట్ ద్వారా ఉపశమన చర్యలు ఏమైనా ప్రకటిస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.
కార్పొరేట్ రంగం ఏం కోరుకుంటోంది?
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో దెబ్బతిన్న వాణిజ్య రంగం తిరిగి పుంజుకునేలా తగిన చర్యలు చేపట్టాలని కార్పొరేట్ రంగం కోరుకుంటోంది. ఇండియాలో బ్రాంచ్‌లు ఉన్న విదేశీ కంపెనీలపై కార్పొరేట్ టాక్స్ 40 శాతంగా ఉంది. దీనిని తగ్గించాలని ఆ రంగం కోరుకుంటోంది. దేశీయ కంపెనీలపై ఉన్న కార్పొరేట్ టాక్స్ గత ఏడాది 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. ఇప్పుడు విదేశీ కంపెనీలపై కూడా కొంతమేర తగ్గుతుందని ఆశిస్తున్నారు. తయారీ రంగంలోని దేశీయ కంపెనీలు మార్చి 31, 2023లోగా ఉత్పత్తి ప్రారంభిస్తే కార్పొరేట్ పన్ను 15 శాతం మాత్రమే ఉంటుంది. ఈ రాయితీ పొందేందుకు గడువు మరింత పొడిగిస్తే బాగుంటుందని ఈ రంగం ఆశిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం కూడా స్టార్టప్‌లకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలని ఆశిస్తున్నాయి.