Tomato flu | కొత్త ముప్పు టొమాటో ఫ్లూ; పిల్లలపై పెను ప్రభావం.. లక్షణాలివే
23 August 2022, 19:59 IST
- Tomato flu | టొమాటో ఫ్లూ పేరుతో కొత్త జబ్బు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా పిల్లలపై ఇది పెను ప్రభావం చూపుతోంది. ఈ ఇన్‌ఫెక్షన్‌కు లోనైన పిల్లలకు చికిత్స చాలా కష్టమవుతోంది. ఈ ఇన్‌ఫెక్షన్ ప్రభావాలపై లాన్సెట్ జర్నల్ ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.
ప్రతీకాత్మక చిత్రం
Tomato flu | టొమాటో ఫ్లూని నియంత్రించలేకపోతే.. పరిణామాలు తీవ్రంగా మారుతాయని లాన్సెట్ హెచ్చరించింది. అలాగే, పిల్లల్లో ఈ ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించలేకపోతే.. ఇది పెద్దలకు కూడా సోకుతుందని, తద్వారా వ్యాప్తి వేగంగా జరుగుతుందని హెచ్చరించింది.
Tomato flu | కేరళలో..
ఈ టొమాటో ఫీవర్ లేదా టొమాటో ఫ్లూ ను భారత్‌లో మొదట కేరళలో గుర్తించారు. ఈ సంవత్సరం మే 6వ తేదీన కొల్లాం జిల్లాలో తొలి కేసును గుర్తించారు. ఆ తరువాత జులై 26 లోపు దాదాపు 82 మంది పిల్లలకు ఇది సోకింది. వారిలో ఐదేళ్లలోపు పిల్లలే ఎక్కువ. ఈ ఫ్లూ సాధారణంగా పిల్లలకే ఎక్కువగా వస్తుంది. అయితే, దీన్ని నియంత్రించలేకపోతే మాత్రం ఇది పెద్దలకు కూడా వ్యాపిస్తుంది.
Tomato flu | లాన్సెట్ హెచ్చరిక..
ఈ ఫ్లూపై సైన్స్ జర్నల్ `లాన్సెట్` ఆగస్ట్ 17న ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. అందులో ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తే జరిగే ప్రమాదంపై పలు హెచ్చరికలు జారీ చేసింది. `ఇది సాధారణంగా చిన్నారులకు సోకుతుంది. అపరిశుభ్ర పరిసరాల కారణంగా, ఇన్‌ఫెక్షన్ సోకినవారితో దగ్గరగా మసలడం వల్ల, వారి వస్తువులను తాకడం వల్ల ఇది సోకుతుంది. నియంత్రించనట్లయితే, ఇది పెను ప్రభావం చూపుతుంది` అని లాన్సెట్ హెచ్చరించింది.
Tomato flu | ఆ పేరెలా వచ్చింది..
ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిన వారికి శరీరంపై టొమాటొ పండు రంగులో ఎర్రని పొక్కులు వస్తాయి. అవి క్రమంగా చిన్నపాటి టొమాటో సైజుకు వస్తాయి. వాటివల్ల పిల్లలకు చాలా బాధ కలుగుతుంది. అలాగే, ఈ వైరస్ సోకినవారికి జ్వరం, నీరసం, ఒళ్లు నొప్పులు, చర్మంపై ర్యాషెస్ వస్తాయి. అయితే, అదృష్టవశాత్తూ ఇది ప్రాణాంతకం కాదు.