National Teachers Award 2022 : నేషనల్ టీచర్స్ అవార్డు అందుకున్న తెలంగాణవాసి
05 September 2022, 16:05 IST
- National Teachers Award 2022 : ఈసారి 45మంది టీచర్లు.. నేషనల్ టీచర్స్ అవార్డును అందుకున్నారు. వారిలో తెలంగాణవాసి కండాల రామయ్య కూడా ఉన్నారు.
నేషనల్ టీచర్స్ అవార్డు అందుకున్న తెలంగాణవాసి
National Teachers Award 2022 : జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవరం సందర్భంగా.. 2022 నేషనల్ టీచర్స్ అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వివిధ విధానాలతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపి, వారిలో ప్రతిభను బయటకు తీసుకొచ్చిన పలువురు ఉపాధ్యాయులు.. రాష్ట్రపతి చేతుల మీదుగా 2022 నేషనల్ టీచర్స్ అవార్డును తీసుకున్నారు. వీరిలో తెలంగాణవాసి కండాల రామయ్య కూడా ఉన్నారు.
కండాల రామయ్య, జెడ్పీ హై స్కూల్ అబ్బాపూర్..
Kandala Ramaiah ZP High School Abbapur : తెలంగాణ అబ్బాపూర్‌లోని జిల్లా పరిషద్ హై స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు కండాల రామయ్య. స్థానిక పరిసరాలను ఉపయోగించుకుని.. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో గణితాన్ని నేర్పిస్తుండటం కండాల రామయ్య ప్రత్యేకత! 'మ్యాథ్ రంగోలీ'ని ప్రవేశపెట్టారు. ముఖ్యమైన ఆకారాలను రంగోలీగా గీసి, అవసరమైతే వాల్ పెయింట్స్ కూడా వేసి విద్యార్థులకు బోధిస్తున్నారు.
అంతేకాకుండా.. స్కూలులో మౌలిక వసతులను పెంపొందించేందుకు.. సామాజిక మాధ్యమాల ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేపట్టారు కండాల రామయ్య. "మన ఊరు- మన బడి" అనే నినాదంతో ముందుకు సాగుతూ.. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిస్తున్నారు.
కండాల రామయ్యతో పాటు.. మొత్తం మీద 45మంది నేషనల్ టీచర్స్ అవార్డులను దక్కించుకున్నారు. వారిలో కొందరు..
- అమిత్ కుమార్- జవహర్ నవోదయ్ విద్యాలయ, హిమాచల్ ప్రదేశ్.
- మమత అహర్- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అసిస్టెంట్ టీచర్- రాయ్‌పూర్.
- మహమ్మద్ జబీర్- గవర్నమెంట్ మిడిల్ స్కూల్- కార్గిల్ లద్దాఖ్.
- అరుణ్ కుమార్ గర్గ్- జీఎంఎస్ఎస్ డేటావాస్ ప్రిన్సిపాల్ పంజాబ్.
- గమ్చి తిమ్రి ఆర్. మారక్- ఎడ్జ్యూకేర్ హయ్యర్ సెకండరీ స్కూల్- మేఘాలయ.
- కుర్షీద్ అహ్మద్- కాంపోజిట్ స్కూల్ సాహావా- ఉత్తర్‌ప్రదేశ్.
- రజ్ని శర్మ- నిగం ప్రతిభ విద్యాలయ- వాయువ్య ఢిల్లీ.
భారత దేశా తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా.. ప్రతి ఏటా సెప్టంబర్ 5న.. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది దేశం. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపి, వారిలో ప్రతిభను గుర్తించే పలువురు ఉపాధ్యాయులకు ప్రతియేట నేషనల్ టీచర్స్ అవార్డులు ఇస్తోంది కేంద్రం.