Covid test for fish : అక్కడ చేపలకు కూడా కొవిడ్ టెస్టింగ్.. ‘పిచ్చి పట్టిందా?’
19 August 2022, 16:51 IST
- Covid test for fish : మనుషులు కొవిడ్ టెస్ట్ చేసుకోవడం సహజం. మరి చేపలు, పీతలకు కూడా కొవిడ్ టెస్టులు నిర్వహిస్తే? చైనాలో ఇప్పుడు పరిస్థితి ఇదే!
అక్కడ చేపలకు కూడా 'కొవిడ్ టెస్టింగ్'.. ఎందుకంటే!
Covid test for fish : కొవిడ్ కట్టడి పేరుతో రకరకాల ఆంక్షలతో ప్రజలను భయపెట్టిన చైనా.. ఇప్పుడు ఒకడుగు ముందుకేసింది. కొవిడ్ నేపథ్యంలో.. ఇప్పటివరకు మనుషులకు మాత్రమే కొవిడ్ టెస్టులు నిర్వహించగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి చేపలు, పీతలను కూడా యాడ్ చేసింది!
చేపలు, పీతలకు ఎందుకు?
చైనాలో ఈ ఏడాది తొలినాళ్ల నుంచి కొవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొవిడ్ కేసులు పెరగడం.. కఠిన చర్యలతో వ్యాప్తిని తగ్గించడం సాధారణ విషయమైపోయింది. కాగా.. ఇటీవలి కాలంలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షియామెన్ ప్రాంతంలో మనుషులతో పాటు చేపలు, పీతలకు కూడా కొవిడ్ టెస్టులు చేస్తున్నారు.
China Covid cases : ఇందుకు సంబంధించిన వీడియోను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్.. తన ట్విట్టర్లో షేర్ చేసింది. వీడియో ప్రకారం.. కొందరు హెల్త్ వర్కర్లు.. పీపీటీ కిట్లు ధరించి ఉన్నారు. చేపలను చేతిలో పట్టుకుని, వాటికి కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అనంతరం పీతలను సైతం టెస్ట్ చేస్తున్నారు.
ఈ వీడియో.. చైనావ్యాప్తంగా వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియోకు ఇప్పటికే 2లక్షలకుపైగా వ్యూస్ లభించాయి.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:
ఈ వ్యవహారంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు.. 'ఏంటిది?' అని ప్రశ్నిస్తుంటే.. మరికొందరు 'తప్పేముంది?' అని అంటున్నారు.
"జంతువుల నుంచే కదా కొవిడ్ మనుషులకు సోకింది? మరి జంతువులను కూడా టెస్ట్ చేయాలి," అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. 'మీరు పిచ్చొళ్లుగా మారిపోయారు,' అని ఇంకో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
'ముందు వూహాన్ మార్కెట్లోని జంతువులను కొవిడ్ టెస్ట్ చేయాలి,' అని ఇంకో నెటిజన్ ట్వీట్ చేశారు.
కొవిడ్ పుట్టుక ఎలా జరిగింది?
Covid origin : 2019 చివర్లో.. చైనాలో కొవిడ్ ఉద్భవించింది. అనంతరం.. కొన్ని నెలల వ్యవధిలోనే అది ప్రపంచాన్ని చుట్టేసింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది కొవిడ్ బారిన పడ్డారు. కొవిడ్ కట్టడి కోసం ప్రపంచ దేశాలు విధించిన లాక్డౌన్ అస్త్రం కారణంగా అనేకమంది జీవనోపాధి కోల్పోయారు.
కాగా.. చైనాలోని వూహాన్‌కు చెందిన ఓ సీ ఫుడ్ మార్కెట్ నుంచి కొవిడ్ వ్యాపించిందని అప్పట్లో వార్తలు జోరుగా సాగాయి. అదే కాకుండా.. వూహాన్‌లోనే, మార్కెట్‌కు పక్కన ఓ ల్యాబ్ ఉంది. అందులో నుంచి వైరస్ బయటకొచ్చిందని ఊహాగానాలు వెలువడ్డాయి. ఇలా కొవిడ్ పుట్టుకపై ఎన్నో కథలు, నివేదికలు బయటకొచ్చాయి.
కానీ.. కొవిడ్ పుట్టుకపై ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఎలాంటి నిర్ధరణకు రాలేదు.