Uddhav Thackeray: “మెదీకి అప్పుడు చెమటలు పట్టాయి”: ఉద్ధవ్ ఠాక్రే
19 February 2023, 23:28 IST
- Uddhav Thackeray: శివసేన పార్టీ పేరు, గుర్తును కోల్పోయిన రెండు రోజుల తర్వాత మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు.
Uddhav Thackeray: “మెదీకి అప్పుడు చెమటలు పట్టాయి”: ఉద్ధవ్ ఠాక్రే
Uddhav Thackeray: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకొని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అధినేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శల వర్షం కురిపించారు. శివసేన పార్టీ పేరు, గుర్తు (విల్లు, బాణం)ను సీఎం ఏక్‍నాథ్ షిండే వర్గానికి ఈసీ కేటాయించిన రెండు రోజుల తర్వాత ఆయన బీజేపీ (BJP) పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ నుంచి పార్టీ పేరు, గుర్తును లాక్కొని “ముగాంబో సంతోషిస్తున్నారు” అంటూ అమిత్ షాను ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మిస్టర్ ఇండియా సినిమాలోని ఈ డైలాగ్‍ను వాడారు. మరోవైపు 1993 ముంబై వరుస పేలుళ్లను గుర్తు చేస్తూ.. మోదీపై విమర్శలు చేశారు. బీజేపీ హిందుత్వం విభిన్నం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాలు ఇవే..
"అప్పుడు మోదీ ఎక్కడున్నారు?"
Uddhav Thackeray: 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు జరిగినప్పుడు మోదీ ఎక్కడున్నారని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. “1993 ముంబై వరుస పేలుళ్ల సమయంలో ముంబైను శివ సైనికులు కాపాడారు. ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడుతున్న వారు (నరేంద్ర మోదీ) అప్పుడు ఎక్కడ ఉన్నారు? వారి అడ్రస్ కూడా తెలియదు. వారు ఇప్పుడు 56 ఇంచుల ఛాతిని చాస్తున్నారు. అప్పుడు ఈ 56 ఇంచుల ఛాతి ఎక్కడుంది. అప్పుడు ఆయన(మోదీ)కు చెమటలు పట్టాయి” అని ముంబైలోని అంధేరీలో జరిగిన ఓ సభలో ఠాక్రే ఆదివారం అన్నారు.
తన తండ్రి బాలా సాహెబ్ ఠాక్రే గుర్తింపు వెంట ప్రధాని మోదీ పడుతున్నారని ఉద్ధవ్ విమర్శించారు. శివసేన పార్టీ పేరును, గుర్తును ఏక్‍నాథ్ షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల కేటాయించింది. షిండే సహా 40 మంది శివసేన ఎమ్మెల్యేలు గతేడాది పార్టీ నుంచి బయటికి వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఉద్ధవ్ సీఎం పదవి కోల్పోయారు. షిండే సీఎం అయ్యారు. తాజాగా పార్టీ, గుర్తు కూడా షిండే వర్గానికి వెళ్లిపోయింది. దీంతో ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన పార్టీని అక్రమంగా తన నుంచి దొంగలించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"గొడవ పడడం వారికి కావాలి"
Uddhav Thackeray: “నిన్న, ఒకాయన (అమిత్ షా) పుణెకు వచ్చారు.ఇది చాలా మంది రోజు అని అన్నారు. ఎందుకంటే వారు శివసేన పేరును, పార్టీ గుర్తును తమతో వచ్చిన బానిసలకు ఇచ్చారు. అందుకే పరిస్థితి చాలా బాగుందని ఆయన (అమిత్ షా) అన్నారు. ‘మొగాంబో ఖుష్ హువా’” అని ఠాక్రే చెప్పారు. “ప్రస్తుత మొగాంబోలు వీరే. ఒరిజినల్ మొగాంబోలాగే, వీరికి కూడా ప్రజలు గొడవ పడడం కావాలి. అప్పుడే వారు అధికారాన్ని ఆస్వాదించగలరు” అని ఠాక్రే విమర్శించారు.
Uddhav Thackeray: బీజేపీ హిందుత్వ వేరే
తాను ఎప్పటికీ హిందుత్వవాదినేనని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. హిందుత్వాన్ని తాను ఏనాడు వదలలేదని చెప్పారు. “నేను ఎప్పటికీ హిందుత్వవాదినే. హిందుత్వాన్ని నేను ఎప్పుడూ వీడలేదు. ఎప్పటికీ విడబోను. నేను బీజేపీని మాత్రమే వదిలాను. బీజేపీ అంటే హిందుత్వం అని కాదు. వారి (బీజేపీ) హిందుత్వాన్ని నేను గుర్తించను. మా తండ్రి నాకు హిందుత్వాన్ని నేర్పారు. బీజేపీ హిందుత్వం విభిన్నంగా ఉంటుంది. ఒకరికొకరు గొడవ పడేలా చేయడం, అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీ పద్ధతి. మా హిందుత్వం దేశంతో అనుసంధానం అయి ఉంటుంది” అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.