Electricity Bill : ఈ ఇంట్లో ఉన్నది ఇద్దరే.. కానీ జూన్ నెలలో వచ్చిన కరెంట్ బిల్లు మాత్రం 52 లక్షలు
03 July 2024, 12:49 IST
- Electricity Bill : కరెంట్ బిల్లుల విషయంలో ఒక్కోసారి గందరగోళం నెలకుంటుంది. అసలు విద్యుత్ వాడకపోయినా లక్షల బిల్లు వచ్చేస్తుంది. అలానే ఒక వ్యక్తికి నెలకు ఏకంగా 52 లక్షల బిల్లు వచ్చింది.
52 లక్షల విద్యుత్ బిల్లు
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ వ్యక్తి ఇంటికి కరెంట్ ఆగిపోయింది. దీనికి కారణం ఏంటని ఆరా తీస్తే కరెంట్ బిల్లు కట్టలేదని సమాధానం వచ్చింది. ఆ బిల్లు ఎంత అని చూస్తే నెలకు 52 లక్షలు. కరెంటు బిల్లు చూసి ఆ ఇంటి యజమాని షాక్ అయ్యాడు.
హరిశంకర్ అనే వ్యక్తి పదవీ విరమణ చేసి ఇంట్లో ఉంటున్నాడు. అయితే ఇటీవల అతడి ఇంటికి విద్యుత్ కనెక్షన్ నిలిచిపోయింది. పని నిమిత్తం వేరే ఊరిలో ఉన్న తన కుమారుడికి ఈ విషయాన్ని చెప్పగా.. బిల్లు కట్టకపోవడంతో ఇంటికి కరెంటు కనెక్షన్ పోయిందని చెప్పాడు. ఈ నెలలో ఎంత వచ్చిందో చూసి ఆన్‌లైన్‌లో బిల్లు కట్టమని కొడుకు చెప్పిన మొత్తం విని షాక్ అయ్యాడు. అతని ఇంటికి నెలకు 52 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది.
ఇద్దరు వ్యక్తులు ఉన్న ఇంట్లో ప్రతి నెలా కరెంట్ బిల్లు 1 వేల లోపే వచ్చేది. ఇంత భారీ మొత్తం ఎలా వచ్చిందని ముజఫర్‌పూర్‌కు చెందిన హరిశంకర్ మనియారి వాపోయాడు. 500 ఇప్పటికే చెల్లించాల్సి ఉంది. కరెంటు బిల్లు కట్టినా కరెంటు కనెక్షన్ తిరిగి ఇవ్వలేదని హరిశంకర్ తన కుమారుడికి చెప్పాడు. ఆన్‌లైన్‌లో కరెంటు బిల్లు చెక్ చేసుకోగా జూన్ నెల కరెంటు బిల్లు రూ.52,43,327 వచ్చింది.
ఈ విషయంపై హరిశంకర్ వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించారు. ఫిర్యాదు కూడా చేశారు. జూన్ 27న ఇంటికి కరెంటు నిలిపివేశారు. విద్యుత్ బిల్లు కట్టలేదేమోనని కుమారుడు తెలియజేయడంతో హరిశంకర్ రూ.500 బిల్లు పే చేశాడు. కానీ కరెంటు రాకపోవడంతో బిల్లు డౌన్‌లోడ్ చేసుకుని చూశాడు. 52 లక్షలకు పైగా చూపించగా షాక్ అయ్యాడు.
'నేను ఎల్లప్పుడూ నా బిల్లులను సమయానికి చెల్లిస్తాను. అయితే ఈసారి తప్పుడు కరెంట్ బిల్లు ఇవ్వడమే కాకుండా కరెంట్ కనెక్షన్ కూడా తొలగించారు. మా ఇంట్లో నా భార్య అనారోగ్యంతో ఉంది, కరెంటు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. విద్యుత్ శాఖ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది.' అని హరిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ముజఫర్‌పూర్ విద్యుత్ శాఖ స్పందిస్తూ.. పాత అనలాగ్ మీటర్ల నుంచి కొత్త స్మార్ట్ మీటర్లకు రీడింగ్‌ను మార్చడం వల్లే ఈ లోపం సంభవించి ఉండొచ్చని వివరించింది.
'ముజఫర్‌పూర్‌లో స్మార్ట్ మీటర్లు అమర్చుతున్నారు. రీడింగ్‌లను బదిలీ చేసేటప్పుడు ఈ వ్యత్యాసం సంభవించి ఉండవచ్చు.' అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. హరిశంకర్‌కు జారీ చేసిన తప్పుడు బిల్లును సరిచేసి ఇంటికి కరెంటు పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు.
టాపిక్