Economic Survey | ఎకనమిక్ సర్వే చెప్పిందేంటి? ఇవీ ముఖ్యాంశాలు
31 January 2022, 14:05 IST
- 2021-22 ఏడాది ఆర్థికసర్వేను సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా బడ్జెట్ ముందు రోజు గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక ప్రగతి ఎలా ఉంది? రానున్న ఏడాదిలో ఎలా ఉండబోతోందన్న అంచనాలు ఈ ఆర్థిక సర్వేలో ఉంటాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో జీడీపీ వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతంగా ఉండొచ్చని ఈ సర్వే అంచనా వేసింది. ఇది గతేడాది అంచనా (9.2 శాతం) కంటే తక్కువ కావడం గమనార్హం. జీడీపీ వృద్ధి రేటుతోపాటు వివిధ రంగాల వృద్ధిని కూడా ఈ సర్వే దేశం ముందు ఉంచింది.
ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు ఇవీ..
- కరోనా మహమ్మారి అన్ని రంగాలపై ప్రభావం చూపినా.. వ్యవసాయం రంగం మాత్రం చెప్పుకోదగిన వృద్ధి సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.9 శాతం వృద్ధి సాధించినట్లు సర్వే స్పష్టం చేసింది. ఇది గతేడాది 3.6 శాతంగా ఉంది.
- ఇక పారిశ్రామిక రంగం 11.8 శాతం వృద్ధిని, సేవల రంగం 8.2 శాతం వృద్ధి సాధించనున్నట్లు సర్వే తేల్చింది.
- 2021-22లో ప్రభుత్వ వినియోగం 7.6 శాతంగా ఉండనుందని తెలిపింది. ఇది కరోనా మహమ్మారి కంటే ముందు ఉన్న స్థాయి కావడం విశేషం.
- ఇక 2021-22లో ఎగుమతులు కూడా 16.5 శాతం మేర పెరగనున్నాయని సర్వే వెల్లడించింది.
- అదే సమయంలో దిగుమతులు 29.4 శాతం మేర పెరగనున్నాయి.
- ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయాలు పెరగడంతో వినియోగం కూడా 7 శాతం మేర పెరిగింది.
- దేశవ్యాప్తంగా UPI ట్రాన్జాక్షన్లు పెరుగుతున్న విధానాన్ని కూడా ఈ సర్వే కళ్లకు కట్టింది. ఒక్క డిసెంబర్ నెలలోనే దేశవ్యాప్తంగా 460 కోట్ల యూపీఐ ట్రాన్జాక్షన్లు జరిగినట్లు తెలిపింది. ఈ లావాదేవీల విలువ రూ.8.26 లక్షల కోట్లు కావడం విశేషం.
ఏంటీ ఆర్థిక సర్వే?
ప్రతి ఏటా పార్లమెంట్‌లో బడ్జెట్ ముందు రోజు ప్రవేశపెట్టే ఈ ఆర్థిక సర్వే గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశ పురోగతి ఎలా ఉందో కళ్లకు కడుతుంది. ఈ సర్వేను చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ నేతృత్వంలోని బృందం తయారు చేస్తుంది.
ఈసారి ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడానికి కొన్ని రోజుల ముందే కేంద్రం.. కొత్త చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా వి.అనంత నాగేశ్వరన్‌ను నియమించిన విషయం తెలిసిందే. ఈ సర్వే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన దేశ జీడీపీ వృద్ధిరేటును కూడా అంచనా వేస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ అంచనాలు పూర్తిగా తలకిందులవుతాయి.
ఉదాహరణకు 2020-21లో దేశ వృద్ధిరేటు 6 నుంచి 6.5 శాతంగా ఉంటుందని సర్వే అంచనా వేయగా.. కరోనా దెబ్బకు అది కాస్తా మైనస్ 7.3 శాతానికి పడిపోయింది. ఆ ఏడాది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్లు విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి.
అయితే ఆ తర్వాత కేంద్రం, ఆర్బీఐ తీసుకున్న కొన్ని చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడింది. కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగకపోయినా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.