Lay off in WhiteHat Jr | `వైట్‌హ్యాట్ జూనియర్` ఉద్యోగులకు లే ఆఫ్
ప్రముఖ ఎడ్యుటెక్ సంస్థ `వైట్‌హ్యాట్ జూనియర్` నుంచి ఉద్యోగులను తొలగించే కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా, మరో 300 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది.
`వైట్‌హ్యాట్ జూనియర్` ప్రముఖ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థ. ఇది మరో ఎడ్యుటెక్ సంస్థ `బైజూస్` నియంత్రణలో ఉంది.
Lay off in WhiteHat Jr : స్టార్ట్ అప్ కంపెనీల్లో
`వైట్‌హ్యాట్ జూనియర్` సంస్థ తాజాగా 300 మంది ఉద్యోగులను సాగనంపింది. ముఖ్యంగా, సేల్స్, అండ్ మార్కెటింగ్ విభాగాల నుంచి ఎక్కువ మంది ఉద్యోగులను పంపించివేసింది. ఇప్పటికే మే నెలలో ఈ సంస్థ నుంచి 800 మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. తక్షణమే వేరే నగరానికి వెళ్లాలన్న ఆదేశాలతో, వారు తప్పనిసరై రాజీనామా చేశారు. ఎడ్యుటెక్ రంగంలో నెలకొన్న సంక్షోభానికి ఉదాహరణగా ఈ లేఆఫ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ట్ అప్ కంపెనీల్లో ఈ సంక్షోభం తీవ్రంగా కనిపిస్తోంది.
మొదట్లో విపరీతంగా రిక్రూట్‌మెంట్..
మొదట్లో వైట్‌హ్యాట్ జూనియర్ సహా చాలా ఎడ్యుటెక్ స్టార్ట్ అప్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి. వేతనాలను కూడా పెద్ద ఎత్తున్నే ఆఫర్ చేసింది. దాంతో, ఆయా కంపెనీల్లో ఈ ఖర్చు చాలా పెరిగింది. ఆ స్థాయిలో ఆదాయం లేకపోవడం, ఆశించినంత ఫండింగ్ రాకపోవడంతో ఈ ఎడ్యుటెక్ స్టార్ట్ అప్‌లు నష్టాల బారిన పడుతున్నాయి. భారత్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Lay off in WhiteHat Jr : అఫీషియల్ స్టేట్‌మెంట్
తాజా లేఆఫ్‌పై వైట్‌హ్యాట్ జూనియర్ అఫీషియల్‌గా స్పందించింది. ``పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బిజినెస్‌లో ఉన్న మేం.. మా బిజినెస్‌ను రీస్ట్రక్చర్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా మా ప్రాథమ్యాలను పునర్నిర్వచించుకుంటున్నాం. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అవసరమైన టీం ను రూపొందించుకోవడంపై దృష్టి పెట్టాం`` అని ఆ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో 30 కోట్ల డాలర్లకు వైట్‌హ్యాట్ జూనియర్‌ను బైజూస్ కొనుగోలు చేసింది.