CUET merge with JEE, NEET: సీయూఈటీలో జేఈఈ, నీట్ విలీనంపై యూజీసీ కీలక ప్రకటన
16 August 2022, 17:16 IST
- CUET merge with JEE, NEET: సాంకేతిక అవరోధాలు సీయూఈటీలో జేఈఈ, నీట్ విలీన ప్రతిపాదనలపై ప్రభావం చూపవని యూజీసీ స్పష్టం చేసింది.
సీయూఈటీలో జేఈఈ, నీట్ విలీన ప్రక్రియపై యూజీసీ ప్రకటన
న్యూఢిల్లీ, ఆగస్టు 16: కామన్ యూనివర్శిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) తొలిదశలో ఎదురైన సాంకేతిక లోపాలు జేఈఈ, నీట్‌లతో విలీనం చేయాలనే ప్రతిపాదనపై ప్రభావం చూపబోవని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు.
పరీక్ష నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తామని కుమార్ తెలిపారు.
‘సీయూఈటీ-యూజీ ప్రారంభ దశలలో సాంకేతిక లోపాలు ఎదురుదెబ్బలు కావు. అవి పాఠాలు. సమీప భవిష్యత్తులో అన్నీ పరిష్కారమవుతాయి. విస్తరణ ప్రణాళికలను అవి ఏ విధంగానూ నిరోధించవు..’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
భవిష్యత్తులో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లను కూడా సీయూఈటీలో విలీనం చేస్తామని కుమార్ గతంలో చెప్పారు.
‘ఎన్‌ఈపీ ప్రకారం.. ఒకటి కంటే ఎక్కువ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై భారాన్ని తగ్గించడానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షను కలిగి ఉండాలనేది ప్రణాళిక. అయితే, మేం బాగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉన్నందున దానిని అమలు చేయడానికి తొందరపడం. ఇది ఒక భారీ కసరత్తు. సీయూఈటీ నిర్వహించేటప్పుడు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటాం..’ అని వివరించారు. విలీనం ఎప్పుడు జరుగుతుందని భావిస్తున్నారని అడిగిన ప్రశ్నకు.. విధివిధానాలు ఇంకా రూపొందించలేదని కుమార్ చెప్పారు.
‘ఈ నెలాఖరులోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో జరుగుతున్న అన్ని ముఖ్యమైన ప్రవేశ పరీక్షలను ఇది అధ్యయనం చేస్తుంది. వచ్చే ఏడాది పరీక్షను ప్రవేశపెట్టాల్సి వస్తే, భారీ సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభించాలి..’ అని వివరించారు.
సీయూఈటీ-యూజీ తొలి విడత జూలైలో ప్రారంభమైంది. పలు అవాంతరాల కారణంగా అనేక కేంద్రాలలో పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. పరీక్షకు ఒకరోజు ముందు రాత్రి చాలా మంది విద్యార్థులకు రద్దు గురించి తెలియజేశారు. కాగా సీయూఈటీ నాలుగో దశ బుధవారం ప్రారంభం కానుంది.
నీట్ -యూజీ భారతదేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్ష. సగటున 18 లక్షల దరఖాస్తులు అందాయి. ఆ తరువాత 14 లక్షల దరఖాస్తులతో సీయూఈటీ-యూజీ రెండో అతి పెద్ద పరీక్షగా నిలుస్తోంది. జేఈఈకి 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ-మెయిన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. కాగా నీట్ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు.
‘పేపర్ మోడ్‌లో ఈ స్థాయి పరీక్షను నిర్వహించడం చాలా కష్టం. సంవత్సరానికి రెండుసార్లు, కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించడం మేలు..’ అని ఆయన చెప్పారు.
‘సీయూఈటీ కంటే జేఈఈ, నీట్‌లలో సబ్జెక్టుల వైవిధ్యం తక్కువగా ఉంది..’ అని వివరించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్చిలో అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్లను 12వ తరగతి మార్కుల ఆధారంగా కాకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీయూఈటీ) ద్వారా నిర్వహిస్తామని ప్రకటించింది.