Cyclone Sitrang live updates : దూసుకొస్తున్న 'సిత్రంగ్'.. ఈ రాష్ట్రాలకు అలర్ట్
22 October 2022, 7:59 IST
- Cyclone Sitrang live updates : సిత్రంగ్ తుపాను నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. కాగా.. ఈ నెల 25న సిత్రంగ్ తుపాను పశ్చిమ్ బెంగాల్- బంగ్లాదేశ్‌లో తీరం దాటుతుందని తెలుస్తోంది.
దూసుకొస్తున్న సిత్రంగ్ తుపాను!
Cyclone Sitrang live updates : అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. తుపానుగా మారి ఈ నెల 25న పశ్చిమ్ బెంగాల్- బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ(భారత వాతావరణశాఖ) వెల్లడించింది. ఆ సమయంలో గంటకు 110కి.మీల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది. సిత్రంగ్ తుపాను నేపథ్యంలో పలు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది.
"ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయువ్యం- ఉత్తరంవైపు ప్రయాణించే అవకాశం ఉంది. 23న తీవ్ర వాయుగుండంగా మారుతుంది. 24న తుపానుగా మారుతుంది. పశ్చిమ- మధ్య, తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. అక్కడి నుంచి ఉత్తరం-ఈశాన్యవైపు ప్రయాణిస్తుంది. ఫలితంగా ఒడిశాలో తీరం దాటదు. పశ్చిమ్ బెంగల్-బంగ్లాదేశ్ మధ్య ఈ నెల 25న తీరం దాటుతుంది," అని ఐఎండీ వెల్లడించింది.
Cyclone Sitrang : ఐఎండీ రిపోర్టు ప్రకారం.. ఈ నెల 23 నుంచి 25 వరకు ఒడిశాలో విస్త్రతంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయి. పశ్చిమ్ బెంగాల్‌లోని గ్యాంగటిక్ ప్రాంతంలో 24-26 వరకు భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయి. దక్షిణ 24 పరగణాస్, ఉత్తర్ 24 పరగణాస్, పూర్బ మేదినీపూర్ ప్రాంతాల్లో వర్షాల ప్రభావం అధికంగా ఉంటుంది.
"ఈ నెల 24న.. దక్షిణ 24 పరగణాస్, ఉత్తర 24 పరగణాస్, పూర్బ మేదినీపూర్‌లో గాలులు గంటకు 45-55కి.మీల వేగంతో వీస్తాయి. 66కి.మీల వేగం వరకు వెళ్లొచ్చు. 25వ తేదీన ఆయా ప్రాంతాల్లో గంటకు 110 కి.మీల వేగంతో గాలులు వీస్తాయి. అదే సమయంలో కోల్‌కతా, హోరాలో గంటకు 30-50కి.మీల వేగంతో గాలులు వీస్తాయి," అని ఐఎండీ పేర్కొంది.
ప్రస్తుతానికైతే సిత్రంగ్ తుపాను ప్రభావం భారీగా ఉండకపోవచ్చని ఐఎండీ వెల్లడించింది. రానున్న రోజుల్లో సిత్రంగ్ తుపాను ప్రభావంపై అప్డేట్ చేస్తామని స్పష్టం చేసింది.
ప్రభుత్వాలు అప్రమత్తం..
Cyclone Sitrang landfall : సిత్రంగ్ తుపాను నేపథ్యంలో కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సెంట్రల్ కేబినెట్ సెక్రటరీ రాజివ్ గౌబా.. తుపాను సన్నాహాలపై సమీక్ష నిర్వహించారు. సిత్రంగ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిత్రంగ్ తుపాను తీరం దాటే ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు.
సిత్రంగ్ తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. మత్సకారులను అప్రమత్తం చేశారు. సముద్రంలోకి వెళ్లిన వారిని వెనక్కి రప్పించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సన్నద్ధమవుతున్నాయి.