తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Thailand Bus Fire Accident : ట్రిప్‌కి వెళ్లి వస్తుండగా స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థులు మృతి

Thailand Bus Fire Accident : ట్రిప్‌కి వెళ్లి వస్తుండగా స్కూల్ బస్సులో మంటలు.. 25 మంది విద్యార్థులు మృతి

Anand Sai HT Telugu

01 October 2024, 20:12 IST

google News
    • Thailand Bus Fire Accident : స్కూల్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరిగింది. బస్సు టైరు పగిలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.
థాయ్‌లాండ్ బస్సు ప్రమాదం
థాయ్‌లాండ్ బస్సు ప్రమాదం

థాయ్‌లాండ్ బస్సు ప్రమాదం

బ్యాంకాక్‌లోని సబర్బన్‌లో బస్సు టైరు పగిలిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది. 44 మందితో బస్సు ఉథాయ్ థాని ప్రావిన్స్‌ నుంచి తిరిగి వస్తుంది. పాఠశాల విద్యార్థులు, వారి టీచర్లు ట్రిప్‌కు వెళ్లివస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు ముందు టైరు పగిలిపోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG)తో నడిచేది. క్రాష్ కారణంగా ట్యాంకుల్లో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే బస్సులోకి మంటలు వ్యాపించాయి.

కింద నుంచి దట్టమైన నల్లటి పొగలు కూడా వచ్చాయి. బస్సు మంటల్లో చిక్కుకున్నట్లు కనిపించే వీడియో ఫుటేజీని నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు అతడి కోసం అధికారులు వెతుకుతున్నారు.

బస్సులో ఉన్న 44 మందిలో 16 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు తప్పించుకోగలిగారు. అయినప్పటికీ, దాదాపు 25 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువగా విద్యార్థులే ఉన్నట్టుగా తెలుస్తోంది. బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగడంతో చాలా మంది విద్యార్థులు బస్సు వెనుక భాగంలో చిక్కుకున్నారు.

ఎక్కువగా చిన్నారుల మృతదేహాలను ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. 'మేము రక్షించిన వారిలో కొన్ని మృతదేహాలు చిన్నారులవి.' అని ఓ అధికారి వెల్లడించారు. మంటలు పూర్తిగా ఆర్పేందుకు గంటల తరబడి సమయం పట్టడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. మంటల తీవ్రత కారణంగా బాధితులను గుర్తించడం సమస్యగా మారింది.

థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి పేటోంగ్‌టార్న్ షినవత్రా బాధిత కుటుంబాలకు ఎక్స్‌లో ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, వైద్య ఖర్చులను భరిస్తానని, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తానని హామీ ఇచ్చారు.

మృతుల వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. ప్రమాదం తర్వాత 16 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. ఘటనకు గల కారణాలపై దర్యాపు జరుగుతోంది.

తదుపరి వ్యాసం