Tesla layoffs 2022 : టెస్లాలో ఉద్యోగాలు 'కట్'- ఏకంగా ఆఫీసునే మూసేశారు!
29 June 2022, 13:43 IST
Tesla layoffs 2022 : ఎలాన్ మస్క్ చెప్పినట్టే.. టెస్లాలో ఉద్యోగాల కోత మొదలైంది. ఇప్పటికే ఓ కార్యాలయాన్ని మూసివేశారు. ఫలితంగా ప్రజల్లో రెసెషన్ భయాలు మరింత పెరిగిపోయాయి.
టెస్లా
Tesla layoffs 2022 : అమెరికాలో రెసెషన్ భయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే.. అనేక సంస్థలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. తాజాగా.. ఈ జాబితాలోని అపరకుబేరుడు ఎలాన్ మస్క్ సీఈఓగా ఉన్న 'టెస్లా' కూడా చేరింది. 'కాస్ట్ కట్టింగ్' పేరుతో జోరుగా ఉద్యోగులను తొలగిస్తోంది టెస్లా. ఈ క్రమంలోనే పనిచేసేవాళ్లు లేక.. కాలిఫోర్నియా శాన్ మాటియోలోని టెస్లా కార్యాలయం మూతపడిపోయింది!
టెస్లాలో ఉద్యోగాల తొలగింపు విషయంపై ఎలాన్ మస్క్ ముందే సంకేతాలిచ్చారు.
"ఆర్థిక వ్యవస్థపై నాకు భయంగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోని 10శాతం సిబ్బందిని కట్ చేయాల్సి ఉంటుంది," అని కొన్ని నెలల క్రితమే ఎలాన్ మస్క్ చెప్పారు. అందుకు తగ్గట్టుగానే టెస్లా చర్యలు తీసుకుంటోంది.
అయితే.. శాలరీ వర్కర్లపైనే ఈ ప్రభావం ఉంటుందని, గంటల చొప్పున పనిచేసే వారికి ఇది వర్తించదని మస్క్ అన్నారు. కానీ ఇప్పుడు మూకుమ్మడిగా ఉద్యోగాలను తొలగిస్తున్నారని తెలుస్తోంది.
"శాన్ మాటియోలో సంస్థ కార్యాలయం లీజు పూర్తికావస్తోంది. వేరే చోటికి తరలిస్తారని తొలుత మాకు చెప్పారు. కానీ ఇప్పుడు ఉద్యోగాలనే తీసేసి, కార్యాలయాన్ని మూసివేశారు. మేము షాక్‌లో ఉన్నాము," అని ఓ ఉద్యోగి చెప్పారు.
కొవిడ్ వల్ల వాహన తయారీ సంస్థలపై పెద్ద ప్రభావమే పడింది. ఆ తర్వాత కూడా.. చైనాలో లాక్డౌన్ల కారణంగా షాంఘైలోని టెస్లా కార్యాలయం సరిగ్గా పనిచేయలేదు. ఫలితంగా టెస్లాకు నష్టాలు వాటిల్లాయి. అదే సమయంలో ముడిసరకు ధరలు పెరిగాయి. సప్లై చెయిన్ వ్యవస్థ దెబ్బతింది. ఫలితంగా టెస్లా నష్టాలు మరింత పెరిగాయి.
నెట్‌ఫ్లిక్స్ కూడా..
Netflix layoffs 2022 : 10ఏళ్లల్లో తొలిసారిగా సబ్స్క్రైబర్లను కోల్పోయిన స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇందుకోసం ఉద్యోగాల్లో కోత విధిస్తోంది. ఇప్పటికే 300మంది ఉద్యోగులను ఇళ్లకి పంపేసింది. అంటే కంపెనీలోని ఉద్యోగుల్లో ఇది 4శాతం!
ఒక్క అమెరికాలోనే.. నేల రోజుల వ్యవధిలో 150 ఉద్యోగులను తొలగించింది నెట్‌ఫ్లిక్స్.
"వ్యాపారంలో మెరుగుపడటానికి మేము నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ ఉద్యోగులను తొలగించక తప్పడం లేదు. రెవెన్యూ వృద్ధి తగ్గిపోవడంతో ఖర్చులను మేనేజ్ చేయాల్సి వస్తోంది," అని గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్.
ద్రవ్యోల్బణం, ఇతర స్ట్రీమింగ్ సంస్థల కారణంగా పెరుగుతున్న పోటీ వల్ల నెట్‌ఫ్లిక్స్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నడూ లేని విధంగా.. ఆ సంస్థ సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఈ త్రైమాసికంలోనూ ఇదే కొనసాగుతుందని అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే సంస్థ సన్నద్ధమవుతోంది.
మరోవైపు సబ్స్క్రైబర్లను ఆకట్టుకునేందుకు తక్కువ ధరలతో ఆకర్షణీయమైన ప్లాన్స్‌ను తీసుకొచ్చే యోచనలో ఉంది నెట్‌ఫ్లిక్స్. ఇందుకోసం అనేక దేశాలతో చర్చలు జరుపుతోంది.
Recession 2022 : ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతోంది ఫెడ్. ఫలితంగా అమెరికాలో మాంద్యం వస్తుందని అంచనాలు, భయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో.. ఉద్యోగులను నెట్‌ఫ్లిక్స్ తొలగిస్తోందన్న వార్తలు.. మాంద్యం భయాలను మరింత పెంచుతున్నాయి.