Crime news: ప్రియుడితో అలా ఉండగా చూశారని.. ఇద్దరు చెల్లెళ్లను దారుణంగా చంపిన యువతి!
10 October 2023, 14:58 IST
UP Crime news : ప్రియుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూశారన్న కారణంతో.. ఇద్దరు చెల్లెళ్లను చంపేసింది ఓ యువతి! మృతుల వయస్సు 7, 4. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఇద్దరు చెల్లిల్లను దారుణంగా చంపిన యువతి!
UP Crime news : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 20ఏళ్ల యువతి.. తన ఇద్దరు మైనర్ చెల్లెళ్లను దారుణంగా చంపేసింది! ప్రియుడితో సన్నిహితంగా ఉన్నప్పుడు వారిద్దరు చూశారని.. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.
ఇదీ జరిగింది..
ఉత్తర్ ప్రదేశ్ బల్రాయ్ ప్రాంతంలో ఆదివారం జరిగింది ఈ ఘటన. స్థానికంగా నివాసముంటున్న ఓ కుటుంబంలో ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు. వీరి పేర్లు అంజలి (20), సురభి (7) రోష్ని (4). కాగా.. అంజలికి ఓ బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడు.
ఆదివారం.. కుటుంబంలోని పెద్దలు బయటకు వెళ్లారు. అదే సమయంలో అంజలి ఇంటికి ఆమె ప్రియుడు వచ్చాడు. ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో.. మిగిలిన ఇద్దరు చెల్లిల్లు వారిని చూశారు. అంజలికి భయం మొదలైంది! వారిద్దరు ఇంట్లో చెప్పేస్తారేమో అని ఆందోళనకు గురైంది. ఈ క్రమంలోనే వారిద్దరిని అక్కడిక్కడే చంపాలని నిర్ణయించుకుంది.
ఇంట్లోని ఓ పదునైన ఆయుధాన్ని తీసుకున్న అంజలి.. ఇద్దరు చెల్లిల్లపై దాడి చేసింది. చిన్న పిల్లలు, తోబుట్టువులు.. అన్న కనికరం కూడా లేకుండా.. వారిని చంపేసింది!
ఆధారాలను దాచిపెట్టి..!
చెల్లిల్లను చంపేసిన తర్వాత.. ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించింది అంజలి. వారిని చంపిన ఆయుధాన్ని పడేసింది. తన బట్టలకు అంటుకున్న రక్తాన్ని కడిగేసింది.
కొంత సేపటి తర్వాత.. సంబంధిత ఇంట్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్న విషయం స్థానికులకు తెలిసింది. ఏదో ప్రమాదంలో వారి మరణించి ఉంటారని భావించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు కావని, ఎవరో కావాలనే చంపేశారని పోలీసులు గ్రహించారు. ఈ క్రమంలోనే.. కుటుంబసభ్యులను అనుమానించడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరిని విచారిస్తుండగా.. అసలు విషయం బయటపడింది.
తన ప్రియుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూసినందుకు.. ఇద్దరు చెల్లిల్లను చంపేసినట్టు అంగీకరించింది అంజలి. ఈ నేపథ్యంలో అంజలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు.
మరి ఈ హత్యల్లో అంజలి ప్రియుడి పాత్ర ఉందా? లేదా? అన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు.