తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market Crash : స్టాక్​ మార్కెట్​లో రక్తపాతం.. నిమిషాల్లో రూ. 7లక్షల కోట్లు ఆవిరి!

Stock market crash : స్టాక్​ మార్కెట్​లో రక్తపాతం.. నిమిషాల్లో రూ. 7లక్షల కోట్లు ఆవిరి!

Sharath Chitturi HT Telugu

13 June 2022, 15:40 IST

    • Stock market crash : ద్రవ్యోల్బణం భయాలతో దేశీయ సూచీల్లో సోమవారం రక్తపాతం నమోదైంది. ఒకానొక దశలో రూ. 7లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది!
స్టాక్​ మార్కెట్​లో రక్తపాతం..
స్టాక్​ మార్కెట్​లో రక్తపాతం.. (REUTERS)

స్టాక్​ మార్కెట్​లో రక్తపాతం..

Stock market crash : స్టాక్​ మార్కెట్లలో సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో రక్తపాతం నమోదైంది! మార్కెట్లు పడుతున్న తీరు చూసి మదుపర్లు బెంబేలెత్తిపోయారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, ద్రవ్యోల్బణం భయాలతో దేశీయ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 1457 పాయింట్లు కోల్పోయి 52,847 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 427పాయింట్ల నష్టంతో 15,774 వద్ద ముగిసింది.

ఒకానొక దశలో బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీలు 3శాతం మేర నష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్​.. ఏకంగా 1,500 పాయింట్ల నష్టాన్ని చూసింది. ఫలితంగా.. నిమిషాల వ్యవధిలో దాదాపు రూ. 7లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది.

ఆ తర్వాత.. చివరి అరగంట సెషన్​లో మార్కెట్లు స్వల్పంగా కోలుకున్నాయి.

లాభాలు.. నష్టాలు..

సన్సెక్స్​ 30లో నెస్లే షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి.

స్టాక్​ మార్కెట్​ క్రాష్​లో బజాజ్​ ధ్వయం భారీగా పతనమైంది. బజాజ్​ ఫిన్​సర్వ్​ దాదాపు 7శాతం మేర నష్టాన్ని చూసింది. బజాజ్​ ఫినాన్స్​ 5.5శాతం నష్టాన్ని మూటగట్టుకుంది.

ఇండస్​ఇండ్​, టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంకు, ఎన్​టీపీసీ షేర్లు 4శాతం మేర నష్టపోయాయి.

ఇన్ఫీ, ఎస్​బీఐ, ఎల్​టీ, విప్రో, ఎన్​టీపీసీ షేర్లు 3శాతం నష్టాలను చూశాయి.

కారణాలు..

Stock market today : గతవారం విడుదలైన అమెరికా ద్రవ్యోల్బణం డేటా.. ప్రపంచ దేశాలను వణికించింది. మే నెలలో అమెరికా సీపీఐ.. 8.6శాతానికి చేరింది. ఇది 40ఏళ్ల గరిష్టం. ద్రవ్యోల్బణం కట్టడికి ఫెడ్​ చేపడుతున్న చర్యలు సరిపోవడం లేదని ఈ డేటా స్పష్టం చేస్తోంది. అందువల్ల.. ఫెడ్​ మరిన్ని కఠిన చర్యలు చేపట్టడం ఖాయమని మదుపర్లు ఒక నిర్ణయానికి వచ్చి.. భారీ అమ్మకాలు చేపట్టారు. ఫలితంగా అమెరికా స్టాక్​ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.

ఈ పరిణామాలు దేశీయ సూచీలపైనా పడ్డాయి. ఫలితంగా వారం ఆరంభంలోనే భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి.

ద్రవ్యోల్బణం తగ్గడం లేదని అమెరికా సీపీఐ డేటా స్పష్టం చేస్తోంది. కాగా.. సోమవారం.. భారత సీపీఐ డేటా కూడా వెలువడనుంది. ఇది కూడా.. అంచనాలకు మించి ఉండొచ్చని మదుపర్లు భావిస్తుండటంతో స్టాక్​ మార్కెట్లలో రక్తపాతం రికార్డైంది.

దేశీయ సూచీల్లో ఎఫ్​ఐఐలు భారీగా అమ్మకాలు చేపడుతున్నారు. వాస్తవానికి.. మార్కెట్లు పడటానికి ఉన్న ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. మరి సోమవారం ఎంత మేర విక్రయించారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కోలుకునేది ఎప్పుడో?

అమెరికా మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడినప్పుడే.. ప్రపంచ దేశాల్లోని స్టాక్​ మార్కెట్లలో ఒడుదొడుకులు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. దేశీయ సూచీలు కూడా అప్పటి వరకు నష్టాల్లోనే ఉంటాయని భావిస్తున్నారు.

తదుపరి వ్యాసం