ట్విట్టర్లో 73.5మిలియన్ షేర్లు కొన్న మస్క్.. సంస్థపై పట్టుకోసమేనా?
04 April 2022, 17:21 IST
శాన్ ఫ్రాన్సిస్కొ: ట్విట్టర్లో మస్క్.. 73.5 మిలియన్ షేర్లను కొన్నారు. దీని విలువ 3బిలియన్ డాలర్లని తెలుస్తోంది.
ఎలాన్ మస్క్
Musk twitter stake | అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్లో 73.5మిలియన్ షేర్లు కొనుగోలు చేశారు. దీని విలువ 3 బిలియన్ డాలర్లని సమాచారం. ఫలితంగా ట్విట్టర్లో మస్క్ 9.2శాతం వాటా సంపాదించుకున్నారు.
ట్విట్టర్లో మస్క్ వాటాను పాసివ్ ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తారు. అంటే సంస్థలో మస్క్‌ను దీర్ఘకాలిక పెట్టుబడిదారుడిగా లెక్కిస్తారు. షేర్లను ఆయన అమ్ముకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు.
ట్విట్టర్ నిబంధనలపై ఇటీవలే మస్క్ తన అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో.. అదే కంపెనీలో 9.2శాతం వాటా పొందడం ప్రాధాన్యం సంతరించుకుంది. భావప్రకటనా స్వేఛ్చకు ట్విట్టర్ భంగం కలిగిస్తోందని మస్క్ పలుమార్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌కు ధీటుగా ఓ సోషల్ మీడియా యాప్‌ను సృష్టించే విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
"ఇది ఆరంభమే అని మేము అనుకుంటున్నాము. ప్రస్తుతానికి ఇది పాసివ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. కానీ మస్క్.. తన వాటాను గణనీయంగా పెంచుకుని.. సంస్థలో క్రియాశీలకంగా వ్యవహరించవచ్చు. ట్విట్టర్ ఓనర్షిప్ పాత్రకు అర్హత సాధించవచ్చు," అని వెడ్‌బుష్ సెక్యూరిటీస్‌కు చెందిన డాన్ ఇవీస్ అభిప్రాయపడ్డారు.
మస్క్ వాటా వార్తతో ట్విట్టర్ షేర్లు.. మార్కెట్ ఓపెనింగ్‌కు ముందే 25శాతం పెరిగాయి. టెస్లా షేర్లు స్వల్పంగా పైకెళ్లాయి.
ఆ ట్వీట్లో ఏముందంటే…
Elon Musk twitter | భావప్రకటనా స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చి, వ్యక్తిగత ప్రయోజనాలు లేని, ఓపెన్ సోర్స్ ఆల్గొరిథంతో కూడిన సామాజిక మాధ్యమ వేదికను తీసుకొస్తారా? అని ఓ ట్విట్టర్ వినియోగదారుడు ఇటీవలే మస్క్‌ను ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే.. కొత్త సోషల్ మీడియా యాప్‌ను రూపొందించే విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు మస్క్.
ట్విట్టర్లో మస్క్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. కాగా గత కొంతకాలంగా.. ట్విట్టర్, సంస్థ విధానాలపై ఆయన విమర్శలు చేస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛ విలువలను పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని ట్విట్టర్‌పై అనేకమార్లు మండిపడ్డారు.
ఇదే విషయంపై ఆయన ట్విట్టర్లో ఓ పోల్ కూడా నిర్వహించారు. 'ట్విట్టర్.. ఫ్రీ స్పీచ్‌కు విలువ ఇస్తుందా?' అని ఆయన ప్రశ్నించారు. 'ఈ పోల్ అనంతర పరిణామాలు చాలా కీలకంగా ఉంటాయి, జాగ్రత్తగా ఓట్లు వేయండి,' అని పేర్కొన్నారు. మస్క్ అడిగి ప్రశ్నకు 70శాతం మంది యూజర్లు 'నో' అనే జవాబిచ్చారు. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే.. కొత్త సోషల్ మీడియా వేదిక గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు మస్క్ చెప్పడం గమనార్హం.
అనేకమంది ప్రముఖులు సొంతంగా తమ సోషల్ మీడియా యాప్‌లను తీసుకొస్తున్నారు. ఇటీవలే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 'ట్రూత్' పేరుతో ఓ యాప్‌ను విడుదల చేశారు. కాగా మస్క్ నిజంగానే యాప్‌ను తీసుకొస్తే.. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి దిగ్గజ సామాజిక మాధ్యమాలకు పోటీ తప్పదు అనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
టాపిక్